వాషింగ్టన్: అమెరికాలో కుటుంబ గొడవలకు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం మధ్యాహ్నం అయోవా రాష్ట్రంలో జరిగిన కాల్పుల్లో ఏడుగురు చనిపోయారు. మస్కటీన్ నగరం పార్క్ అవెన్యూలోని ఓ ఇంట్లో కాల్పులు జరిగినట్లు సమాచారం అందడంతో పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు. బులెట్ గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్న నాలుగు డెడ్‌బాడీలను గుర్తించి పోస్ట్‌మార్టానికి తరలించారు.
ఈ నలుగురిని చంపిన నిందితుడు 52 ఏండ్ల ర్యాన్ విల్లిస్ స్పాట్‌కు దగ్గరలోని ఓ బ్రిడ్జి వద్ద తనను తాను తుపాకీతో కాల్చుకుని చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం మిల్ స్ట్రీట్‌లోని మరో ఇంట్లో ఒకరు, గ్రాండ్‌వ్యూ అమెన్యూలోని ఓ కంపెనీ వద్ద మరో వ్యక్తి మృతదేహాలను కనుగొన్నారు. చనిపోయిన ఈ ఏడుగురు ఒకే కుటుంబానికి చెందినవారని, వాళ్ల మధ్య ఉన్న తగాదాలే వరుస హత్యలకు కారణమై ఉండొచ్చని పేర్కొన్నారు.
