అటెండర్లు, వాచ్​మెన్లు లేరు.. సర్కార్ బడుల్లో సామాన్లకు కాపలా కరువు

అటెండర్లు, వాచ్​మెన్లు లేరు.. సర్కార్ బడుల్లో సామాన్లకు కాపలా కరువు
  • సర్కార్ బడుల్లో సామాన్లకు కాపలా కరువు
  • చాలా స్కూళ్లలో అటెండర్లు, వాచ్​మెన్లు లేరు
  • రేపటి నుంచి సమ్మర్ హాలీడేస్ 
  • గతంలో పలు స్కూళ్లలో దొంగతనాలు  
  • ఆందోళనలో హెడ్మాస్టర్లు.. వాచ్ మెన్లను 
  • నియమించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి 

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో మంగళవారం నుంచి స్కూళ్లకు సమ్మర్ హాలీడేస్ మొదలవుతాయి. సెలవులొస్తున్నాయని పిల్లలు ఆనందంలో ఉండగా.. హెడ్మాస్టర్లు, టీచర్లు మాత్రం ఆందోళనలో ఉన్నారు. బడులు బందైన తర్వాత వాటిల్లోని సామాన్లు, రికార్డులకు రక్షణ ఎలా అని అయోమయంలో ఉన్నారు. ‘మన ఊరు మన బడి’ కింద ఇటీవల సర్కార్ స్కూళ్లకు కొత్తగా కంప్యూటర్లు, టీవీలు, ప్రొజెక్టర్లు, ఫర్నీచర్ భారీగా వచ్చాయి. ప్రస్తుతం బడులకు వాచ్​మెన్లు, అటెండర్లు లేకపోవడంతో.. తిరిగి బడులు తెరిచే వరకు అవన్నీ ఉంటాయో? పోతాయో? అని హెడ్మాస్టర్లు ఆందోళన చెందుతున్నారు. 

రాష్ట్రంలో 26 వేల సర్కార్ స్కూళ్లు ఉండగా.. వాటిలో 30 లక్షల మంది స్టూడెంట్లు చదువుకుంటున్నారు. వీటిలో ఏ ఒక్క స్కూల్​కూ వాచ్​మెన్​లేరు. ఇక కేవలం 2 వేల స్కూళ్లలోనే అటెండర్లు ఉన్నారు. ప్రస్తుతం ‘మన ఊరు మన బడి’ స్కీమ్ కింద తొలి విడతలో 9,123 స్కూళ్లను ఎంపిక చేసి ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది చాలా స్కూళ్లను స్థానిక ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ నాయకులు దత్తత తీసుకొని సౌలతులు కల్పించారు. దీంతో బడుల్లో కంప్యూటర్లతో పాటు కొత్తగా ఫర్నిచర్, టీవీలు, కేయాన్లు, ప్రొజెక్టర్లు, గ్రీన్ బోర్డులు, కొత్త ట్యూబులు, ఫ్యాన్లు వచ్చాయి. వీటితో పాటు బియ్యం, సర్కారు టీచర్లకు సంబంధించిన సర్వీస్ బుక్​లు, విలువైన రికార్డులు, మెమోలు బడుల్లోనే ఉన్నాయి. ఇప్పుడు వీటన్నింటికి కాపలా ఎవరనేది ప్రశ్నార్థకంగా మారింది. కాగా, ఈ నెల 25 నుంచి బడులకు సమ్మర్ హాలీడేస్ మొదలవుతాయి. తిరిగి జూన్ 12న రీఓపెన్ చేస్తారు.

పోతే ఎవరిది బాధ్యత?

ప్రస్తుతం బడుల్లో ఏం జరిగినా హెడ్మాస్టర్లనే బాధ్యులుగా చేస్తున్నారు. పోయినేడాది పలు స్కూళ్లలో కంప్యూటర్లు, ఫర్నిచర్, బియ్యం తదితర వస్తువులు చోరీకి గురయ్యాయి. ఇప్పటికీ వాటి రికవరీ జరగలేదు. ఈ క్రమంలో బడుల్లో విలువైన వస్తువులు ఉండటంతో హెడ్మాస్టర్లలో భయం మొదలైంది. వాటిని ఎవరు కాపాడాలని ప్రశ్నిస్తున్నారు. కేవలం కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, గురుకులాలకు మాత్రమే వాచ్ మెన్లు ఉన్నారు. సర్కార్ స్కూళ్లలో వాచ్​మెన్​లే లేరు. అయితే కరోనాకు ముందు బడుల్లో స్వచ్ఛ కార్మికులు ఉండగా, సెలవు దినాల్లో వారే బడులను చూస్తుండేవారు. కానీ ప్రస్తుతం వారినీ సర్కార్ నియమించలేదు. దీంతో సమ్మర్ హాలీడేస్​లో బడులను రక్షించడం ఎలా? అనే అయోమయం హెడ్మాస్టర్లలో నెలకొన్నది. కొన్ని చోట్ల సెలవు దినాల్లో పోకిరీలు బడుల్లోనే మద్యం తాగడం, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఏటా పలు బడుల్లో డోర్లు, కిటికీలు పగులకొడ్తున్నారు. ప్రస్తుతం విలువైన వస్తువులున్న నేపథ్యంలో రక్షణ కల్పించాలని హెడ్మాస్టర్లు కోరుతున్నారు. వాచ్ మెన్లను నియమించాలని ఏండ్ల నుంచి కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా సర్కారు స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే విషయమై ఆదివారం ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్​ను హెడ్మాస్టర్ల సంఘం ప్రతినిధులు కలిసి వినతిపత్రం అందజేశారు.

వాచ్ మెన్లను నియమించాలె..

సర్కార్ స్కూళ్లలో విలువైన వస్తువులు, రికార్డులు ఉన్నాయి. సమ్మర్ హాలీడేస్​లో వీటి రక్షణ కోసం విద్యాశాఖ ఏర్పాట్లు చేయాలి. ఎంతో ప్రతిష్టాత్మకంగా ‘మన ఊరు మన బడి’ ద్వారా అనేక సౌలతులు కల్పించారు. వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై, విద్యాశాఖపై ఉంది. ప్రస్తుతం బడుల్లో వాచ్​మెన్లు లేరు. వారిని వెంటనే నియమించాలి. 

- రాజభాను చంద్రప్రకాశ్, హెడ్మాస్టర్ల సంఘం స్టేట్ ప్రెసిడెంట్