ఎన్నార్సీ దేశమంతా ఉండదు

ఎన్నార్సీ దేశమంతా ఉండదు

లోక్​సభలో కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ వెల్లడి

న్యూఢిల్లీదేశవ్యాప్తంగా నిరసనలకు కారణమవుతున్న నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్నార్సీ) తయారీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరోసారి క్లారిటీ ఇచ్చింది. ఎన్నార్సీని దేశమంతా చేపట్టే ఉద్దేశమేదీ తమకు లేదని తెలిపింది. మంగళవారం లోక్​సభలో ఈ మేరకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్‌‌‌‌‌‌‌‌ వివరణ ఇచ్చారు. ‘‘ఎన్నార్సీని నేషనల్ లెవెల్​లో నిర్వహించేందుకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటిదాకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’’ అని ఓ ప్రశ్నకు రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. ‘‘2014లో తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్నార్సీ గురించి చర్చించలేదని డిసెంబర్ 22న ప్రధాని నరేంద్ర మోడీ క్లారిటీ ఇచ్చారు. పార్లమెంటులో కానీ, కేబినెట్​లో కానీ డిస్కస్ చేయలేదని చెప్పారు” అని నిత్యానంద్ చెప్పారు. దీంతో దేశవ్యాప్తంగా ఎన్నార్సీని ఎలా అమలు చేస్తారు? ప్రజలపై పడే అదనపు భారం? వంటి వాటి గురించి ఎలాంటి ప్రశ్నలు తలెత్తవని చెప్పారు. ‘‘చొరబాట్లు జరుగుతున్న ప్రాంతాల్లో ప్రాధాన్యత ఆధారంగా ఎన్నార్సీ ప్రక్రియను అమలు చేయాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. చొరబాట్లను నివారించేందుకు సరిహద్దు వెంబడి సెక్యూరిటీ మరింత బలోపేతం చేస్తాం” అని వివరించారు.

ప్రతిపక్షాల నిరసనల నేపథ్యంలో..

మంగళవారం బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగానే.. మెజారిటీ ప్రతిపక్షాలు నిరసనలు చేపట్టాయి. సిటిజన్​షిప్ అమెండ్​మెంట్ యాక్ట్ (సీఏఏ), ఎన్నార్సీ, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (ఎన్పీఆర్)పై లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలివ్వాలని, వాటిపై డిబేట్ పెట్టాలని డిమాండ్ చేశాయి. డీఎంకే, సీపీఐ, సీపీఎం, ఎన్సీపీ, ఆర్జేడీ, టీఎంసీ, ఎస్పీ, బీఎస్పీ సహా ప్రతిపక్షాలు 267 రూల్ కింద నోటీసులు ఇచ్చాయని, చర్చించాల్సిన అన్ని అంశాలను వాయిదా వేసి..  సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీపైనా చర్చించాలని కాంగ్రెస్ ఎంపీ గులామ్ నబీ ఆజాద్ అన్నారు. వీటిపై పూర్తిస్థాయిలో చర్చ జరిగేంత వరకు బడ్జెట్‌‌‌‌‌‌‌‌పై చర్చింబోమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నార్సీపై హోం శాఖ వివరణ
ఇచ్చింది.

ఎన్పీఆర్‌‌లో వెరిఫికేషన్ చేయం

ఎన్పీఆర్ అప్​డేషన్ ప్రక్రియ సందర్భంగా ప్రజల నుంచి ఎలాంటి డాక్యుమెంట్ తీసుకోబోమని కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఆధార్ నంబర్ మాత్రం స్వచ్ఛందంగా ఇవ్వొచ్చని తెలిపింది. ఎవరైనా వ్యక్తి సిటిజన్​షిప్​పై అనుమానం ఉన్నా.. ఎలాంటి వెరిఫికేషన్ చేయబోమని చెప్పింది. ఎన్పీఆర్ విషయంలో రాష్ర్టాల ఆందోళనపై ప్రభుత్వం చర్చిస్తోందని చెప్పింది. ప్రతి కుటుంబంలోని సభ్యుల సంఖ్యతోపాటు ఇతర వివరాలను సేకరించి, ఎన్పీఆర్​లో ఆప్​డేట్ చేస్తామని వివరించింది. ఎన్పీఆర్ 2020 అప్‌‌‌‌‌‌‌‌డేట్ చేయడానికి ఎన్యూమరేటర్లు, సూపర్‌‌‌‌‌‌‌‌వైజర్ల కోసం ఇన్‌‌‌‌‌‌‌‌స్ట్రక్షన్ మాన్యువల్‌‌‌‌‌‌‌‌ను తయారుచేశామని, ప్రజలు నమ్మకంతో సమాచారాన్ని అందించాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ అన్నారు. ఈ ప్రాసెస్​లో ఎలాంటి డాక్యుమెంట్ తీసుకోబోమని లోక్​సభలో రాతపూర్వకంగా
సమాధానమిచ్చారు.

బీజేపీ.. దుశ్శాసనుల పార్టీ. అందులో ఉన్నది తుగ్లక్ సంతానం. వారి నుంచి దేశాన్ని కాపాడేందుకు ప్రజలంతా ఏకం కావాలి. ఎన్​పీఆర్, ఎన్నార్సీ, సీఏఏ చేతబడి లాంటివి. వాటిని ఎలాగైనా అడ్డుకుంటా. మా అమ్మ బర్త్ సర్టిఫికెట్ లేదు. అంతమాత్రాన  కేంద్రంలోని బీజేపీ సర్కార్ నన్ను దేశం నుంచి వెళ్లగొడుతుందా?                                                                       – వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

దేశమంతటా అమలు చేయాల్సిందే ఎన్నార్సీని దేశమంతటా అమలు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నా. ముస్లింల పేరుతో ఓటు​బ్యాంక్​ పాలిటిక్స్ చేస్తున్నారు. దేశాన్ని విభజించాలని కాంగ్రెస్ కోరుకుంటోంది. ఆ పార్టీ నుంచి దేశాన్ని రక్షించాలి.          – బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే

మాజీ గవర్నర్పై ఎఫ్ఐఆర్

లక్నో: సీఏఏ, ఎన్నార్సీకి వ్యతిరేకంగా లక్నోలో జరిగిన క్యాండిల్ మార్చ్​లో పాల్గొన్నందుకు ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ మాజీ గవర్నర్ అజీజ్ ఖురేషీపై ఎఫ్ఐఆర్ నమోదైంది. అధికారుల నుంచి ఎలాంటి పర్మిషన్​ తీసుకోకుండా ప్రదర్శన చేసినందుకు కొంతమంది ఆందోళనకారులతోపాటు మాజీ గవర్నర్​పై మంగళవారం లక్నోలోని గోమతినగర్ పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైంది. ‘‘సీఏఏ కమ్యూనల్” అని   ఖురేషీ​ గతంలో విమర్శిచారు.

ఎన్నార్సీని నేషనల్ లెవెల్​లో నిర్వహించేందుకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటిదాకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. చొరబాట్లు జరుగుతున్న ప్రాంతాల్లో ప్రాధాన్యత ఆధారంగా ఎన్నార్సీ ప్రక్రియను అమలు చేయాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. చొరబాట్లను నివారించేందుకు సరిహద్దు వెంబడి సెక్యూరిటీ మరింత బలోపేతం చేస్తాం. – కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్‌

మరిన్ని వార్తల కోసం..