కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానంతరం భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వీకరించే శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు ఈ ఏడాది (2026) మే నెలలో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో టీటీడీ లడ్డూ ఉత్పత్తిని కూడా విస్తృతంగా పెంచి, ఎలాంటి కొరత లేకుండా ప్రసాదాలను అందిస్తోంది.
ఈ ఏడాది (2026) మే నెలలో మొత్తం ఒక కోటి 21లక్షల35వేల 528 లడ్డూలను విక్రయించారు. గత రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది లడ్డూల విక్రయాలు గణనీయంగా పెరిగాయని టీటీడీ అధికారులు తెలిపారు.2024 మే నెలలో 1.01 కోట్ల లడ్డూలు విక్రయమవ్వగా, 2025లో 1.10 కోట్లకు పెరిగాయి. ప్రస్తుతం 2026లో 1.21 కోట్లకు పైగా విక్రయాలు నమోదయ్యాయి.
రోజుకు 4 లక్షలకుపైగా లడ్డూల తయారీ
శ్రీవారి ప్రసాదాల తయారీలో నాణ్యతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్న టీటీడీ, రోజుకు సగటున 4.08 లక్షల లడ్డూలను తయారు చేస్తోంది. సాధారణ రోజుల్లో 4 లక్షల నుండి 4.5 లక్షల వరకు లడ్డూలు తయారవుతుండగా, ప్రత్యేక సందర్భాల్లో ఉత్పత్తిని మరింత పెంచుతోంది.
లడ్డూ తయారీకి 68 టన్నుల ముడి పదార్థాల వినియోగం
అత్యంత పవిత్రమైన శ్రీవారి ప్రసాదమైన లడ్డూల తయారీ కోసం రోజువారీగా 68 టన్నులకు పైగా ముడి పదార్థాలను టీటీడీ వినియోగిస్తోంది. లడ్డూ తయారీకి రోజుకు సుమారు 32 టన్నుల చక్కెర, 16 టన్నుల శెనగపిండి, 16 టన్నుల నెయ్యి, 3.5 టన్నుల జీడిపప్పు, 2 టన్నుల ఎండుద్రాక్ష, 400 కిలోల యాలకులు, 800 కిలోల కలకండ వినియోగిస్తున్నారు.
►ALSO READ | టీటీడీ బ్రహ్మోత్సవాలు: స్వామి వారి రథోత్సవం..రథ సారథులుగా ముగ్గురు సిస్టర్స్ .
ఒక్క చిన్న లడ్డూ తయారీకి సగటున 167 నుండి 170 గ్రాముల ముడి పదార్థాలను ఉపయోగిస్తున్నారు. ఇందులో సుమారు 78 గ్రాముల చక్కెర, 39 గ్రాముల శెనగపిండి, 36 గ్రాముల నెయ్యి, 7 గ్రాముల జీడిపప్పు, 3 గ్రాముల ఎండుద్రాక్ష తదితర పదార్థాలు ఉంటాయి.
