- విద్యార్థుల చేతికి మళ్లీ పెన్ను.. పుస్తకం ఇచ్చిన గవర్నమెంట్
- గతంలో ప్రతి విద్యార్థికి ఒక ల్యాప్‌టాప్ అక్కడి రూల్..
- ఇప్పుడు ఒక సబ్జెక్ట్‌కు ఒక టెక్స్ట్‌బుక్ తప్పనిసరి
- లిటరసీ లెవల్స్ పడిపోవడం, పిల్లల్లో ఏకాగ్రత తగ్గడం వల్లే
- ‘బ్యాక్ టు బేసిక్స్’ కాన్సెప్ట్కు పునాది
స్వీడన్ దేశం ప్రపంచానికి ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది. దశాబ్ద కాలంగా డిజిటల్ రివల్యూషన్‌కి మారుపేరుగా నిలిచిన ఈ దేశం.. ఇప్పుడు సడెన్‌గా ‘బ్యాక్ టు బేసిక్స్’ అనే సరికొత్త కాన్సెప్ట్‌ను మొదలుపెట్టింది. ఇది కేవలం ఒక మార్పు మాత్రమే కాదు. మోడర్న్ టెక్నాలజీ వల్ల కలిగే అనర్థాలను ముందే గుర్తించి, మనిషి మేధస్సును మళ్లీ గాడిలో పెట్టే ఒక టర్నింగ్ పాయింట్.
కొన్నేళ్ల క్రితం వరకు క్లాస్‌రూమ్ అంటే చేతిలో ట్యాబ్, కళ్లముందు కంప్యూటర్ స్క్రీన్ మాత్రమే ఉండేవి. కానీ, 2026 నాటికి స్వీడన్‌లోని పాఠశాలల రూపురేఖలు మారిపోయాయి. ప్రభుత్వం భారీ పెట్టుబడితో మళ్లీ పాత రోజుల్లోలాగే పుస్తకాలను, పెన్నులను తరగతి గదుల్లోకి తీసుకొచ్చింది.
స్క్రీన్ల నుంచి పేజీల వైపు..
2009 నుంచే స్వీడన్ తన విద్యా వ్యవస్థను పూర్తిగా డిజిటలైజ్ చేసింది. ప్రతి విద్యార్థికి ఒక ల్యాప్‌టాప్ లేదా ట్యాబ్లెట్ ఇవ్వడం అక్కడి రూల్. అయితే, గత పదేళ్ల అనుభవం తర్వాత ఎక్స్పర్ట్స్కి ఒక చేదు నిజం తెలిసింది. డిజిటల్ డివైజ్‌ల వల్ల స్టూడెంట్స్‌లో చదివే స్కిల్ తగ్గింది. దాంతోపాటు ఏకాగ్రత కూడా బాగా తగ్గిందని రీసెర్చ్‌ల్లో తేలింది. అందుకే, సుమారు120 మిలియన్ డాలర్ల ఖర్చుతో ప్రతి విద్యార్థికి కనీసం ఒక సబ్జెక్ట్‌కు ఒక ఫిజికల్ టెక్స్ట్‌బుక్ ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
భారీగా ఖర్చుపెడుతోంది
గవర్నమెంట్ భారీగా డబ్బు ఖర్చు పెట్టి స్కూల్స్‌లో పుస్తకాలు, పెన్నులు, పేపర్‌లను తిరిగి తీసుకొస్తోంది. లిటరసీ లెవల్స్ పడిపోవడం, ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు డిజిటల్ ఓవర్‌యూజ్ వల్ల వచ్చాయని గుర్తించి, “ఫ్రమ్ స్క్రీన్ టు బైండర్” అనే స్లోగన్‌తో ముందుకు వెళ్తోంది.
ఈ ఏడాది ఆగస్టు నుంచి స్వీడన్లో జాతీయ స్థాయి మొబైల్ ఫోన్ బ్యాన్ అమలులోకి రాబోతోంది. స్టూడెంట్స్ ఉదయం స్కూల్‌కు వచ్చిన వెంటనే తమ ఫోన్‌లను అప్పగించాలి. స్కూల్ డే మొత్తం క్లాసులు, బ్రేక్స్, ఆఫ్టర్- స్కూల్ యాక్టివిటీలు కూడా ఫోన్ లేకుండా గడపాలి.2028 నాటికి పూర్తిగా టెక్స్ట్‌బుక్ మీదే ఆధారపడనుంది. ప్రీ-స్కూల్‌లోనూ డిజిటల్ టూల్స్ తప్పనిసరి కాదు.
లగోమ్ - స్వీడిష్ లైఫ్‌స్టైల్ మంత్ర!
స్వీడన్ ఈ ‘బ్యాక్ టు బేసిక్స్’ కాన్సెప్ట్‌ని కేవలం స్కూళ్లకే పరిమితం చేయలేదు. వాళ్ల ప్రాచీన సంస్కృతిలోని ‘లగోమ్’ అనే సూత్రాన్ని మళ్లీ వెలికితీశారు. లగోమ్ అంటే ‘అతి ఉండొద్దు. కొదవ కాకూడదు. సరిపడా ఉండాలి’ అనేది దీనర్థం. ఈ సూత్రాన్ని పాటిస్తూ వాళ్లు రీచ్ అయిన అచీవ్మెంట్స్ ఒకసారి చూస్తే.. ఫాసిల్ ఫ్రీ స్టీల్ తయారీలో స్వీడన్ టాప్‌లో ఉంది.
