అది తప్పని కాంగ్రెస్, బీజేపీ నిరూపిస్తే..నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా : కేటీఆర్

అది తప్పని కాంగ్రెస్, బీజేపీ నిరూపిస్తే..నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా : కేటీఆర్

కేసీఆర్ హయాంలో తెలంగాణ అన్ని రంగాల్లో నంబర్ వన్‌గా నిలిచిందని.. 3 శాతం జనాభాతో దేశ జీడీపీకి 5 శాతం కాంట్రిబ్యూషన్ అందించిందని కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ కంటే ఎక్కువ అభివృద్ధి ఎక్కడైనా జరిగిందని కాంగ్రెస్, బీజేపీలు నిరూపిస్తే.. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. 6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ మాట తప్పిందని మండిపడ్డారు. 

వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పిన రేవంత్, భట్టిలు ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని రంగాలు మందగమనంలో ఉన్నాయని.. ప్రభుత్వ నినాదం రైజింగ్ గా ఉన్నా, విధానం మాత్రం ఫాలింగ్ లా ఉందంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేదంటూనే, ప్రభుత్వ ప్రకటనల కోసం కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ అప్పులపై కాంగ్రెస్ అబద్ధపు ప్రచారం చేస్తోందని కేటీఆర్ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో చేసిన అప్పు కేవలం 2.8 లక్షల కోట్లు అయితే.. అప్పులు చేయడంలో రేవంత్ ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ కొద్ది కాలంలోనే ఏకంగా 4 లక్షల కోట్ల అప్పులు చేసిందని.. ఆ డబ్బు అంతా ఎక్కడికి పోతోందని నిలదీశారు. ఇచ్చిన హామీల్లో పెన్షన్ సొమ్ము పెంచలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, మహిళలకు 2500 రూపాయలు వేయలేదని.. కాంగ్రెస్ ఫస్ట్ హాఫ్ అంతా డిజాస్టర్ అని కొట్టిపారేశారు.

 ముఖ్యమంత్రి పదే పదే తాను తొక్కుకుంటూ వచ్చానని అంటుంటారని.. కానీ ఆయన నిజంగా తొక్కేసింది తెలంగాణ ఆర్థిక పరిస్థితినేనని ఎద్దేవా చేశారు. బాల్క సుమన్ 'మిలిటెంట్ పోరాటం' అనడం పొరపాటేనని అంగీకరిస్తూనే.. మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తగలబెడతామన్న కాంగ్రెస్ నేతలపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు డిస్కమ్‌లను తీసుకువచ్చి రైతులకు పెద్ద ముప్పు తెస్తున్నారని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు

దేశంలో ఎవరైనా, ఎక్కడైనా పార్టీ పెట్టుకోవచ్చన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్.  జనసేన తెలంగాణలో కొత్తగా పోటీ చేసేదేముందని ప్రశ్నించారు. గత ఎన్నికల్లోనే బీజేపీతో కలిసి పోటీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ తెలంగాణకు వస్తే అడ్డుకుంటామని ఎవరూ చెప్పలేదని.. కానీ, తెలంగాణ ఆవిర్భావ రోజే హైదరాబాద్‌కు వచ్చి సభ పెడతామంటే ఎలా అని నిలదీశారు. 

తెలంగాణ రాష్ట్రం కచ్చితంగా ఇక్కడి భూమి పుత్రుల జాగీరేనని స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడినప్పుడు అన్నం తినలేదని పవన్ గతంలో చెప్పారని.. ఆయన మాకు కొత్తగా దేశభక్తి గురించి చెప్పాల్సిన అవసరం లేదన్నారు. పవన్‌ను యాక్టర్‌గా అభిమానిస్తాం, ఏపీ డిప్యూటీ సీఎంగా గౌరవిస్తాం.. కానీ, ఇక్కడి సెక్రటేరియట్‌లో కూర్చుంటామంటే ఊరుకోమని హెచ్చరించారు. తెలంగాణకు  ఓజీ కేసీఆర్ ఉన్నారని, ఆయన చాలని వ్యాఖ్యానించారు.