కొనే సెంటర్లు లేక రోడ్ల మీదనే వడ్ల కుప్పలు

కొనే సెంటర్లు లేక రోడ్ల మీదనే వడ్ల కుప్పలు
  • మంత్రులు, ఎమ్మెల్యేలే ప్రారంభించాలంటూ లేట్
  • 6,700 సెంటర్లు అనుకుంటే.. ఇప్పటికి 1,336 మాత్రమే ఏర్పాటు
  • 16 జిల్లాల్లో కొనుగోళ్లే షురూ కాలే
  • వ్యాపారులు ఎంఎస్పీ కంటే తక్కువ ఇస్తుండటంతో రైతులకు లాస్

హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్రంలో యాసంగి వరి కోతలు జోరుగ సాగుతున్నయ్. కొన్ని జిల్లాల్లో ఇప్పటికే రైతులు ధాన్యం కొనుగోలు సెంటర్లకు తీసుకుపోతున్నా.. సర్కారు టైమ్‌కు తెరవకపోవడంతో వారికి ఇబ్బందులు ఎదురవుతున్నయ్. దీంతో రైతులు మద్దతు ధర కంటే తక్కువకే వ్యాపారులకు అమ్ముకుని నష్టపోతున్నరు. వరి కోతలు మొదలైన వెంటనే కొనుగోలు సెంటర్లు పెడ్తమని చెప్పినా క్షేత్ర స్థాయిలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. 

ఇక్కడ ఫొటోలో రైతు పేరు కూరాకుల నర్సయ్య. జనగామ జిల్లా మరిగడి గ్రామం. మూడెకరాల్లో వరి వేస్తే వంద బస్తాలు అయినయ్. అమ్ముదామని జనగామ మార్కెట్ యార్డ్​కు వడ్లు తెచ్చిండు. వ్యాపారులు తక్కువ ధరకు అడిగారు. మార్కెట్​లో మూడు రోజులు పడిగాపులు పడ్డ నర్సయ్య తప్పని పరిస్థితిలో శుక్రవారం క్వింటాల్ రూ.1,210 ధరకు అమ్ముకున్నడు. అదే సర్కారు కొనుగోలు కేంద్రాలు మొదలై ఉంటే సాధారణ రకం కింద లెక్కగట్టినా క్వింటాల్​కు రూ.1,868 ధర వచ్చేది. ఈ లెక్కన ఆయన క్వింటాలుకు రూ.650 కి పైగా నష్టపోయాడు. 

