ఎటూ తేలని మహారాష్ట్ర: ఆయనొస్తే 2 గంటల్లోనే పరిష్కారం!

ఎటూ తేలని మహారాష్ట్ర: ఆయనొస్తే 2 గంటల్లోనే పరిష్కారం!
  • ఆరెస్సెస్ కు లేఖ రాసిన శివసేన సీనియర్ నాయకుడు
  • మహారాష్ట్ర సర్కారు ఏర్పాటుకు గడ్కరీని చర్చలకు పంపండి
  • సులభంగా సమస్య పరిష్కరిస్తారని కిశోర్ తివారీ ధీమా

మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్ఠంభనను తొలగించేందుకు RSS చీఫ్ మోహన్ భగవత్ కలగజేసుకోవాలని కోరుతూ లేఖ రాశారు శివసేన సీనియర్ నేత కిశోర్ తివారీ. మహారాష్ట్రలో బీజేపీ పొత్తు ధర్మాన్ని పాటించడం లేదని అందులో వివరించారాయన.

రెండున్నరేళ్ల పాటు శివసేనకు సీఎం పదవి ఇవ్వాల్సిందేనని అన్నారు. ఎన్నికల ముందు దీనికి ఓకే చెప్పిన బీజేపీ ఇప్పుడు కాదంటోందని, దీని వల్లే ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యమవుతోందని తివారీ చెప్పారు. ఈ విషయంలో RSS కలగజేసుకుని, సమస్యను పరిష్కరించాలని కోరారు. బీజేపీ మాజీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఈ విషయంపై చర్చలకు పంపిస్తే కేవలం రెండు గంటల్లోనే సర్దిచెప్పి, సమస్యను పరిష్కరించగలరని అన్నారు.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి దాదాపు రెండు వారాలు అవుతున్నా.. ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా ఉత్కంఠ వీడలేదు. చెరో రెండున్నరేళ్ల సీఎం పదవి సహా మంత్రి పదవుల్లోనూ 50:50 ఫార్ములాకు శివసేన పట్టుదల వీడడం లేదు. బీజేపీ మాత్రం అందుకు ఇష్టం చూపడం లేదు. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రేను సీఎం చేయాల్సిందేనని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తుంటే, బీజేపీ ససేమిరా నో అంటోంది. అయితే శివసేనతో కలిసే ప్రభుత్వం ఏర్పడుతుందని బీజేపీ నేతలు చెప్పుకొస్తున్నారు.

కిశోర్ తివారీ