జేడీయూను కాంగ్రెస్‌లో విలీనం చేయాలని ప్రశాంత్ కిషోర్ సలహా

జేడీయూను కాంగ్రెస్‌లో విలీనం చేయాలని ప్రశాంత్ కిషోర్ సలహా

బీహార్ సీఎం నితీశ్ కుమార్ కు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు మధ్య గత కొన్ని రోజులుగా మాటల యుద్దం నడుస్తూనే ఉంది. బీజేపీ కోసమే ప్రశాంత్ కిషోర్ పనిచేస్తున్నారని ఇటీవల నితీశ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జేడీయూని రాజకీయంగా సమాధి చేయాలని ప్రశాంత్ కిషోర్ కుట్రపన్నారని ధ్వజమెత్తారు. అందుకే జేడీయూను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని తనకు ప్రశాంత్ కిషోర్ సలహా ఇచ్చినట్లు వెల్లడించారు.

ఇటీవల తనతో ప్రశాంత్ కిషోర్ భేటీ కావడంపై నితీశ్ కుమార్ స్పందించారు. ప్రశాంత్ కిషోర్ అభ్యర్థన మేరకే ఈ భేటీ జరిగిందని చెప్పారు. అయితే ఈ భేటీపై ఇది వరకే స్పందించిన ప్రశాంత్ కిషోర్.. నితీశ్ పిలుపు మేరకే తాను వెళ్లి ఆయన్ను కలిసినట్లు తెలిపారు. పార్టీకి (జేడీయూ) సారథ్యంవహించేందుకు ముందుకు రావాలని నితీశ్ తనను ఆహ్వానించారని.. దానికి తాను నిరాకరించినట్లు చెప్పారు.  సీఎం కుర్చీ ఇచ్చేందుకు ఆయన ముందుకు వచ్చినా తాను నితీశ్ కోసం పనిచేయబోనని ప్రశాంత్ కిషోర్ స్పష్టంచేశారు.

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బీహార్‌ జేడీయు కోసం పనిచేస్తున్నట్లు బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. నితీశ్ కుమార్‌తో భేటీ అయిన ప్రశాంత్ కిషోర్ ఆ మేరకు లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నారని అనుమానం వ్యక్తంచేస్తున్నారు.  అయితే ప్రశాంత్ కిషోర్ బీజేపీలో కోసం పనిచేస్తున్నారని జేడీయూ నేతలు ప్రత్యారోపణలు చేస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ బీహార్‌లో చేపడుతున్న పాదయాత్ర వెనుక బీజేపీ ఉందంటున్నారు. ఈ పాదయాత్రకు ప్రశాంత్ కిషోర్‌కు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఐటీ శాఖ, ఈడీ, సీబీఐ ఎందుకు పట్టించుకోవడం లేదు? అంతా కేంద్రం అండదండలు ఆయనకు ఉండటమే కారణమని అభిప్రాయపడుతున్నారు. బీహార్‌లో నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడుతున్న ప్రశాంత్ కిషోర్.. జాతీయ స్థాయిలో నిరుద్యోగ సమస్యపై కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.