పారా ఒలింపిక్స్ విజేతలకు మోడీ ఫోన్

పారా ఒలింపిక్స్ విజేతలకు మోడీ ఫోన్

టోక్యో: పారా ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన విజేతలకు సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఫోన్ చేసి సర్ ప్రైజ్ చేశారు. టోర్నీలో తొలి స్వర్ణం సాధించిన షూటర్ అవని లేఖారా,  రజత పతకం సాధించిన డిస్కస్ త్రోయర్ యోగేశ్‌ కతునియా లకు ప్రధానిమోడీ ప్రత్యేకంగా ఫోన్‌ చేసి అభినందనలు తెలియజేశారు. లేఖారాకు ఫోన్ చేసి మాట్లాడుతూ.. నీవు సాధించిన పతకంతో దేశం చాలా గర్విస్తోందని అన్నారు. 
మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్‌1 విభాగంలో 249.6 స్కోరుతో లేఖారా ప్రపంచ రికార్డును సమం చేసింది. అలాగే ఎఫ్‌56 ఈవెంట్ లో రజతం సాధించిన కతునియాను ప్రధాని మోదీ ట్వీట్ చేసి ప్రశంసించారు. యోగేశ్‌ కతునియా నీది అత్యుత్తమ ప్రదర్శన చేశావ్. మన దేశానికి రజత పతకం సాధించినందుకు సంతోషంగా ఉంది. నీ విజయం వర్ధమాన క్రీడాకారులకు స్ఫూర్తి దాయకంగా నిలుస్తుందని అన్నారు. నిన్ను ఈ విజయానికి ప్రేరేపించడానికి నీ మాతృమూర్తి చేసిన కృషిని అభినందించారు. 
జావెలిన్ త్రో విభాగంలో 40 ఏళ్లలో రెండుసార్లు స్వర్ణం గెలిచిన  దేవేంద్ర ఝజారియా సోమవారం ఎఫ్ 46 విభాగంలో రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. టోర్నీలో కూడా  అత్యుత్తమ ప్రదర్శన కొనసాగించినందుకు ఝజారియాను ప్రధాని మోడీ ట్వీట్ చేసి ప్రశంసించారు. అద్భుతమైన ప్రదర్శన, మన అత్యంత అనుభవజ్ఞులైన అథ్లెట్లలో ఒకరు ఇప్పుడే రజత పతకం సాధించారు. మీరు సాధించిన పతకాలతో దేశం గర్వపడుతుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు.