పీసీసీ బీసీలకే ఇయ్యాలే

పీసీసీ బీసీలకే ఇయ్యాలే

కాంగ్రెస్‌‌ బీసీ నేతల సమావేశంలో తీర్మానం

గెలిచే చాన్స్​ ఉన్నా టికెట్లు రాకుండా అడ్డుకున్నరు

4 గంటల చర్చ.. ఢిల్లీ వెళ్లి సోనియాను కలవాలని నిర్ణయం

హైదరాబాద్‌‌, వెలుగు: పీసీసీ చీఫ్​ పదవిని బీసీలకే ఇవ్వాలని, ఇతర పదవుల్లోనూ బీసీ నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్​ పార్టీలోని బీసీ నేతలు డిమాండ్​ చేశారు. పార్టీలో బీసీలు ఎదగకుండా అణగదొక్కుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో పార్టీ తిరిగి అధికారంలోకి రావాలంటే బీసీలకు అవకాశాలు ఇవ్వాలని కోరారు. దీనిపై ఏఐసీసీ చీఫ్​ సోనియాగాంధీని కలిసి, విజ్ఞప్తి చేస్తామని ప్రకటించారు. గురువారం హైదరాబాద్‌‌ లోని ఓ ప్రైవేటు హోటల్​లో కాంగ్రెస్ బీసీ నేతల సమావేశం జరిగింది. ఏఐసీసీ ఓబీసీ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు వినయ్ కుమార్‌‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పీసీసీ మాజీ చీఫ్​ పొన్నాల, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్​తదితర సీనియర్లతోపాటు అన్ని జిల్లాలకు చెందిన వంద మందికిపైగా బీసీ నేతలు పాల్గొన్నారు. దాదాపు నాలుగు గంటల పాటు చర్చించి, పలు తీర్మానాలు చేశారు.

ఎదగనివ్వలే..

పార్టీలో అంతర్గతంగా బీసీ నేతలు ఎదగకుండా అణగదొక్కారని, గత అసెంబ్లీ, లోక్ సభ ఎలక్షన్ల సమయంలో గెలిచే చాన్స్​ ఉన్నా టికెట్లు రాకుండా అడ్డుపడ్డారని సమావేశంలో కొందరు నేతలు వాపోయారు. చాలా వివక్ష చూపారని ఆరోపించారు. బీసీ నేతలకు టికెట్లు ఇచ్చిన నియోజకవర్గాల్లో ఇతర వర్గాల వారు మద్దతు ఇవ్వలేదని, ఎదగకుండా అడ్డుకున్నారని పేర్కొన్నారు. పార్టీనీ తిరిగి అధికారంలోకి తీసుకురావాలంటే బీసీలకు సంస్థాగతంగా సాధికారత అప్పగిస్తేనే సాధ్యమని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బీసీ నేతలంతా సంఘటితమై పార్టీలో జరుగుతున్న అన్యాయాన్ని ఎదురిద్దామని ప్రతిపాదించారు. ఈ సందర్భంగా పార్టీలోని బీసీ నేతలంతా సమష్టిగా ఉండి, పోరాడాలని సమావేశంలో నిర్ణయించారు. టీపీసీసీ చీఫ్​ పదవిని బీసీ నేతకు ఇవ్వాలని కోరుతూ తీర్మానం చేశారు. దానిని ఏఐసీసీకి పంపాలని నిర్ణయించారు. సమావేశం నిర్ణయాలు, తీర్మానాలను దాసోజు శ్రవణ్‌‌  మీడియాకు వెల్లడించారు.

సమావేశం తీర్మానాలివే..

టీపీసీసీ అధ్యక్ష పదవి బీసీలకే ఇవ్వాలి

పార్టీని అధికారంలోకి తేవాలంటే బీసీలకు సాధికారత ఇవ్వాలి

ఏఐసీసీ, పీసీసీ పదవుల్లో బీసీలకు ప్రాధాన్యత కల్పించాలి

మున్సిపల్ ఎలక్షన్లలో బీసీలకు జనాభా దామాషా ప్రకారం టికెట్లు ఇవ్వాలి

రిజర్వేషన్లకు అడ్డుగా మారిన ఓబీసీ క్రీమీలేయర్‌ను ఎత్తివేయాలి