చిక్కుల్లో పడేసిన ఫేక్ జాబ్ ఆఫర్

చిక్కుల్లో పడేసిన ఫేక్ జాబ్ ఆఫర్
  • యూఏఈలో 9 మంది కేరళ వాసుల అవస్థలు
  • బాధితులకు అండగా నిలిచిన ఇండియన్ ఎంబసీ

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని సూపర్ మార్కెట్​లో జాబ్.. నెలకు 22 వేలకుపైగా శాలరీ.. ఫ్రీ ఫుడ్, బెడ్ అంటూ వాట్సప్ మెసేజ్ వచ్చింది. ఇబ్బందుల్లో ఉన్న ఓ యువకుడు ఆ ఆఫర్ ను నమ్మి..మరికొందరికి ఫార్వార్డ్ చేశాడు. ఇలా 9 మంది పోగయ్యారు. వీరందర్నీ  ఒక వాట్సప్ గ్రూప్ లో చేర్చిన నకిలీ ఏజెంట్ వారి వద్ద నుంచి 70 వేలు చొప్పున వసూలు చేశాడు. విజిటింగ్ వీసా మీద అబుదాబి పంపి చేతులెత్తేశాడు. సోషల్ మీడియాలో నకిలీ జాబ్ ఆఫర్ కేరళకు చెందిన 9 మందిని చిక్కుల్లో పడేసింది. యూఏఈలో జాబ్ లంటూ నకిలీ అడ్వర్టైజ్ మెంట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, అనుమానాలుంటే తమను సంప్రదించాలని దుబాయ్​లోని ఇండియన్ కాన్సులేట్ అలర్ట్ చేసిన కొన్ని నెలల్లోనే ఈ ఘటన జరిగింది. బాధితుల గురించి తెలుసుకున్న అబుదాబిలోని ఇండియన్ ఎంబసీ అధికారులు వారిని స్వదేశానికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. యూఏఈలో జాబ్ చేయాలంటే ఈసీఆర్ పాస్ పోర్టు ఉండాలని అంబాసిడర్ నవదీప్ సింగ్ సూరి చెప్పారు. మోసానికి పాల్పడిన ఏజెంట్లపై చర్యలు తీసుకునేందుకు ఎంబసీ అధికారులు చర్యలు చేపట్టారు.

ఫ్రెండ్ దగ్గర అప్పు చేసి మరీ కట్టా

“ఫ్రెండ్ దగ్గర అప్పు చేసి మరీ ఏజెంట్ కు 70 వేలు కట్టా. నాతోపాటు 9 మంది ఉన్నారు. మా అందరిని కలిసి వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేశాడు. అందరూ కలిసి యూఏఈ వెళ్తారని ఏజెంట్ చెప్పాడు. మేమంతా కమ్యూనికేట్ చేసుకున్నాం. ఈ నెల 15న అబుధాబిలో ల్యాండ్ అయ్యాం. లోకల్ ఏజెంట్ మాలో నలుగురిని అజ్మన్ కు, ఐదుగురిని అల్ ఎయిన్ కు పంపాడు. జాబ్ గురించి అడిగితే  సూపర్ మార్కెట్  ఆఫీసర్ జైలులో ఉన్నాడని వేరే జాబ్ చూస్తున్నట్లు చెప్పాడు. దీంతో  మేం మోసపోయినట్లు తెలిసింది”

                                                                                                        – బాధితుడు మహ్మద్ రఫీక్, కోజిక్కోడ్

జాబ్ లేకుండా ఎలా వెళ్లాలి?

“నాకు వాట్సప్ ద్వారా జాబ్ ఆఫర్ వచ్చింది.  15 రోజుల్లో యూఏఈలో ఉద్యోగం ఇప్పిస్తానని ఏజెంట్ చెప్పాడు. ఈ మెసేజ్ ను ఫ్రెండ్స్ కు ఫార్వార్డ్ చేశా. అల్ ఎయిన్ లోని సూపర్ మార్కెట్ లో జాబ్ ఇప్పిస్తా. నెలకు రూ.22 వేలకుపైగా జీతం వస్తుంది. ఫ్రీ ఫుడ్, వసతి ఉంటుందని ఏజెంట్ కన్విన్స్ చేశాడు. తల్లి నగలు తాకట్టుపెట్టి మరీ డబ్బులు కట్టా. జాబ్ లేకుండా ఇంటికి ఎలా వెళ్లేది?”

                                                                                                                    – బాధితుడు ఫజిల్, మలప్పురం