ఫలిస్తున్న ఫారెస్ట్​ ఆఫీసర్ల చర్యలు

ఫలిస్తున్న ఫారెస్ట్​ ఆఫీసర్ల చర్యలు
  • అమ్రాబాద్​ టైగర్​ రిజర్వ్​లో ఫలితమిస్తున్న ఫారెస్ట్​ ఆఫీసర్ల చర్యలు
  • పర్యాటక అభివృద్ధితో స్థానికులకు ఉపాధి 
  • నేడు అంతర్జాతీయ పులుల దినోత్సవం

అమ్రాబాద్, వెలుగు: అమ్రాబాద్​ టైగర్​ రిజర్వ్​లో ఫారెస్ట్​ ఆఫీసర్ల చర్యలు ఫలిస్తున్నాయి. క్రమంగా పులుల సంఖ్య పెరుగుతోంది. ఏటా జులై 29న అంతర్జాతీయ పులుల దినోత్సవం నిర్వహిస్తూ పులుల సంరక్షణపై అవగాహన కల్పిస్తున్నారు. పులుల కోసం దేశవ్యాప్తంగా టైగర్​ రిజర్వ్​లను ఏర్పాటు చేశారు.  రాష్ట్రంలో నాగార్జునసాగర్​– శ్రీశైలం, కవ్వాల్, అమ్రాబాద్​ టైగర్​ రిజర్వ్​లు ఉన్నాయి. ఈ  ప్రాంతాల్లో పులులు స్వేచ్ఛగా తిరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో కొత్త ప్రాంతాల్లోనూ పులులు కనిపిస్తుండడం, వాటి పాదముద్రలు రికార్డవడం ముఖ్యమైన పరిణామంగా అటవీ అధికారులు పేర్కొంటున్నారు. 2006లో పులుల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన నేషనల్​టైగర్​కన్జర్వేషన్​అథారిటీ(-ఎన్‌‌‌‌‌‌‌‌టీసీఏ) ఇప్పటికి నాలుగుసార్లు దేశవ్యాప్తంగా వన్యప్రాణుల గణన నిర్వహించింది. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేసే ఈ సంస్థ దేశంలో పులుల సంరక్షణ కోసం కృషి చేస్తోంది. దేశంలో ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి పులుల సంఖ్యను లెక్కిస్తుంటారు. 2006లో పులుల సంఖ్య 1,411 ఉండగా 2018 నాటికి 2,967కి పెరిగింది. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌లో 68 పులులు ఉండగా, 2018 నాటికి ఏపీ, తెలంగాణలో కలిపి వీటి సంఖ్య 74కు చేరింది. ప్రస్తుతం ఏపీలో 48, తెలంగాణలో 26 పులులు ఉండగా కేవలం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్​లోనే సుమారు 20కి పైగా పులులు ఉన్నట్లు అధికారుల అంచనా. 

వన్యప్రాణుల రక్షణకు ఏర్పాట్లు

అడవి జంతువులు తరచూ సమీప గ్రామాలు, పంట పొలాల్లోకి వస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అవగాహన లేక కొందరు వన్యప్రాణులను చంపి శిక్షకు గురవుతున్నారు. ఈ పరిస్థితిని నివారించడానికి అటవీ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. గ్రామాల సరిహద్దులోని ఫారెస్ట్ భూమిలో సోలార్ ద్వారా ప్రత్యేక అలారం సిస్టం ఏర్పాటు చేశారు. అడవి జంతువు ఆ చోటుకు రాగానే అలారం మోగుతుంది. ఆ శబ్దానికి భయపడి జంతువులు తిరిగి వెనక్కి వెళతాయని అధికారులు చెబుతున్నారు. దాంతోపాటు ప్రత్యేక డ్రోన్ కెమెరాలతో అడవిపై నిఘా సైతం ఏర్పాటు చేశారు. జంతువుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు నాగర్​కర్నూల్​ జిల్లా మన్ననూర్ లో బయోలాజికల్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. వన్యప్రాణుల మలం, వెంట్రుకలు సేకరించి వాటి ఆరోగ్య స్థితి, ఆహారం తదితర విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. అడవిలో గాయాలపాలైన జంతువులకు ట్రీట్​మెంట్​ చేయడానికి రక్షణా కేంద్రం ఏర్పాటు చేశారు. స్థానిక స్కూల్​ స్టూడెంట్లకు అడవి ప్రాధాన్యతను తెలియజేసి వారితో గ్రామాల ప్రజలు, తల్లిదండ్రుల్లో అవగాహన పెంపొందించేలా ఆఫీసర్లు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నారు. 

స్థానికులకు అవగాహన

స్థానికంగా ఉన్న ప్రజలకు అడవి ఆవశ్యకత, వన్యప్రాణుల సంరక్షణ, పులి, ఇతర క్రూరమృగాల నుంచి ఎలా రక్షించుకోవాలనే అంశాలపై ఫారెస్ట్​ ఆఫీసర్లు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నారు. పెంపుడు పశువులు అడవి జంతువుల బారినపడి చనిపోయినపుడు, అడవి జంతువుల వల్ల పంటలకు హాని కలిగినపుడు అధికారులు బాధితులకు పరిహారం అందిస్తున్నారు. అడవిలో పెద్దపులుల ఉనికికి ఇబ్బంది కలగకుండా వాటి సంచారం లేనిచోట పశువులను మేపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్(ఏటీఆర్)​​ఏర్పడ్డ తర్వాత ఇక్కడ టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం, ఫారెస్ట్ ఆఫీసర్లు ఎంతో కృషి చేశారు. దేవాలయాలు, ప్రకృతి సిద్ధ జలపాతాలు, చారిత్రక ప్రదేశాలకు నల్లమల అభయారణ్యం నెలవు కావడంతో నిరంతరం వేల సంఖ్యలో భక్తులు, పర్యాటకులు సంచారం ఉంటుంది. దీంతో ఫారెస్ట్ అధికారులు సఫారీ కార్యక్రమం సైతం చేపట్టారు. ఈ కారణంగా స్థానికంగా ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. అడవిలో పర్యాటకులు వేస్తున్న చెత్త, ప్లాస్టిక్ వల్ల వన్యప్రాణులకు ప్రాణగండం ఉండడంతో ప్లాస్టిక్ నిర్మూలన కోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. అడవిలో ప్లాస్టిక్ ను సేకరించి వాటిని రీసైక్లింగ్ సెంటర్ కు పంపి వాటి నుంచి వచ్చే ఆదాయాన్ని డెవలప్​మెంట్ కోసం, వేతనాలకు ఉపయోగిస్తున్నారు.

స్థానికుల సహకారంతో మరింత అభివృద్ధి

మానవుడి మనుగడ, జీవవైవిధ్యం, పర్యావరణ పరిరక్షణ పులుల ఉనికిపై ఆధారపడి ఉంది. స్థానిక ప్రజలు మరింత సహకారం అందిస్తే అమ్రాబాద్​ టైగర్​ రిజర్వ్​లో పులుల సంతతి పెరగడమే కాక అడవి వృద్ధి చెందుతుంది. పర్యాటకుల తాకిడి పెరిగి స్థానికులకు జీవనోపాధి దొరుకుతుంది. ఫారెస్ట్ శాఖలో అవసరమైన మేరకు ఉద్యోగావకాశాలు దక్కుతాయి. 

- రోహిత్ గోపిడి, డీఎఫ్ఓ, నాగర్ కర్నూల్