PBKS vs CSK: తిప్పేసిన చెన్నై బౌలర్లు.. పంజాబ్ ఖాతాలో ఏడో ఓటమి

PBKS vs CSK: తిప్పేసిన చెన్నై బౌలర్లు.. పంజాబ్ ఖాతాలో ఏడో ఓటమి

ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. చేసింది తక్కువ పరుగులకే అయినా.. దానిని కాపాడడంలో సీఎస్కే బౌలర్లు పైచేయి సాధించారు. వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ.. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న పంజాబ్‌ను కోలుకోకుండా దెబ్బ కొట్టారు. స్పిన్నర్లు, పేసర్లు అందరూ.. కింగ్స్ బ్యాటర్లను బెంబేలెత్తించారు. మొదట చెన్నై 167 పరుగులు చేయగా.. ఛేదనలో సామ్ కర్రన్ సేన 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. చెన్నైకిది ఆరో విజయం కాగా.. పంజాబ్‌కిది ఏడో ఓటమి. 

స్వ‌ల్ప ఛేద‌న‌లో పంజాబ్ బ్యాటర్లు ఆదిలోనే తడబడ్డారు. ఫామ్‌లో ఉన్న ఓపెన‌ర్ జానీ బెయిర్‌స్టో(7), రీలే ర‌స్సో(0)లను.. సీఎస్కే యువ పేస‌ర్ తుషార్ దేశ్‌పాండే ఒకే ఓవ‌ర్లో పెవిలియ‌న్ చేర్చాడు. అక్కడినుండి కింగ్స్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూనే వచ్చింది. ఏ ఒక్క బ్యాటరూ నిలదొక్కుకోలేకపోయారు. జానీ బెయిర్‌స్టో(7), రిలీ రోసో(0), శశాంక్ సింగ్(27), ప్రభసిమ్రాన్ సింగ్(30), సామ్ కర్రాన్ (7), జితేష్ శర్మ (0), అశుతోష్ శర్మ(3).. ఇలా అందరూ విఫలమయ్యారు. చెన్నై బౌలర్లలో జడేజా 3, తుషార్ దేశ్‌పాండే 2, సిమర్జీత్ సింగ్ 2, మిచెల్ సాంట్నర్ 1, శార్దూల్ ఠాకూర్ ఒక వికెట్ పడగొట్టారు.

చెన్నై తడబాటు

అంతకుముందు పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో చెన్నై స్వల్ప స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై.. 9 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. శివమ్ దూబే(0), ఎంఎస్ ధోని(0) డకౌట్ కాగా.. రుతురాజ్ గైక్వాడ్ (32), డారిల్ మిచెల్ (30), రవీంద్ర జడేజా(26 బంతుల్లో 43) పర్వాలేదనిపించారు. పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్, రాహుల్ చాహర్ మూడేసి వికెట్లు పడగొట్టగా.. అర్షదీప్ సింగ్ రెండు వికెట్లు తీసుకున్నాడు.