మనోళ్లు ముగ్గురికి పద్మ అవార్డులు

మనోళ్లు ముగ్గురికి  పద్మ అవార్డులు

న్యూఢిల్లీ, హైదరాబాద్, కరీంనగర్, వెలుగు:

71వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. 2020 సంవత్సరానికి గానూ వివిధ రంగాలకు చెందిన 141 ప్రముఖులను ఈ అవార్డులకు ఎంపిక చేసింది. ఇందులో ఏడుగురికి పద్మ విభూషణ్, 16 మందికి పద్మ భూషణ్, 118 మందికి  పద్మశ్రీ- పురస్కారాలను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధూను పద్మ భూషణ్ వరించింది. వ్యవసాయ రంగంలో చింతల వెంకటరెడ్డికి, విద్యా సాహిత్య రంగంలో విజయసారథి శ్రీభాష్యంకు పద్మశ్రీ అవార్డులు దక్కాయి. బీజేపీ అగ్ర నేతలు, ఇటీవలే స్వర్గస్తులైన అరుణ్​జైట్లీ, సుష్మా స్వరాజ్, జార్జ్​ ఫెర్నాండేజ్​లతో పాటు స్వామి విశ్వేశ్వ తీర్థలకు రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్, మనోహర్​ పర్రీకర్​కు పద్మ భూషణ్​ అవార్డులు దక్కాయి. బంగ్లాదేశ్ కు చెందిన సయ్యద్ మౌజం అలీకి ప్రజా వ్యవహారాల రంగంలో, యూఎస్ ఏ కి చెందిన జగదీశ్ సేత్ కు విద్యారంగంలో పద్మ భూషణ్ పతకాలు వరించాయి. వీరితో పాటూ శ్రీలంక, బ్రెజిల్, యూఎస్ఏ, యునైటెడ్ కింగ్ డమ్ కు చెందిన ప్రముఖులకు పద్మ అవార్డులు దక్కాయి.

సంస్కృత పండితుడు..శ్రీభాష్యం

విజయసారథి సంస్కృత భాషలో పండితులుగా పేరొందారు. మధుర మనోహరంగా కవిత్వం చెప్పడంలో దిట్టగా విమర్శకుల ప్రశంసలందుకున్నారు. కరీంనగర్ జిల్లా చేగుర్తి గ్రామంలో 1936 మార్చి 13వ తేదీన ఆయన జన్మించారు. 12 సాంస్కృతిక రచనలు, 7 తెలుగు రచనలతో పాటు, సర్వ వైదిక సంస్థానం స్థాపించి తెలుగు కావ్యాలకు ప్రచారం కల్పించే బాధ్యత తీసుకున్నారు. ఆయన చేసిన సాహిత్య సేవకు గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర తొలి స్పీకర్ అయ్యదేవర కాళేశ్వర రావు చేతులమీదుగా ‘మహాకవి’ బిరుదు అందుకున్నారు.

ఆదర్శ రైతు.. వెంకట్​రెడ్డి

హైదరాబాద్‌ నగరం అల్వాల్‌ ప్రాంతానికి చెందిన ఆదర్శ రైతు చింతల వెంకట్‌ రెడ్డి 30 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు. మట్టే ఎరువు, మట్టే  మందులుగా వాడి అధిక దిగుబడి సాధిస్తున్నారు. ఆరోగ్యమైన పంటలను అందిస్తున్నాడు.  ద్రాక్ష, వరి, గోధుమ, మొక్కజొన్న, చెరుకు, ఆకు కూరలు, కూరగాయలు, గడ్డి పంటలను సాగుచేస్తున్నారు. వ్యవసాయంలో వినూత్న ప్రయోగాలు చూస్తూ శాస్త్రవేత్తలను ఆకర్షించారు. నాణ్యమైన విత్తనాలను రూపొందించి నేషనల్‌ సీడ్‌ కార్పొరేషన్‌కు, తెలంగాణ, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థలకు గత పదేళ్లుగా  విత్తనాలు అందించే రైతుగా మారారు. ఆయన పంటలకు 60 దేశాల్లో పేటెంట్‌ హక్కులకు దరఖాస్తు చేశారు.