సెప్టెంబర్ 1 నుంచి ప్రభుత్వ స్కూళ్లలో ఆన్‌లైన్ క్లాసులు

సెప్టెంబర్ 1 నుంచి ప్రభుత్వ స్కూళ్లలో ఆన్‌లైన్ క్లాసులు

క‌రోనా కారణంగా స్కూళ్లు ఇప్ప‌ట్లో తెరుచుకునే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేవు. దీంతో తెలంగాణ ప్ర‌భుత్వం ఆన్ లైన్ క్లాసెస్ నిర్వ‌హించేందుకు సిద్ధ‌మైంది. రాష్ట్రంలో వ‌చ్చే నెల 1 నుంచి పాఠ‌శాల‌ల్లో 2020-2021 విద్యా సంవ‌త్స‌రం ప్రారంభం అవుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అందులో భాగంగా సెప్టెంబ‌ర్ 1 నుంచి విద్యార్థుల‌కు ఆన్‌లైన్ క్లాసులు  నిర్వహించ‌నున్న‌ట్లు  తెలిపింది. దీనికి సంబంధించి ఇవాళ( సోమ‌వారం, ఆగస్టు-24) ఉత్త‌ర్వులు జారీ చేసింది.

మూడో త‌ర‌గ‌తి, ఆపై స్థాయి విద్యార్థుల‌కు ఆన్‌లైన్ త‌ర‌గ‌తులు నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపింది. కేంద్రం ఇచ్చిన మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారమే ఈ త‌ర‌గ‌తులు ఉంటాయ‌ని చెప్పింది. టీశాట్, దూరదర్శన్ ద్వారా విద్యార్థులకు పాఠాలు చెప్పనున్నారు. ఇప్పటికే ఆయా ఛానళ్లతో విద్యాశాఖ అగ్రిమెంట్ కూడా కుదుర్చుకుంది.

అంతేకాదు ఈ త‌ర‌గ‌తుల ప్రారంభానికి ముందే ఈ నెల 27 నుంచి ఉపాధ్యాయులు స్కూళ్ల‌కు రావాల్సిందిగా  ఆదేశాలు జారీ చేసింది. అకాడమిక్  ఇయర్ ప్రారంభంపై మంత్రివ‌ర్గ ఉప‌సంఘం ఈ నెల 5న భేటీ  అయ్యింది. భేటీలో చర్చించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపింది. వాటిని పరిశీలించిన ప్రభుత్వం…ఆన్ లైన్ క్లాసులు చెప్పేందుకు విద్యాశాఖకు గ్రీన్ సిగ్నలిచ్చింది.