ఏడు చేతులు మారిన కారు.. ఆఖరికి పుల్వామా దాడికి

ఏడు చేతులు మారిన కారు.. ఆఖరికి పుల్వామా దాడికి

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్ర దాడి కేసులో ఎన్ఐఏ దర్యాప్తు ఓ అడుగు ముందుకు పడింది. సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై దాడి చేసేందుకు వాడిన కారు వివరాలను సేకరించారు. పేలుడులో ముక్కలు ముక్కలైన కారు భాగాలను కలెక్ట్ చేసి, వాటి ఆధారంగా కూపీ లాగారు. ఫోరెన్సిక్, ఆటో మొబైల్ ఎక్స్ పర్ట్స్ సాయంతో ఓనర్ వివరాలను తెలుసుకున్నారు.

2011లో కొనుగోలు

ఈ నెల 14న సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై జైషే ఉగ్రవాది ఆదిల్ ఆత్మాహుతి దాడి చేసి 40 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్నాడు. అతడు ఐఈడీ బాంబులతో కారులో వచ్చి కాన్వాయ్ ని ఢీకొట్టి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆ దాడికి వాడిన కారును ‘మారుతి ఎకో’గా ఎన్ఐఏ గుర్తించింది. దాని చాసిస్ నంబర్ MA3ERLF1SOO183735, ఇంజిన్ నంబర్ G12BN164140 అని తేలింది. వాటిని బట్టి అసలు ఓనర్ కశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లా హెవెన్ కాలనీకి చెందిన జలీల్ అహ్మద్ అని తేల్చారు ఎన్ఐఏ అధికారులు. 2011లో అతడు ఆ బండిని కొన్నాడు.

ఎనిమిదేళ్లలో ఏడు చేతులు మారి..

జలీల్ దాన్ని కొన్నాళ్ల తర్వాత వేరొకరికి అమ్మేశాడు. అలా అతడి దగ్గర నుంచి ఎనిమిదేళ్లలో ఏడు చేతులు మారింది. చివరికి అనంత్ నాగ్ లోని బిజ్బెహరా ప్రాంతానికి చెందిన సజ్జద్ భట్ వద్దకు చేరింది. ఈ నెల 4న అతడు దాన్ని ఉగ్రదాడి కోసమే కొన్నాడు. దాన్ని పుల్వామాలో అటాక్ చేసిన ఆదిల్ కు అందజేశాడు. సోపియన్ లో ఓ కాలేజీలో చదువుకుంటున్న సజ్జద్ మధ్యలోనే చదువుకు ఫుల్ స్టాప్ పెట్టేసి జైషే ఉగ్రవాద సంస్థలో చేరాడు.

 చివరిగా కారు ఓనర్ అయిన సజద్ద్ ఇంటిని ఈ నెల 23న ఎన్ఐఏ అధికారులు, కశ్మీర్ పోలీసుల సాయంతో తనిఖీ చేశారు. కానీ అక్కడ అతడు లేడు. అరెస్టును తప్పించుకునేందుకు ముందుగానే పరారయ్యాడు. జైషేలో చేరిన సజ్జద్ తుపాకీతో ఉన్న ఫొటోలను ఫేస్ బుక్ లో పోస్టు చేసినట్లు అధికారులు చెప్పారు.

సజ్జద్ భట్