జూన్​ 2 నాటికి కొత్త సెక్రటేరియట్!

జూన్​ 2 నాటికి  కొత్త సెక్రటేరియట్!

హైదరాబాద్ , వెలుగుకొత్త సెక్రటేరియట్ నిర్మాణాన్ని వచ్చే ఏడాది జూన్ 2 నాటి కల్లా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. శ్రావణ మాసంలో నిర్మాణ పనులు స్టార్ట్​ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 21 నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుంది. సుప్రీంకోర్టు, హైకోర్టు నుంచి అనుకూలంగా తీర్పు రావడంతో శుక్రవారం సాయంత్రం నుంచి సెక్రటేరియట్​ కూల్చివేత పనులు వేగంగా సాగుతున్నాయి. 12 ఫ్లోర్ లు ఉన్న జే , ఎల్ బ్లాకులను పెద్ద పెద్ద మెషిన్లతో కూల్చేస్తున్నారు. సోమవారం వరకు కూల్చివేతలు పూర్తయ్యే చాన్స్​ కనిపిస్తోంది. శిథిలాల తరలింపు ప్రాసెస్​ నేడో రేపో మొదలవుతుందని అధికార వర్గాలు అంటున్నాయి. కూల్చివేత పూర్తయిన తర్వాత లేదా కొత్త సెక్రటేరియట్​ నిర్మాణ పనులు స్టార్టయ్యే ముందు సీఎం కేసీఆర్​ సెక్రటేరియట్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆ వర్గాలు చెబుతున్నాయి.

 సీఎం స్పెషల్​ ఫోకస్

సెక్రటేరియట్ నిర్మాణంపై సీఎం కేసీఆర్ స్పెషల్​ ఫోకస్​ పెట్టారు. నిర్మాణ పనులను శ్రావణ మాసం లో స్టార్ట్ చేసి వచ్చే ఏడాది జూన్ 2 నాటికి అంటే రాష్ట్ర ఆవిర్బావం రోజు కల్లా పూర్తి చేయాలని ఆయన భావిస్తున్నట్లు టీఆర్​ఎస్​ వర్గాలు అంటున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం నుంచి పూర్తయ్యే దాకా వరుస సమీక్షలు, పర్యటనలు, సీసీ కెమెరాల ద్వారా పనుల పర్యవేక్షణ ఎలా చేశారో సెక్రటేరియట్ నిర్మాణాన్ని కూడా అలాగే సీఎం పర్యవేక్షించనున్నారని టీఆర్​ఎస్​ వర్గాలు చెబుతున్నాయి. కొత్త సెక్రటేరియట్​ నిర్మాణానికి త్వరలో టెండర్లు పిలవాలని అధికారులు ప్లాన్​చేస్తున్నారు. శనివారం ఆర్థికశాఖకు కొత్త సెక్రటేరియట్​ ప్రతిపాదనలు అందచేసినట్లు సమాచారం.