ఒకప్పుడు మన ఇళ్లలో అంట్లు తోమటానికి, గిన్నెలు కడగటానికి సహజసిద్ధమైన కొబ్బరి పీచును మాత్రమే వాడేవారు. పర్యావరణానికి ఎలాంటి హాని చేయని ఆ పాతకాలపు అలవాటును పక్కనబెట్టి.. ఆధునికత పేరుతో మనం రంగురంగుల ప్లాస్టిక్ స్పాంజ్ స్క్రబ్బర్లను వంటగదిలోకి ఆహ్వానించాం. జిడ్డు ప్లేట్లు, మరకలు పడ్డ మగ్‌లను ఈజీగా శుభ్రం చేసే ఈ మెత్తటి స్పాంజ్ స్క్రబ్బర్లు.. ప్రతి నిమిషం మనల్ని, మన పర్యావరణాన్ని ఎంతటి ప్రమాదంలోకి నెడుతున్నాయో తాజా పరిశోధనల్లో తేలింది. మనం గిన్నెలు తోముతూ స్పాంజ్‌ను గట్టిగా పిండిన ప్రతిసారీ.. అది కంటికి కనిపించని మైక్రోప్లాస్టిక్స్ నీటిలోకి విడుదల చేస్తోందని శాస్త్రవేత్తలు గుర్తించారు.
జర్మనీ శాస్త్రవేత్తల ప్రయోగం..
యూనివర్సిటీ ఆఫ్ బాన్ పరిశోధకులు రోజువారీ వాడకంలో కిచెన్ స్పాంజ్‌లు ఎలా అరిగిపోతాయి. వాటివల్ల ఏం జరుగుతుంది అనే అంశంపై సుదీర్ఘ అధ్యయనం చేశారు. ఇందుకోసం జర్మనీ, ఉత్తర అమెరికాలోని కొన్ని ఫ్యామిలీలను భాగస్వామ్యం చేసి.. వారు రోజూ వాడే స్క్రబ్బర్ల విధానాన్ని పరిశీలించారు. దీనితో పాటు ల్యాబరేటరీలో గిన్నెలు తోమేటప్పుడు వచ్చే ఒత్తిడి, ఘర్షణను ప్రతిబింబించేలా ‘స్పాంజ్‌బాట్’ అనే ఆటోమేటెడ్ పరికరాన్ని సృష్టించి మరీ పరీక్షలు జరిపారు.
ఈ పరిశోధనలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. పరీక్షించిన ప్రతి స్పాంజ్ కూడా మైక్రోప్లాస్టిక్స్‌ను విపరీతంగా వదులుతున్నట్లు తేలింది. సగటున ఒక వ్యక్తి వాడే స్పాంజ్ స్క్రబ్బర్ల వల్ల ఏడాదికి 0.68 గ్రాముల నుంచి 4.21 గ్రాముల మైక్రోప్లాస్టిక్స్ నీటిలో కలుస్తున్నాయట. ప్రపంచంలో వీటిని వాడుతున్న కోట్ల మంది జనాభాను లెక్కలోకి తీసుకుంటే ఇది వందల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలుగా మారుతోంది. ఇవి డ్రైనేజీ వ్యవస్థలను దాటుకుని నదులు, సముద్రాల్లోకి చేరి పర్యావరణాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.
►ALSO READ | వాస్తు & జ్యోతిష్యం: పర్స్ ఖాళీ అవుతుందా.. ఈ చిన్న వస్తువు ఉంచండి.. ఇక నోట్లతో కళకళలాడుతుంది..!
అయితే ఈ పరిశోధనలో ప్లాస్టిక్ కంటే మించిన మరో ఆందోళనకరమైన నిజం బయటపడింది. గిన్నెలు కడిగే ప్రక్రియలో పర్యావరణానికి జరుగుతున్న మొత్తం నష్టంలో మైక్రోప్లాస్టిక్స్ వాటా కంటే.. నీటి వృథా వాటానే అత్యధికంగా ఉందని తేలింది. చేత్తో గిన్నెలు తోమేటప్పుడు ట్యాప్ ఆన్ చేసి ఉంచడం వల్ల జరిగే పర్యావరణ నష్టం ఏకంగా 85 నుండి 97 శాతంగా ఉందట. అంట్లు తోమటంలో నిరంతరం వృథా అవుతున్న నీరు అంతకంటే పెద్ద నష్టాన్ని కలిగిస్తోందట.
ఫ్రాన్‌హోఫర్ ఇన్‌స్టిట్యూట్ అండ్ లైడెన్ యూనివర్సిటీ సహకారంతో జరిగిన ఈ పరిశోధన.. ప్రజలను భయపెట్టడానికి కాకుండా వారిలో అవగాహన పెంచడానికి ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీలైనంత వరకు తక్కువ ప్లాస్టిక్ ఉండే స్క్రబ్బర్లను ఎంచుకోవడం, ఒకే స్పాంజ్‌ను ఎక్కువ రోజులు వాడటం, గిన్నెలు తోమేటప్పుడు నీటిని వృథా చేయకుండా ట్యాప్ కట్టేయడం వంటి చిన్న చిన్న మార్పుల ద్వారా ఈ ముప్పు నుంచి పర్యావరణాన్ని కొంతైనా కాపాడొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మీ ఫ్యామిలీలు ఈ ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి బయటపడాలంటే పాతకాలం నాటి ప్రత్యామ్నాయ, ఎకో ఫ్రెండ్లీ ఆప్షన్స్ ఎంచుకోవటం మంచిది.
