దేశానికి ప్రధాని అయినా బిడ్డకు తల్లే

దేశానికి ప్రధాని అయినా బిడ్డకు తల్లే

‘ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే’ పాత డైలాగ్​.. ‘దేశానికి ప్రధాని అయినా బిడ్డకు తల్లే’ ఇప్పుడు కొత్త సామెత. నిజమే! ప్రధాని పదవిలో ఉండగా బిడ్డకు జన్మనిచ్చిన రెండో నాయకురాలిగా న్యూజిలాండ్​ ప్రధాని ‘జెసిండా ఆడెర్న్​’ ప్రపంచానికి తెలుసు. ఇటీవల ఆమె  సమావేశంలో  ఉన్నప్పుడు తన బిడ్డ కోసం టైం తీసుకోవడం మరోమారు అందరి దృష్టిని ఆకర్షించింది. 

‘ప్రధాని పదవిని కిరీటంలా కాకుండా ఉద్యోగంలా ఫీలవుతా’ అని చెప్పిన మాటలతో మొదట్లోనే ఆమె ప్రపంచాన్ని ఆకర్షించింది. ఆ తర్వాత సోషల్​ మీడియా వేదికగా న్యూజిలాండ్​ ప్రజలకు ఆమె ఎప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజల నాయకురాలిగా పేరు తెచ్చుకుంది. కొవిడ్ టైంలో ఎంతో బాగా పనిచేసి న్యూజిలాండ్​ను కాపాడిన నాయకురాలిగా వార్తల్లో నిలిచింది. అయితే తాజాగా మరోసారి కొవిడ్ రూల్స్​ గురించి ఆమె అధికారులతో ఒక మీటింగ్​ ఏర్పాటు చేసింది.  ఈ సమావేశం అంతా ఫేస్​బుక్​ లైవ్​లో స్ట్రీమ్​ అయింది.   

దేశ పరిస్థితుల గురించి సీరియస్​గా  మాట్లాడుతుంటే... ఆమె మూడేళ్ల కూతురు ‘మమ్మీ’ అంటూ జెసిండాను పిలిచింది. పాపకు నవ్వుతూ జవాబు ఇచ్చి మళ్లీ మీటింగ్​లో  మాట్లాడటం మొదలు పెట్టంది.  అది గమనించిన ఆ పాప మరోసారి ‘ ఇంకా ఎంతసేపు మమ్మీ’  అని అడిగింది. అందుకు జెసిండా ఏమాత్రం కంగారు పడలేదు.  ‘ ఇది నిద్రపోయే టైం తల్లీ!’ అని  పాపకు నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. కానీ, పాప  'నో' అని మారాం చేసింది. ‘ఇప్పుడు నిద్రపోవాలమ్మా. వెళ్లి పడుకో. నేను ఇప్పుడే వస్తా ’ అంటూ జెసిండా కూతురును ఊరుకోబెట్టింది.   మళ్లీ మీటింగ్​లో జాయిన్​ అవుతూ అందరికీ ‘సారీ’ చెప్పి మీటింగ్​ కంటిన్యూ  చేసింది. కొద్ది సేపటికి ఆ పాప అలాగే పిలవడం మొదలుపెట్టింది.  వెళ్లకపోతే ఆ పాప ఏడ్చేలా ఉండేసరికి జెసిండా సమావేశం నుంచి బయటకు వెళ్లక తప్పలేదు. 

జెసిండా కూతురు పేరు నెవె అరోహ.  పాప పుట్టిన మూడు నెలలకే జెసిండా పాపను  తీసుకొని ఐక్యరాజ్య సమితి మీటింగ్​కు  వెళ్లింది.  కేర్​ టేకర్​గా తండ్రి కూడా వచ్చాడు. అరోహకు డెలిగేట్​ ఐడి కార్డ్​ ఇష్యూ చేశారు అధికారులు. యూఎన్​ జనరల్ అసెంబ్లీలో జెసిండా మాట్లాడు తుంటే అరోహను తండ్రి ఒడిలో కూర్చోబెట్టుకుని ఆడించాడు. ఆ పాపకు న్యాపీలు మార్చడం లాంటి విజువల్స్​ ఐక్యరాజ్యసమితిలో మొదటిసారి  కనిపించాయి. అలా జెసిండా దంపతులు, కూతురు అప్పట్లోనే ప్రపంచ దృష్టిని ఆకర్షించారు.