కామన్వెల్త్ గేమ్స్ కు నీరజ్ చోప్రా దూరం

కామన్వెల్త్ గేమ్స్ కు నీరజ్ చోప్రా దూరం

ఇటీవల జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో  ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా రజత పతకాన్ని గెలుచుకుని సత్తా చాటిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఫిట్‌నెస్ సమస్యల కారణంగా జులై 28న బర్మింగ్‌హామ్‌లో జరిగే కామన్వెల్త్ క్రీడలకు దూరం కానున్నాడని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రాజీవ్ మెహతా తెలిపారు. 100% ఫిట్‌గా లేనందున వల్లే నీరజ్ కామన్వెల్త్ లో ఆడే అర్హత కోల్పోయాడన్నారు. ఈ విషయంపై నీరజ్ తనతో మాట్లాడాడన్న రాజీవ్ మెహతా.. 20 రోజులు విశ్రాంతి తీసుకుంటాడని వెల్లడించారు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా 88.13 మీటర్లు విసిరే సమయంలోనే అతని కాలికి గాయమైనట్టు తెలుస్తోంది. దీంతో కామన్వెల్త్ గేమ్స్ నుంచి నీరజ్ తప్పుకున్నాడు. 

నీరజ్ తాజా ప్రకటనతో భారత్ కు గట్టి షాక్ తగిలింది. ఆగష్టు 7 కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న భారత క్రీడాభిమానులకు.. తీవ్ర నిరాశ ఎదురైంది. దీంతో పతకం సాధించి పెడతాడని ఎన్నో ఆశలు పెట్టుకున్న భారత్ కలలు కల్లలుగానే మిగిలిపోయాయి. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం కోల్పోయిన తర్వాత, నీరజ్ కామన్వెల్త్ క్రీడలపై దృష్టి సారించాడు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రజతం గెలిచిన తర్వాత, కామన్వెల్త్‌లో మరింత మెరుగ్గా రాణిస్తానని ఇటీవలే చెప్పిన నీరజ్.. ఇప్పుడు టైటిల్ దక్కించుకోవాలన్న నీరజ్ కల కూడా గాయం కారణంగా చెదిరిపోయింది.