హైదరాబాద్ వర్సిటీ వీసీగా నిజాం కాలేజీ స్టూడెంట్

హైదరాబాద్ వర్సిటీ వీసీగా నిజాం కాలేజీ స్టూడెంట్

హైదరాబాద్: దేశవ్యాప్తంగా 12 సెంట్రల్ యూనివర్సిటీలకు కొత్త వైస్ చాన్సెలర్ల నియామకానికి ఉత్తర్వులు వెలువడ్డాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సహా పలు వర్సిటీలకు రాష్ట్రపతి ఆమోదంతో వీసీలను నియమించినట్లు కేంద్ర విద్యా శాఖ ప్రకటించింది. ఇందులో భాగంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కు ఒకప్పటి నిజాం కాలేజీ స్టూడెంట్ వైస్ చాన్సెలర్‌‌గా రావడం విశేషం. ఇక్కడ బీఎస్సీ చదివి అంచెలంచెలుగా ఎదిగిన డాక్టర్ బసుత్కర్ జగదీశ్వర్ రావుకు ఈ పదవి దక్కింది.
నిజాం కాలేజీలో డిగ్రీ.. ఉస్మానియాలో పీజీ
మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి వైస్ చాన్సెలర్‌‌గా వచ్చిన డాక్టర్ బసుత్కర్ జగదీశ్వర్‌‌ రావు ప్రస్తుతం తిరుపతిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌ (ఐఐఎస్‌ఈఆర్)లో బయాలజీ డిపార్ట్‌మెంట్ డీన్‌ ఫ్యాకల్టీగా ఉన్నారు. సెల్యులార్ బయాలజీలో ఆయన అనేక రీసెర్చ్‌లు చేశారు. 1956 మార్చి 13న పుట్టిన జగదీశ్వర్‌‌రావు హైదరాబాద్‌లోని నిజాం కాలేజ్‌లో ఆయన బీఎస్సీ డిగ్రీ చదివారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ (ఎంఎస్సీ) పూర్తి చేశారు.  బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్​ సైన్సెస్‌ (ఐఐఎస్సీ)లో బయోకెమిస్ట్రీ విభాగంలో పీహెచ్‌డీ చేశారు. ఆ తర్వాత అమెరికాలోని యేల్ మెడికల్ స్కూల్‌లో పోస్ట్ డాక్టోరల్‌ వర్క్ చేశారు. అక్కడ ఏడేండ్ల పాటు రీసెర్చ్ సైంటిస్ట్‌గా ఉన్నారు. ఆ తర్వాత ఇండియాకు తిరిగొచ్చి, ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్‌ రీసెర్చ్ (టీఐఎఫ్ఆర్) సంస్థలో ప్రొఫెసర్‌‌గా, చైర్‌‌పర్సన్‌గా పలు హోదాల్లో పని చేశారు. అలాగే అక్కడి మెకానిజం ఆఫ్​ జినోమ్ డైనమిక్స్ అండ్ సెల్యులార్ అడాప్షన్స్ ల్యాబొరేటరీకి హెడ్‌గా సేవలు అందించారు. టీఐఎఫ్‌ఆర్‌‌లో బయోలాజికల్ సైన్స్ సీనియర్ ప్రొఫెసర్‌‌గా సర్వీస్‌ చేసిన జగదీశ్వర్‌‌ ప్రస్తుతం తిరుపతిలోని ఐఐఎస్‌ఈఆర్‌‌లో బయాలజీ డిపార్ట్‌మెంట్ ఫ్యాకల్టీ డీన్‌గా ఉన్నారు.

12 యూనివర్సిటీలు, వీసీల లిస్ట్ ఇదే:

1. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ –    డాక్టర్ బి. జగదీశ్వర్‌‌ రావు

2. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్​ హర్యానా – డాక్టర్ టంకేశ్వర్ కుమార్

3. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్​ హిమాచల్ ప్రదేశ్ – ప్రొఫెసర్ సత్ ప్రకాశ్ బన్సల్

4. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్​ జమ్ము – డాక్టర్ సంజీవ్ జైన్

5. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జార్ఖండ్ – క్షితి భూషణ్ దాస్

6. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్​ కర్నాటక – ప్రొఫెసర్ బట్టు సత్యనారాయణ

7. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు – ప్రొఫెసర్ ముత్తుకళింగన్ కృష్ణన్

8. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ సౌత్ బీహార్ – ప్రొఫెసర్ కామేశ్వర్ నాథ్ సింగ్

9. నార్త్‌ ఈస్ట్రన్ హిల్ యూనివర్సిటీ – ప్రొఫెసర్ ప్రభాశంకర్ శుక్లా 

10. గుంట్ ఘషిదాస్ యూనివర్సిటీ – డాక్టర్ అలోక్ కుమార్ చక్రవాల్

11. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ – ప్రొఫెసర్ సయ్యద్ ఐనుల్ హసన్

12. మణిపూర్ యూనివర్సిటీ – ప్రొఫెసర్ లోకేంద్ర సింగ్