రూ.4724కోట్ల నిధుల్ని సేకరించిన పేటీఎం

రూ.4724కోట్ల నిధుల్ని సేకరించిన పేటీఎం

బెంగళూరు : ఇండియన్ డిజిటల్ పేమెంట్స్ కంపెనీ పేటీఎం పేరెంట్ వన్‌‌97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ రూ.4,724 కోట్లు(660 మిలియన్ డాలర్ల) నిధులు సేకరించింది. అలీపే సింగపూర్ ఈ–కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్‌‌వీఎఫ్‌‌ పాంథర్(కేమ్యాన్) లిమిటెడ్, టీ రో ప్రైస్ గ్రోత్ స్టాక్ ఫండ్ ఇంక్ వంటి వాటి నుంచి ఈ పెట్టుబడులు వచ్చినట్టు పేటీఎం పేర్కొంది.  ఒక్కో షేరును 254.58 డాలర్ల రేటుతో 26 లక్షల ఈక్విటీ షేర్లను  అలాట్‌‌ చేసేందుకు వన్‌‌97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు ఇటీవల ఆమోదం తెలిపారు. అలీపే సింగపూర్‌‌‌‌ ఈ–కామర్స్ రూ.1,433 కోట్లను, ఎస్‌‌వీఎఫ్‌‌ పాంథర్‌‌‌‌ రూ.1,430 కోట్లను, టీ రో ప్రైస్ గ్రోత్ స్టాక్ ఫండ్ రూ.704 కోట్లను ఇన్వెస్ట్ చేసినట్టు తెలిపింది. గత నెలలోనూ పేటీఎం 100 కోట్ల డాలర్ల ఫండ్‌‌ను సేకరించింది. పాత ఇన్వెస్టర్లు ఆంట్‌‌ ఫైనాన్సియల్, సాఫ్ట్‌‌బ్యాంక్ విజన్ ఫండ్, కొత్త ఇన్వెస్టర్లు టీ రో ప్రైస్ అసోసియేట్స్ ఇంక్ వంటివి అప్పట్లో ఫండ్ ఇచ్చాయి. ఈ నిధుల సేకరణతో వన్ 97 కమ్యూనికేషన్స్ వాల్యుయేషన్ 16 బిలియన్ డాలర్లకు(దాదాపు రూ.1,13,288 కోట్లకు) పెరిగింది.

వచ్చే మూడేళ్లలో రూ.10వేల కోట్ల పెట్టుబడులు…

గూగుల్ పే, ఫోన్‌‌పే వంటి కంపెనీల నుంచి పేటీఎంకు గట్టి పోటీ వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ తాజా ఇన్వెస్ట్‌‌మెంట్లను తన పేమెంట్స్, ఫైనాన్సియల్ సర్వీసెస్ బిజినెస్‌‌ల అభివృద్ధికి వాడనున్నట్టు పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ చెప్పారు. చిన్న పట్టణాల్లో మరింత మంది కస్టమర్లను, మర్చంట్లను చేరుకోవడానికి వచ్చే మూడేళ్లలో రూ.10 వేల కోట్లు ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్టు వెల్లడించారు. 2019 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో వన్ 97 కమ్యూనికేషన్స్‌‌ నష్టాలు రెండింతలు పెరిగాయి. ఖర్చులు పెరిగి రెవెన్యూ పడిపోయింది. గతేడాది కంపెనీకి రూ.1,490 కోట్ల నష్టాలు వస్తే, 2019 ఆర్థిక సంవత్సరంలో రూ.3,960 కోట్ల నష్టాలొచ్చాయి. కంపెనీ రెవెన్యూలు 2019 ఆర్థిక సంవత్సరంలో రూ.3,050 కోట్లుగా రికార్డయ్యాయి.