- టిటిడి మహారథాలను నడిపించేది అమ్మాయిలే....
- ఎనిమిది తరాలుగా రథసేవలో మహిళల అరుదైన వారసత్వం...
- రథం ఆపడం నుంచి తిప్పడం వరకు...
- హర్షిణి రెడ్డి, ఖ్యాతి రెడ్డిల చేతుల్లో సాంకేతిక నైపుణ్యం...
ఆలయాలలో బ్రహ్మోత్సవాలకు ఓ ప్రత్యేకత ఉంటుంది. ప్రతి రోజు వేరు వేరు వాహనాలలో స్వామివారు భక్తులకు దర్శనం ఇస్తుంటారు. అయితే తిరుమల బ్రహ్మోత్సవాలలో జరిగూ రథోత్సవానికి అత్యంత ప్రాధాన్యత ఉన్నది. ఇదిచాలా కష్టతరమైనదని చెప్పాలి. వాహనాలను అయితే వాహన బేరర్లు మోస్తారు. అదే రథోత్సవంలో స్వామి వారు వేంచేసి యున్న రథాన్ని భక్తులే స్వయంగా లాగుతారు.స్వామి వారి రథ యాత్ర సజావుగా సాగాలంటే రథ సారధుల పాత్ర ఎంతో కీలకం.టీటీడీ బ్రహ్మోత్సవాలలో రథసారధుల పాత్ర ఏంటి..! అందుకు ఎలాంటి నైపుణ్యం కావాలి..! రధం నడపడం అందరికి సాధ్యామా.. ? తెర వెనక రథసారధుల సేవపై స్పెషల్ స్టోరీ..
బ్రహ్మోత్సవాలలో రథోత్సవం అత్యంత కీలక ఘట్టం. తిరుమల బ్రహ్మోత్సవాల సమయంలో వీధులలో భక్తుల సందోహం గోవింద నామస్మరణ మధ్య రథోత్సవం కోలాహలంగా జరుగుతుంది. 70 అడుగులకు పైఎత్తులో, టన్నుల కొద్దీ బరువైన రథంపై స్వామి వారు ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇస్తారు. రథాన్ని భక్తులు లాగుతూ ఉంటారు. కానీ రథాన్ని నియంత్రించటం ఇక్కడ ఎంతో క్లిష్టతరమైన పని. శక్తి,యుక్తితో సమన్వయం చేసుకోవాలి.
దేవుడి ఉత్సవాల సమయంలో .. రథోత్సవాల్లో భారీ రథాన్ని లాగేటప్పుడు, రథం చక్రాల కదలికను నియంత్రించాలి. ‘సరుకు’, వేగాన్ని ఆపే ‘తుండు’, ఎత్తైన మార్గాల్లో చక్రాలను నెట్టే ‘తుండ్లు’ వంటి పరికరాలను సమర్థంగా వినియోగించాలి. ఇంతటి కష్టంతో కూడిన క్లిష్టమైన పనిని తిరుమల బ్రహ్మోత్సవాల సమయంలో జరిగే రథోత్సవంలో హర్షిణి రెడ్డి, ఖ్యాతి రెడ్డి సిస్టర్స్ ఎంతో సునాయాసంగా సేవలందిస్తున్నారు.
రథం వెనుక భాగంలో ఉండటంతో ముందున్న పరిస్థితులు కనిపించకపోయినా, తండ్రి సూచనలతో సమన్వయం చేసుకుంటూ రథాన్ని అదుపులో ఉంచుతారు. ప్రారంభంలో చేతులు, కాళ్లకు గాయాలు అయినప్పటికీ స్వామి సేవపైనే దృష్టి పెట్టామని తెలిపారు.
ముగ్గురు యువతులు ఖ్యాతి శ్రీ రెడ్డి, హర్షిణి రెడ్డి, మోహితారెడ్డి తమ వృత్తుల్లో డాక్టర్, ఇంజినీర్, చార్టర్డ్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నప్పటికీ, శ్రీ వేంకటేశ్వరుడి సేవను జీవితంలో అత్యున్నత గౌరవంగా భావిస్తున్నారు. వీధుల్లో రథాన్ని ముందుకు నడిపించడం భక్తి పరంగా మాత్రమే కాకుండా, ధైర్యం, శ్రమకు కూడా ఒక ప్రతీక. రథాన్ని నియంత్రించడం అంటే మహిళలకు కష్టమైన పని అని అనేవారికి ఈ అక్కా చెల్లెళ్ళు ధీటుగా సమాధానమిస్తున్నారు..
