మన రూల్స్ ఔట్‌డేటెడ్‌గా ఉన్నాయి: గడ్కరీ

మన రూల్స్ ఔట్‌డేటెడ్‌గా ఉన్నాయి: గడ్కరీ

న్యూఢిల్లీ: చైనీస్ కంపెనీలకు అనుగుణంగా ఉన్న రూల్స్‌ను మార్చాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. దేశ భద్రత, ఇండియాలోని కంపెనీల ఆసక్తుల దృష్ట్యా రూల్స్‌ను తిరగదోడాల్సిన అవసరం ఉందని గడ్కరీ స్పష్టం చేశారు. బీజింగ్‌కు వ్యతిరేకంగా ఇటీవల పలు చైనీస్ యాప్స్‌ను కేంద్ర ప్రభుత్వ నిషేధించడాన్ని ఆయన సమర్థించారు. హైవే ప్రాజెక్టుల్లో చైనీస్ కంపెనీల భాగస్వామ్యాన్ని అనుమతించబోమని కొన్ని రోజుల క్రితమే గడ్కరీ చెప్పిన సంగతి తెలిసిందే. అలాగే చైనా నుంచి పవర్ ఎక్విప్‌మెంట్స్‌ను దిగుమతి చేసుకోబోమని విద్యుత్ శాఖ కూడా పేర్కొన్న సంగతి విధితమే. ఈ నేపథ్యంలో తాజాగా నితిన్‌ గడ్కరీ మరికొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘మన రూల్స్‌ తప్పుగా ఉన్నాయని నేను చెప్పా. ఇండియన్ కాంట్రాక్టర్స్‌కు సామర్థ్యం ఉన్నా వారికి ప్రాజెక్టులు దక్కాలంటే మాత్రం జాయింట్ వెంచర్ల ద్వారానే సాధ్యం అవుతోంది. మన ఫైనాన్షియల్, టెక్నికల్ క్వాలిఫికేషన్స్‌ అలా ఉన్నాయి మరి. ప్రస్తుత పరిస్థితిని బట్టి చైనీస్ కంపెనీలతో జాయింట్ వెంచర్ కలిగి ఉన్న సంస్థలను అనుమతించడం సరైనది కాదు. ఇది దేశ ఆసక్తులను పరిగణనలోకి తీసుకొని చెబుతున్న విషయం. ఆత్మ నిర్భర్ భారత్‌ను చైనాతో ముడిపెట్టొద్దు. మన పోరాటతత్వాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉంది. ఇందుకు లో‌‌‌‌‌‌–కాస్ట్ క్యాపిటల్ అవసరం. అలాగే మన టెక్నాలజీతోపాటు ఎంఎస్‌ఎంఈ (మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌‌ప్రైజెస్)లో ఫారెన్ ఇన్వెస్ట్‌మెంట్‌ గురించి అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంది. రెండు నెలల క్రితం పీపీఈ కిట్స్‌ను చైనా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునే వాళ్లం. ఇప్పుడు ఎంఎస్‌ఎంఈలు మంచి క్వాలిటీతో రోజుకు 5 లక్షల కిట్స్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. ప్రొడక్షన్ ఎక్కువగా ఉన్నందున వీటిని ఇతర దేశాలకు ఎక్స్‌పోర్ట్ చేయాలని కామర్స్‌ మినిస్టర్‌‌కు విజ్ఞప్తి చేశా. దీంతో ప్రపంచంలోని చాలా దేశాలకు మన దిగుమతులను పంపే అవకాశం ఉంటుంది’ అని గడ్కరీ వివరించారు.