Gaddar : ప్రజాగాయకుడు గద్దర్ కన్నుమూత

Gaddar : ప్రజాగాయకుడు గద్దర్ కన్నుమూత


ప్రజా గాయకుడు గద్దర్‌ (74) ఇకలేరు.  కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం (ఆగస్టు 6వ తేదీన)  కన్నుమూశారు. గుండెపోటుతో కొద్దిరోజుల క్రితం అమీర్‌పేటలోని అపోలో స్పెక్ట్రా హాస్పిటల్‌లో చేరారు. అక్కడే గద్దర్‌ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

ప్రజా యుద్ధనౌకగా పేరొందిన గద్దర్‌.. పీపుల్స్‌ వార్‌, అనంతరం మావోయిస్టు, తెలంగాణ ఉద్యమాల్లో తన గళంతో కోట్లాది మంది ప్రజలను ఉత్తేజపరిచారు.

గద్దర్‌ 1949లో తూప్రాన్‌లో జన్మించారు. ఆయన అసలు పేరు గుమ్మడి విఠల్‌ రావు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. తన పాటలతో ఉద్యమాలకు మంచి ఊపుతెచ్చారు. 1987లో కారంచేడు దళితుల హత్యలపై గద్దర్‌ అవిశ్రాంతంగా పోరాటం చేశారు. 

నకిలీ ఎన్‌కౌంటర్లను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే 1997 ఏప్రిల్‌ 6వ తేదీన గద్దర్‌పై హత్యాయత్నం జరిగింది. అమ్మ తెలంగాణమా, పొడుస్తున్న పొద్దుమీద పాటలతో ఉద్యమాలకు ఊపుతెచ్చిన గద్దర్‌... నీ పాదం మీద పుట్టుమచ్చనై పాటకు నంది అవార్డు సైతం అందుకున్నారు. అయితే.. నంది అవార్డును తిరస్కరించారు. 

శేషయ్య, లచ్చమ్మ దంపతులకు1949లో దళిత కుటుంబంలో జన్మించాడు. గాద్దర్ సొంతూరు మెదక్ జిల్లాలోని తూప్రాన్ గ్రామం. 1969 తెలంగాణ ఉద్యమంలో గద్దర్ చురుగ్గా పాల్గొన్నారు. భావ వ్యాప్తికోసం ఆయన ఊరురా తిరిగి ప్రచారం చేశారు. ఇందుకోసం ఆయన బుర్రకథను ఎంచుకున్నారు. ఆయన ప్రదర్శనను చూసిన సినిమా దర్శకులు బి.నరసింగరావు.. భగత్ సింగ్ జయంతి రోజు ఒక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ప్రతి ఆదివారం గద్దర్ తన ప్రదర్శనలు ఇచ్చే వారు. 1971లో బి.నరసింగరావు ప్రోత్సాహంతో "ఆపర రిక్షా" పాట రాశాడు. ఆయన మొదటి ఆల్బం పేరు గద్దర్. ఇదే ఆయన పేరుగా స్థిరపడింది.