V6 News

పిచ్చ కొట్టుడు కొట్టిన ప్రియాంష్ ఆర్య, కూపర్ కొన్నోలీ.. లక్నో ముందు భారీ టార్గెట్!

పిచ్చ కొట్టుడు కొట్టిన ప్రియాంష్ ఆర్య, కూపర్ కొన్నోలీ.. లక్నో ముందు భారీ టార్గెట్!

PBKS vs LSG: ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS) పరుగుల విధ్వంసం సృష్టించింది. ముల్లాన్‌పూర్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ బ్యాటర్లు బౌండరీల వర్షం కురిపించారు. నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ 7 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు తొలి ఓవర్లోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మొహమ్మద్ షమీ వేసిన మూడో బంతికే ప్రభ్‌సిమ్రాన్ సింగ్ అవుట్ అయ్యాడు. అయితే, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ప్రియాన్ష్ ఆర్య, కూపర్ కొన్నోలీ లక్నో బౌలర్లపై కనికరం లేకుండా విరుచుకుపడ్డారు. వీరిద్దరూ మైదానం నలుమూలలా సిక్సర్లు, ఫోర్లతో చెలరేగడంతో స్కోరు బోర్డు రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. సెంచరీ దిశగా సాగుతున్న ప్రియాన్ష్ ఆర్య (187 పరుగుల వద్ద), కూపర్ కొన్నోలీ (185 పరుగుల వద్ద) అవుట్ కావడంతో పంజాబ్ ఇన్నింగ్స్ కాసేపు నెమ్మదించింది.

ఒక దశలో పంజాబ్ 300 పరుగులకి  దగ్గరగా వెళ్తున్న క్రమంలో లక్నో బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు. మణిమారన్ సిద్ధార్థ్, ప్రిన్స్ యాదవ్ వరుస వికెట్లతో పంజాబ్‌ను దెబ్బకొట్టారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (5) కూడా నిరాశపరచడంతో కేవలం 8 పరుగుల వ్యవధిలోనే పంజాబ్ 3 కీలక వికెట్లు కోల్పోయింది. నేహల్ వధేరా (13) కూడా తక్కువ స్కోరుకే పరిమితమయ్యాడు. కానీ చివరి ఓవర్లలో మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్ కలిసి స్కోరును 250+ దాటించారు. వీరిద్దరూ 44 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. శశాంక్ సింగ్ (17) అవుట్ అయినా, స్టోయినిస్ మాత్రం ఆఖరి వరకు అద్భుతమైన షాట్లతో అలరించాడు. దీంతో పంజాబ్ ఈ సీజన్‌లోనే వన్ ఆఫ్ ది హయ్యెస్ట్ స్కోరును నమోదు చేసింది.

కాగా పంజాబ్ కింగ్స్ ఇన్సింగ్స్ లో ఏకంగా 21 సిక్సులు కొట్టారు. మరోవైపు, లక్నో బౌలర్లలో మణిమారన్ సిద్ధార్థ్, ప్రిన్స్ యాదవ్ తలో రెండు వికెట్లు తీసి పంజాబ్ జోరుకు కళ్లెం వేసే ప్రయత్నం చేశారు. మొహమ్మద్ షమీ, మోహసిన్ ఖాన్ చెరో వికెట్ పడగొట్టారు. 255 పరుగుల లక్ష్యంతో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు బరిలోకి దిగబోతుంది. రిషబ్ పంత్ సేన ఈ పరుగుల కొండను అధిగమిస్తుందా లేక పంజాబ్ జేత్రయాత్ర కొనసాగుతుందా అనేది వేచి చూడాలి.