2026 నాటికి సిటీల్లో సైకిల్ ట్రాక్‌లు, ప్రకృతికి దగ్గరగా ఉండే చెక్క ఇళ్ల నిర్మాణం పెరిగింది. అలాగే ప్రస్తుతం స్వీడన్ వైద్యులు ఒత్తిడితో బాధపడే రోగులకు మందుల కన్నా ‘నేచర్ ప్రిస్క్రిప్షన్’ అంటే అడవుల్లో గడపడం, పర్వత ప్రాంత గాలిని పీల్చడం వంటి ప్రకృతి చికిత్సలను సూచిస్తున్నారు.
ఇంటీరియర్ డిజైన్లో మార్పులు
2026 నాటికి స్వీడిష్ ఇళ్లలో ‘కోల్డ్ మినిమలిజం’ స్థానంలో ‘వార్మ్ అండ్ హ్యూమన్-సెంట్రిక్ డిజైన్’ వచ్చి చేరింది. కేవలం తెల్లటి గోడలు కాకుండా మట్టి రంగులు, సేజ్ గ్రీన్ వంటి ప్రకృతికి దగ్గరగా ఉండే రంగులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రతి ఇంటిలోనూ ఒక మూల ప్రకృతిని ప్రతిబింబించేలా మొక్కలు, సహజమైన కాంతి వచ్చేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఇంటి పెరట్లోనే పండిస్తూ..
స్వీడన్ ప్రజలు ఇప్పుడు తమ ఇంటి పెరట్లోనే ఆహారాన్ని పండించుకునే పద్ధతిని మళ్లీ మొదలుపెట్టారు. సిటీల్లోని పెద్ద సూపర్ మార్కెట్లు కూడా లోపలే ఆకుకూరలు పండించే వినూత్న సాంకేతికతను వాడుతున్నాయి. అలాగే, వ్యర్థాలను తగ్గించడానికి పాత దుస్తులను మళ్లీ రీసైకిల్ చేసి కొత్త పోగులుగా మార్చే ఫ్యాక్టరీలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయి.
అనలాగ్ రివైవల్
టెక్నాలజీ విపరీతంగా పెరిగిన ఈ కాలంలో మళ్లీ పాత పద్ధతులపై ఆసక్తి పెరగడాన్ని ‘అనలాగ్ రివైవల్’ అంటారు. డిజిటల్ స్క్రీన్ల వల్ల వచ్చే హ్యాపీనెస్ కంటే, చేత్తో తాకగలిగే వస్తువులు మనకు ఎక్కువ మానసిక సంతృప్తిని ఇస్తాయి. అంతేకాదు.. చేతిరాత రాయడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. పేపర్ మీద చదవడం వల్ల విషయం బాగా గుర్తుంటుంది. ఇది కేవలం పాత కాలానికి వెళ్లడం కాదు. టెక్నాలజీ వల్ల కోల్పోయిన ‘స్పర్శ జ్ఞానాన్ని’ మళ్లీ పొందడం.
మెదడుకు విరామం
శరీరంలోని మలినాలను తొలగించుకోవడానికి డిటాక్స్ డ్రింక్స్ వంటివి తీసుకుంటుంటారు. అలాగే స్మార్ట్‌ఫోన్లు, సోషల్ మీడియా ప్రభావం నుంచి మన మెదడును కాపాడుకోవడానికి డిజిటల్ డిటాక్స్ అవసరం. కంటిన్యూగా వచ్చే నోటిఫికేషన్లు చూడటం వల్ల మన ఏకాగ్రత తగ్గిపోతోంది. నిద్రలేమి, ఒత్తిడి పెరుగుతున్నాయి. కాబట్టి ఈ డిజిటల్ డిటాక్స్ అనే మెథడ్‌ని ఫాలో అవ్వాలి.
రోజూ కొన్ని గంటల పాటు ఫోన్‌కు దూరంగా ఉండటం వల్ల క్రియేటివిటీ పెరుగుతుంది. కళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులతో నేరుగా మాట్లాడే సమయం దొరుకుతుంది. ఈ ‘అనలాగ్ రివైవల్’ ద్వారా స్వీడన్ ఫ్యూచర్ జనరేషన్స్‌కు ఒక మంచి మెసేజ్ అందిస్తోంది. అదేంటంటే... ‘‘అత్యున్నత సాంకేతికత అవసరమే, కానీ అది మన మూలాలను దెబ్బతీయకూడదు.’’
డిజిటల్ లెర్నింగ్ అవసరమా ?
ఇది ఒక పెద్ద చర్చ. టెక్నాలజీ వద్దని కాదు, అది ఎంత వరకు ఉండాలి? అనేదే అసలు ప్రశ్న. గ్రామీణ ప్రాంతాలకు నాణ్యమైన విద్యను అందించడానికి, కొన్ని అంశాలను ఈజీగా అర్థమయ్యేలా వివరించడానికి యానిమేషన్ అంటే.. డిజిటల్ ఎడ్యుకేషన్ అవసరం. అయితే చిన్న పిల్లలకు మొదటి దశలోనే స్క్రీన్లు అలవాటు చేస్తే, వాళ్లలో ఆలోచనా శక్తి తగ్గిపోయే ప్రమాదం ఉంది.
స్వీడన్ లాంటి దేశాలు ఇప్పుడు ఏమంటున్నాయంటే ‘‘కోడింగ్ నేర్పండి, కానీ అది పుస్తకం చదవడం నేర్చుకున్న తర్వాతే.” కాబట్టి డిజిటల్ విద్య అనేది ఒక ‘సాధనం’ లాగా ఉండాలి తప్ప, అది ‘గురువు’ స్థానాన్ని భర్తీ చేయకూడదు. ఈ మూడింటి మధ్య బ్యాలెన్స్ ఉంటేనే హెల్దీ ఫ్యూచర్‌కు రూట్ క్లియర్‌గా ఉంటుంది.

