హోమ్​ లోన్‌‌కు బిల్డింగ్‌‌ ప్లాన్‌‌ అక్కర్లే

హోమ్​ లోన్‌‌కు బిల్డింగ్‌‌ ప్లాన్‌‌ అక్కర్లే

రిజిస్ట్రేషన్‌‌ సర్టిఫికెట్‌‌, బిల్డింగ్‌‌ పర్మిట్‌‌ ఆర్డర్‌‌ చాలు
ఆర్థిక సంస్థలకు మున్సిపల్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ సూచన

హైదరాబాద్‌‌, వెలుగు : టీఎస్‌‌ – బీపాస్‌‌లో భాగంగా ఆన్‌‌లైన్‌‌లో ఇంటి నిర్మాణ అనుమతులు పొందిన వారికి సర్టిఫైడ్‌‌ బిల్డింగ్‌‌ ప్లాన్‌‌ లేకున్నా హోమ్ లోన్లు ఇవ్వాలని మున్సిపల్‌‌ అడ్మినిస్ట్రేషన్‌‌ శాఖ బ్యాంకులకు, ఇతర ఆర్థిక సంస్థలకు మెమో జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో నిరుడు నవంబర్‌‌ 16 నుంచి టీఎస్‌‌ – బీపాస్‌‌ అమల్లోకి వచ్చింది.  బీపాస్‌‌లో మూడు రకాల అనుమతులు ఉంటాయి.75 గజాలలోపు స్థలంలో ఏడు మీటర్ల కన్నా తక్కువ ఎత్తులో ఇల్లు కట్టుకుంటే, సెల్ఫ్‌‌ సర్టిఫైడ్‌‌ కాపీలతో ఆన్‌‌లైన్‌‌లో అప్లై చేసుకుంటే ఒక్క రూపాయికే నిర్మాణ అనుమతులు ఇస్తారు.  వివాదాస్పద స్థలాల్లో ఇల్లు కట్టుకోవడానికి ఈ వెసులుబాటును వాడుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మున్సిపల్‌‌ అడ్మినిస్ట్రేషన్‌‌ శాఖ హెచ్చరించింది.

500 చదరపు గజాల్లోపు 10 మీటర్ల కన్నా తక్కువ ఎత్తులో నిర్మాణాలు చేపట్టే వారు మాస్టర్‌‌ ప్లాన్‌‌ లేదా డీటైల్డ్‌‌ ప్లానింగ్‌‌ స్కీమ్​, లోకల్‌‌ ఏరియా ప్లాన్‌‌, ఇతర సర్టిఫికెట్లతో ఆన్‌‌లైన్‌‌లో దరఖాస్తు చేసుకుంటే వెంటనే పర్మిషన్​ ఇస్తారు. 500 చదరపు గజాల కన్నా ఎక్కువ విస్తీర్ణం, 10 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తులో కమర్షియల్‌‌, హైరైజ్‌‌ భవనాలు, మల్టీప్లెక్స్‌‌ల వంటి నిర్మాణాలు చేపట్టే వారు సంబంధిత సంస్థల నుంచి ఎన్‌‌వోసీలతో అప్లై చేసుకుంటే సింగిల్‌‌ విండో విధానంలో పర్మిషన్లు ఇస్తున్నారు. ఆర్థిక సంస్థలు హోమ్ లోన్లు ఇచ్చేముందు బిల్డింగ్‌‌ పర్మిట్‌‌ ఆర్డర్‌‌ క్యూఆర్‌‌ కోడ్‌‌ను స్కానింగ్‌‌ చేసి పరిశీలించాలని మున్సిపల్‌‌ అడ్మినిస్ట్రేషన్‌‌ శాఖ సూచించింది. రిజిస్ట్రేషన్‌‌ సర్టిఫికెట్‌‌, ఫైనల్‌‌ అప్రూవల్‌‌ కాపీలనూ పరిశీలించాలని పేర్కొంది.