కవితకు బిగ్ షాక్.. కస్టడీ పొడిగింపు

 కవితకు బిగ్ షాక్.. కస్టడీ పొడిగింపు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది. ఆమె జ్యుడీషియల్  కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. మే 20 వరకు కస్టడీని పొడిగిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. కవిత  జ్యుడీషియల్ రిమాండ్ ఇవాళ్టితో ముగియడంతో  ఆమెను మే14వ తేదీ మంగళవారం రోజున వర్చువల్ గా  కోర్టు ముందు హాజరుపరిచారు ఈడీ అధికారులు.  మరో 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించాలని కోర్టును ఈడీ కోరింది. అయితే వారం రోజులు కస్టడీకి ఇస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. మరోవైపు 8వేల పేజీల సప్లిమెంటరీ చార్జిషీట్ ను ఈడీ అధికారులు దాఖలు చేశారు. మే 20న ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీట్ పై విచారిస్తామని ఈడీ తెలిపింది. కాగా ఇప్పటికే  సీబీఐ  కేసులో  కవితకు కోర్టు మే20 వరకు  కస్టడీ విధించిన సంగతి తెలిసిందే.  

ఢిల్లీ లిక్కర్ స్కామ్​లో దాదాపు 46 రోజులుగా కవిత తీహార్ జైల్లోని కాంప్లెంక్స్ 6 (మహిళ ఖైదీలు ఉండే కాంప్లెక్స్) లో ఉంటున్నారు. కోర్టు అనుమతితో పలు పుస్తకాలను చదువుతూ... ధ్యానం, ఆధ్యాత్మిక చింతనలో గడుపుతున్నారు. కాగా తనను ఈడీ, సీబీఐ అరెస్ట్  చేయడాన్ని సవాల్ చేస్తూ, బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత దాఖలు చేసిన మధ్యంతర, రెగ్యులర్ బెయిల్ పిటిషన్లను  ఇప్పటికే కోర్టు తిరస్కరించింది. దీంతో ఢిల్లీ హైకోర్టును ఆమె ఆశ్రయించారు. 

ఈ పిటిషన్ పై ఇటీవల విచారణ జరిపిన జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం.. విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. తీహార్ జైలులో వారానికి రెండు సార్లు కవితతో ఆమె భర్త అనిల్ ములాఖత్ (నేరుగా, వీడియో కాల్ ద్వారా) అవుతున్నారు. జైలు నిబంధనల ప్రకారం.. ప్రతిరోజు కవితతో 5 నిమిషాలు ఫోన్ లో మాట్లాడే అవకాశం కుటుంబసభ్యులకు ఉంది. దీంతో కేసీఆర్ రెండుసార్లు కవితతో ఫోన్​లో మాట్లాడినట్లు తెలిసింది.