వేలాది మంది భక్తజనం మధ్యలో రథం కంట్రోల్ అవ్వకపోతే ప్రాణాపాయం ఏర్పడే ప్రమాదం ఉంటుంది. అయినా ధైర్యంగా, నిబద్ధతతో రథాన్ని ముందుకు నడిపించడం మా అదృష్టం,” అని అంటున్నారు అమ్మాయిలు.
ఎంటెక్ సివిల్ ఇంజినీర్ చేసిన హర్షిణిరెడ్డి తన అనుభవాలను పంచుకున్నారు. మా వంశీకులే కొన్ని తరాల ఏళ్లుగా రథాన్ని నియంత్రిస్తున్నారు. నేను ఏడవ తరం అమ్మాయి. నాన్న మునస్వామిరెడ్డి ప్రోత్సాహంతోనే నేర్చుకున్నా. బీటెక్ చదివేటప్పుడే రథాన్ని మలుపు తిప్పడం, బ్రేకులు వేయడం, వేగాన్ని నియంత్రించడం వంటి పనుల్లో పాల్గొన్నా. తొమ్మిదేళ్లుగా రథంలో కుడివైపు, మధ్యలో ఉంటూ నియంత్రిస్తున్నా. ఇది కష్టమైన పని. చిన్న పొరపాటు జరిగితే ప్రమాదం తప్పదు. అయినా స్వామివారి సేవే మాకు ముఖ్యమని తెలిపారు హర్షిణి రెడ్డి.
తిరుపతి గోవిందరాజ స్వామి బ్రహ్మోత్సవాలను టీటీడీ ఎంతో వైభవంగా నిర్వహిస్తుంది. ఈ ఉత్సవాల్లో జరిగే రథోత్సవంలో సుమారు 500 ఏళ్లుగా రథ సారథులుగా నాలుగు కుటుంబాల వారు వ్యవహరిస్తున్నారు. ఏడు తరాల అనంతరం రథం లాగే అదృష్టం తమకు దక్కిందని హర్షిణి, ఖ్యాతి తెలిపారు. తండ్రి చంద్రశేఖర్ రెడ్డి, బాబాయ్ మునస్వామి రెడ్డి, మామ రామకృష్ణ రెడ్డిల వద్ద నుంచి రథ నియంత్రణలో శిక్షణ పొందినట్లు చెప్పారు.
18 ఏళ్ల వయసులోనే తిరుమల బంగారు రథాన్ని లాగి సేవ ప్రారంభించామన్నారు. కుటుంబంలో ఆడపిల్లలకూ సమాన ప్రోత్సాహం లభించడంతో .. తిరుమల, శ్రీకాళహస్తి, తిరుచానూరు, శ్రీనివాస మంగాపురం తదితర ఆలయాల్లో సేవలు అందిస్తున్నామని తెలిపారు. వైద్యురాలు అయిన ఖ్యాతిశ్రీ స్వామి వారి రథాన్ని నియంత్రించడంలో పాల్గొంటున్నారు. “మొదట భయం వేసింది. కానీ అక్క హర్షిణి స్ఫూర్తితో నేర్చుకున్నా. రథాన్ని మలుపుల్లో తిప్పే బాధ్యత నాది. సరుక బరువే 15 కిలోలు. ఎంత జాగ్రత్తగా ఉన్నా దెబ్బలు తగులుతూనే ఉంటాయి. కానీ ఇప్పుడు అందరూ మమ్మల్ని మెచ్చుకుంటున్నారు. ‘అమ్మాయిలు చేసేది కాదు’ అని అన్నవారు ఇప్పుడు ‘మీ వల్లే సాధ్యమైంది’ అంటున్నారు.” అని ఆమె చెబుతున్నారు.
తిరుమలతో పాటు తిరుచానూరు, గోవిందరాజస్వామి ఆలయం, నారాయణవనం, కాణిపాకం, శ్రీకాళహస్తి వంటి ప్రాంతాల్లో కూడా వీరు రథసేవలో పాల్గొంటారు. మహిళలు కూడా భక్తి సేవలో ముందుండటం విశేషంగా చెప్పవచ్చు.
