తెలంగాణలో బరాబర్ పోటీ చేస్తాం అంటూ పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. పవన్ కల్యాణ్ ఏదో కొత్తగా తెలంగాణలో పోటీ చేస్తు్న్నట్లు చెబుతున్నారని.. ఆయన ఎప్పటి నుంచో తెలంగాణలో పోటీ చేస్తూనే ఉన్నారని.. ఇప్పుడైనా మిమ్మల్ని ఆపుతున్నది ఎవరు.. ఆపేది ఎవరూ అంటూ ప్రశ్నించారు కేటీఆర్.
2023 ఎన్నికల్లో పోటీ చేయ లేదా.. పోటీ చేశారు కదా.. అసెంబ్లీ ఎన్నికల్లో.. మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో 350 వార్డుల్లో పోటీ చేశారు కదా.. ఇప్పుడే కొత్తగా తెలంగాణలో పోటీ చేస్తాం అని చెప్పటం ఏంటని ప్రశ్నించారు కేటీఆర్. పోటీ చేయకుండా మిమ్మల్ని ఆపుతున్నది ఎవరో.. ఎవరు వద్దన్నారో మీరే చెప్పాలంటూ డైరెక్ట్ గా పవన్ కల్యాణ్ నే ప్రశ్నించారు కేటీఆర్. 2018లో చంద్రబాబుతో కలిసి వచ్చి పోటీ చేయలేదా.. 2023లో మీరు పోటీ చేశారు కదా.. ఇప్పుడు కూడా పోటీ చేయండి.. ఎవరు వద్దన్నారు అంటూ నిలదీశారు కేటీఆర్.
జనసేన పార్టీని ఎవరో అడ్డుకుంటున్నట్లు మీకు మీరే ఊహాజనితమైన ఒక ప్రపంచం సృష్టించుకుని.. మీకు మీరే మాట్లాడేతి ఎలా అంటూ ప్రశ్నించారు కేటీఆర్. తెలంగాణ రాష్ట్రం ఏదో ఆషామాషీగా ఏర్పడిన రాష్ట్రంగా చెబుతున్నారని.. తెలంగాణ ఈజీగా వచ్చింది కాదని.. వేల మంది బలిదానాలతో.. రక్తంతో తడిసిన నేల తెలంగాణ అని.. తెలంగాణ గురించి మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని మాట్లాడాలంటూ చురకలు అంటించారు మాజీ మంత్రి కేటీఆర్.
ALSO READ : బిర్యానీ పెడతా తినిపో.. నీ దగ్గర దేశభక్తి నేర్చుకోవాల్సిన అవసరం లేదు : కేటీఆర్
ఒకాయన తల్లిని చంపి బిడ్డను బతికించారంటాడు.. ఇంకొకాయనేమో విభజించిన పద్ధతి నచ్చలేదంటాడు.. ఈ మాటలు వింటుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం ఇష్టం లేదని వాళ్ల మాటలతోనే స్పష్టం అవుతుంది కదా అని వివరించారు కేటీఆర్. తెలంగాణ ఏర్పాటు ఇష్టం లేకనే కదా 11 రోజులు అన్నం తినకుండా ఉంది.. అలాంటి నువ్వు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజునే మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అని ప్రశ్నించారు కేటీఆర్.జనసేన పార్టీని తెలంగాణలో అడ్డుకోవాల్సిన అవసరం ఎవరికీ లేదని.. హాయిగా పోటీ చేసుకోండి అంటూ సూచించారు కేటీఆర్.
