జీవో 317లో మార్పులు చేయాల్సిందే

జీవో 317లో మార్పులు చేయాల్సిందే

 

  • మహాధర్నాను అడ్డుకున్న పోలీసులు
  • అర్ధరాత్రి నుంచే నిర్బంధాలు.. హైదరాబాద్​ రాకుండా అడ్డగింతలు 
  • నిర్బంధాలను దాటుకుని ధర్నాచౌక్​కు చేరిన వందలాది టీచర్లు
  • జీవో 317ను మార్చాలని డిమాండ్​

హైదరాబాద్, వెలుగు: స్థానికతను కోల్పోయేలా చేస్తున్న జీవో 317లో మార్పులు చేయాలన్న డిమాండ్​తో ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్​పీసీ) చేపట్టిన మహాధర్నాను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. అర్ధరాత్రి నుంచే అన్ని జిల్లాల్లోనూ పెద్ద సంఖ్యలో టీచర్లను నిర్బంధించారు. వాటన్నింటినీ ఛేదించుకుని ఇందిరాపార్క్​కు చేరిన వందలాది మంది టీచర్లను పోలీసులు ధర్నాచౌక్​లోకి వెళ్లనివ్వలేదు. వాళ్లను చుట్టుముట్టి బలవంతంగా అరెస్ట్​ చేసి స్టేషన్లకు తరలించారు. దీంతో పోలీసుల తీరును నిరసిస్తూ.. స్టేషన్ల వద్ద టీచర్లు ఆందోళనలు చేశారు.  

అడ్డంగా బారికేడ్లు పెట్టి..

317 జీవోను సవరించి స్పౌజ్​, మెడికల్​, విడో టీచర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ యూఎస్​పీసీ దశలవారీగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే బుధవారం ధర్నాచౌక్​ వద్ద మహాధర్నాకు టీచర్లు సిద్ధమయ్యారు. అయితే, ధర్నాకు అనుమతి లేదంటూ పోలీసులు మంగళవారం రాత్రి టీచర్ల సంఘాలకు సమాచారమిచ్చారు. రాత్రి నుంచే పలువురు టీచర్లను అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఉదయం పోలీసులు ధర్నాచౌక్​ ప్రాంతాన్ని అధీనంలోకి తీసుకుని అడ్డంగా బారికేడ్లు పెట్టారు. పోలీసు బలగాలను భారీగా మోహరించారు. పోలీస్​ నిర్బంధాలను ఛేదించుకుని ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడున్నర వరకు వందలాది మంది టీచర్లు ధర్నాచౌక్​కు తరలివచ్చారు. దీంతో పోలీసులు వాళ్లందరినీ చుట్టుముట్టి అరెస్ట్​ చేశారు. అందరినీ గాంధీనగర్​, చిక్కడపల్లి, బేగంబజార్​, ఆబిడ్స్​, రాంగోపాల్​పేట, సైఫాబాద్​, నాంపల్లి, నారాయణగూడ, అంబర్​పేట, ముషీరాబాద్​ తదితర స్టేషన్లకు తరలించారు. ఆ క్రమంలో పోలీసులు, టీచర్లకు తోపులాట, వాగ్వాదం జరిగింది. సర్కారుకు, సర్కారు అనుబంధ టీచర్​ సంఘానికి వ్యతిరేకంగా ఉపాధ్యాయులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. వారి ఆందోళనలకు మద్దతిచ్చేందుకు వచ్చిన టీచర్​ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, కొందరు టీచర్లు చిన్నపిల్లలను తీసుకుని ధర్నాకు వచ్చారు. 

టీఆర్​ఎస్​ ధర్నాలను దగ్గరుండి జరిపించి... 

పోలీసుల తీరుపై యూఎస్​పీసీ స్టీరింగ్​ కమిటీ నేతలు మండిపడ్డారు. టీచర్లు తలపెట్టిన శాంతియుత ధర్నాకు అనుమతినివ్వకుండా నిరసన తెలిపే హక్కును కాలరాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం అధికారపార్టీ నిరసనలను దగ్గరుండి జరిపించిన పోలీసులు.. టీచర్ల ధర్నాకు అనుమతివ్వకపోవడం ఏంటని నిలదీశారు. అలాట్​మెంట్​లో నష్టపోయిన టీచర్ల గోడును పట్టించుకోకుండా సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. టీచర్ల సంఘాలతో కనీసం చర్చించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా 317 జీవోను తీసుకొచ్చిందని ఆరోపించారు. అందులోని లోపాలను సరిచేయాలని విజ్ఞప్తి చేస్తున్నా పెడ చెవిన పెడ్తోందన్నారు. మ్యూచువల్​ బదిలీల కోసం జీవోలో మార్పులు చేయాలని కోరారు. టీచర్లకు న్యాయం జరిగేదాకా తమ పోరాటం ఆగదని తేల్చి చెప్పారు. స్థానికత కోల్పోయినోళ్లు, సీనియారిటీ లోపాలు, ఎస్సీ, ఎస్టీలకు దామాషా పాటింపు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, ఇంటర్​ డిస్ట్రిక్ట్​ బదిలీల్లో జిల్లాలు మారినవారు, భార్యాభర్తలకు జరిగిన నష్టాలను పూడ్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ధర్నాలో యూఎస్​పీసీ స్టీరింగ్​ కమిటీ నేతలు యూటీఎఫ్, టీపీటీఎఫ్​, డీటీఎఫ్​, ఎస్సీఎస్టీయూ, టీటీఏ, ఎస్టీఎఫ్​ సంఘాల నేతలు పాల్గొన్నారు.