సర్కారు ధాన్యం కొనుగోలు నిర్ణయాన్ని ప్రకటించి 22 రోజులైనా 20 శాతం  సెంటర్లు కూడా షురూ కాలేదు. సగం జిల్లాల్లోనూ సెంటర్లు తెరువలేదు. తెరుస్తారు కదా అని రైతులు కొనుగోలు సెంటర్లు పెట్టే దగ్గర వడ్లు తీసుకెళ్లి రాసులుగా పోసి ఎదురుచూస్తున్నరు. మరికొందరు రోడ్లపైనే ఆరబోసుకుని కాపలా కూర్చుంటున్నరు. ఈ టైమ్​లో అకాల వర్షాలు పడి వడ్లు తడిసి మరింత నష్టపోతున్నారు. రోజులు గడుస్తున్నా.. సెంటర్లు ఏర్పాటు చేయకపోవడంతో దిక్కు లేని పరిస్థితిలో వ్యాపారులకే అగ్గువ ధరకు అమ్ముకుంటున్నారు. కేంద్రం క్వింటా ఏ- గ్రేడ్ వడ్లకు రూ.1888, కామన్ వెరైటీకి రూ.1868 మద్దతు ధర ప్రకటించింది. అయితే వ్యాపారులు క్వింటాకు రూ.1200 నుంచి రూ.1400 లోపే చెల్లిస్తున్నారు. 
మంత్రులు, ఎమ్మెల్యేలతో ఓపెనింగ్ అంటూ
ప్రభుత్వం కొనుగోలు సెంటర్లను మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించాలని చూస్తుండటంతో మరింత ఆలస్యమవుతున్నయి. వాళ్లు టైం ఇవ్వకపోవడంతో అధికారులు వాయిదా వేస్తూ వస్తున్నారు. ఉగాది తర్వాత 50 శాతంనికి పైగా సెంటర్లు ఒపెన్​ చేస్తరని అని చెప్పినప్పటికీ కేవలం లోకల్ ఎమ్మెల్యేలు టైం ఇవ్వలేదని రేపు, మాపు అంటూ ఆలస్యం చేస్తున్నారు. అవసరమైన వెంటనే కొనుగోలు కేంద్రాలు పెడ్తమని చెప్పారని, ఇప్పుడేమో ఎమ్మెల్యే, మంత్రి వచ్చి స్టార్ట్ చేసేదాకా ఓపెన్ చేయమని ఆఫీసర్లు అంటున్నారని రైతులు వాపోతున్నారు.
16 జిల్లాల్లో ఒక్క కేంద్రం ఏర్పాటు చేయలే
రాష్ట్రంలో 52 లక్షల 79 వేల 682 ఎకరాలలో వరి సాగయింది. యాసంగి దిగుబడి ఒక కోటి 32 లక్షల  టన్నుల దిగుబడి వస్తుందని సర్కారు అంచనాలు ఉన్నాయి. ఈ సీజన్‌లో మొత్తం 94 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని భావిస్తోంది. ఇందుకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 6700 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. అయితే శనివారం నాటికి 1336 మాత్రమే తెరిచారు. ఈ ఏడాది ఏప్రిల్ చివరికి 30 లక్షల టన్నులు ధాన్యం సేకరించాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు 1.58లక్షల టన్నులు మాత్రమే సేకరించారు. అదే గతేడాది ఈ టైంకు 3.5 లక్షల మెట్రిక్​ టన్నుల ధాన్యం కొన్నారు. సర్కారు 32 జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినా.. ఇంకా 16 జిల్లాల్లో ఒక్క సెంటర్ కూడా ఓపెన్ చేయలే. కొనుగోలు సెంటర్లు టైంకు తెరవక పోవడంలో రైతులు ధాన్యాన్ని రోడ్ల మీద ఆరపోసుకుంటున్నారు. మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, నల్గొండ, ఖమ్మం  జిల్లాల్లో రైతులు రోడ్ల మీద ఎండ బెట్టుకుంటున్నారు. చెడగొట్టు వానలు కురువడంతో ధాన్యం తడిసిపోకుండా కాపాడుకోవడం తిప్పలైతుందని రైతులు వాపోతున్నారు. 
గన్నీ బ్యాగుల కొరత
ఈ సీజన్‌లో 94 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు 22 కోట్ల గన్నీ బ్యాగులు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. ఇప్పటికి  వాటిలో సగం గన్నీ బ్యాగులు కూడా సిద్ధంగా లేవు. అధికారులు గన్నీ బ్యాగులకు ఆర్డర్లు ఇవ్వడంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో కోల్‌కతా నుంచి గన్నీ బ్యాగుల దిగుమతి లేట్‌ అవుతోంది. ప్రస్తుత పరిస్థితి చూస్తే గన్నీ బ్యాగులకు ఇబ్బందులు తప్పేలా లేవు. ధాన్యం దిగుబడికి సరిపడా గన్నీ బ్యాగులు ఉంటేనే ధాన్యం కొనుగోళ్లు జరిగి సెంటర్ల నుంచి మిల్లర్లకు లారీల్లో రవాణాకు జరుగుతుంది. గన్నీ బ్యాగుల కొరతతో ధాన్యం రవాణాకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. 
మిల్లుల కేటాయింపులు అరకొరనే..
సేకరించిన ధాన్యాన్ని నేరుగా మిల్లులకు తరలించేందుకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇంకా ఏర్పాట్లు షురూ కాలేదు. జిల్లాల వారీగా ప్రతి వారం టార్గెట్లు పెట్టి ధాన్యం కొనుగోలు జరగాలని ఉన్నతాధికారులు ఆదేశాలు మాత్రం ఇస్తున్నారు. కానీ వాళ్లు టార్గెట్ ఇచ్చిన స్థాయిలో ధాన్యం కొంటే వాటిని కొనుగోలు సెంటర్ల నుంచి తరలించేందుకు మిల్లులు సరిపడా కేటాయించలేదు. ఏదైనా జిల్లాలో మిల్లులు ఫుల్ అయితే పొరుగు జిల్లాలకు పంపాల్సి ఉంటుంది. దానికి తగ్గ ఆదేశాలు కూడా ఇవ్వలేదు. దీంతో ఇప్పటికే తెరిచిన కొనుగోలు సెంటర్లలోనూ కాంటాలైన తర్వాత మిల్లులకు ధాన్యం బస్తాలను తరలించే వీలు లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఏర్పాటు చేసినట్లు సివిల్‌ సప్లయ్స్‌ అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు.
కోసిన వెంటనే కాంటా పెట్టుకుంటున్నరు
ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు పెట్టని ప్రాంతాల్లో వ్యాపారులు పొలాల్లోనే కోత అయిన వెంటనే కాంటా పెట్టుకుంటున్నరు. ఇప్పుడప్పుడే సెంటర్లు పెట్టరని, వడ్లకు తేమ ఉందని, తమకు అమ్మితే వెంటనే నగదు ముట్టజెప్తామని అంటున్నరు. దీంతో చేసేదేమి లేక కొందరు రైతులు కల్లాల దగ్గరే అమ్ముకుంటున్నరు. వ్యాపారులు క్వింటాకు రూ.1300 లోపే చెల్లిస్తుండటం, హమాలీ, ట్రాక్టర్ చార్జీలు రైతులపైనే వేస్తున్నారు. దీంతో ఒక్కో క్వింటాపై రూ.500 వరకు లాస్​ అవుతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు.

సెంటర్లు జల్దీ ప్రారంభించాలి
కొనుగోలు సెంటర్లను త్వరగా ప్రారంభించాలె. వారం కిందనే తెరుస్తరని తెలిసింది. వడ్లు తీసుకుని జనగామ మార్కెట్​కు వచ్చిన. ఇక్కడ మాత్రం వ్యాపారులే కొంటున్నరు. అగ్గువ సగ్గువకు అడుతున్నరు. సెంటర్​లో అమ్మితే మద్దతు ధర వచ్చేది. వడ్లన్నీ అమ్ముడు పోయినంక సెంటర్లు పెడితే ఏం లాభం. రైతులు నష్టపోక ముందే స్టార్ట్​ చేయ్యాలే.- చింతల రాజు, ఫతేషాపూర్​, రఘనాథపల్లి మండలం
పొలంలనే కాంటా పెట్టిన
ఉగాది తెల్లారి కొనుగోలు సెంటర్ పెడ్తమని చెప్పిండ్రు. పండగ తరువాత రోజు వరి కోపించినా, ప్రభుత్వ సెంటర్​కు పోదాం అంటే ఒపెన్ చేయలేదు అని చెప్పిండ్రు. ఎప్పడు అయితదని అడిగితే.. ఎమ్మెల్యే వచ్చి ఓపెన్ చేసేదాకా కాదన్నరు. ఊర్ల సేటు వచ్చి ఇప్పుడే కాంటా పెట్టు క్వింటాకు రూ.1300 ఇస్త అని వెంటనే నగదు చేతిలో పెట్టి పొలంల నుంచే కొనుక్కపోయిండు.-మధు, యదాద్రి భువనగిరి జిల్లా

అన్నీ ఏర్పాట్లు చేసినం
యాసంగి ధాన్యం సేకరణకు అన్ని ఏర్పాట్లు చేశాం. ఆయా ప్రాంతాలకు అనుగుణంగా మిల్లులు కేటాయించుకోవడం జరుగుతుంది. ప్యాడీ క్లీనర్లు, మాయిశ్చరైజర్లు సిద్ధం చేశాం.  ఇప్పటికే కొన్న ధాన్యం డబ్బులు కూడా రైతుల ఖాతాల్లో వేస్తున్నాం. ఏప్రిల్‌ 30లక్షల టన్నులకు 7.5 కోట్ల గన్నీ బ్యాగులు అవసరమని అంచనా వేశాం. మరో 20లక్షల టన్నులకు అవసరమైన గన్నీ బ్యాగులు ఉన్నాయి. కొత్తగా 3.5 కోట్లు ఆర్డర్‌ చేశాం. మరో 3 కోట్లు ఆర్డర్‌ ఇస్తున్నాం. 2 కోట్లు పాతవి సిద్ధంగా ఉన్నాయి. -రాజిరెడ్డి,  జీఎం, ప్రొక్యూర్‌మెంట్‌, సివిల్‌ సప్లయ్స్‌ డిపార్ట్‌మెంట్