మనుషులకు మిగిలింది 3 ఏళ్లే: నిశ్శబ్ద AI సామ్రాజ్యంపై గూగుల్ మాజీ బిజినెస్ చీఫ్ కామెంట్స్!

మనుషులకు మిగిలింది 3 ఏళ్లే: నిశ్శబ్ద AI సామ్రాజ్యంపై గూగుల్ మాజీ బిజినెస్ చీఫ్ కామెంట్స్!

ఉదయాన్నే లేచింది మొదలు ఈమెయిల్స్ రాయడం, డాక్యుమెంట్లు చెక్ చేయడం, ట్రావెల్ ప్లాన్స్ వేసుకోవడం.. ఇలా ప్రతి చిన్న విషయానికి చాట్‌జీపీటీ, జెమిని, క్లాడ్, గ్రోక్ వంటి ఏఐ టూల్స్‌ను వాడేస్తున్నాం. అబ్బా.. ఏఐ ఎంత అద్భుతంగా పనిచేస్తోందో కదా అని మురిసిపోతున్నాం. అసలు సినిమా ఇంకా ముందుంది.. మనం ఇప్పుడు చూస్తున్నది కేవలం సముద్రంలో కాకిరెట్ట లాంటి చిన్న భాగం మాత్రమేనని హెచ్చరిస్తున్నారు గూగుల్ ఎక్స్ మాజీ బిజినెస్ చీఫ్ మో గవ్‌దత్. రానున్న 3 ఏళ్లలో అంటే 2027 నాటికి ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ పూర్తి స్థాయిలో ప్రపంచాన్ని చుట్టేస్తుందని.. ఆ తర్వాత మానవ సమాజం, ఉద్యోగాలు, పరిశ్రమలు పూర్తిగా తలకిందులు కావడం ఖాయమని బాంబు పేల్చారు. ఆయన వెల్లడించిన విషయాలు వింటే ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టాల్సిందే.

ల్యాబ్‌లలో అలార్మింగ్ సైలెన్స్..
ప్రజలు ఏఐని కేవలం చాట్‌బాట్లు, వైరల్ వీడియోల రూపంలోనే చూస్తూ మురిసిపోతున్నారని గవ్‌దత్ అన్నారు. కానీ టెక్ కంపెనీల సీక్రెట్ రీసెర్చ్ ల్యాబ్‌లలో జరుగుతున్న పరిణామాలు చాలా భయంకరంగా ఉన్నాయట. అక్కడి ఏఐ సిస్టమ్స్ తమ కోడింగ్‌ను తామే స్వయంగా సరిదిద్దుకుంటూ.. సరికొత్త అప్‌డేటెడ్ వెర్షన్లను క్షణాల వ్యవధిలో క్రియేట్ చేసుకుంటున్నాయని చెప్పారు. ల్యాబ్ లోపల టెక్ నిపుణులు చూస్తున్న ఏఐ ఇంటెలిజెన్స్ నమ్మశక్యం కాని స్థాయిలో ఉందని.. బయట ప్రపంచంలో జరుగుతున్న హడావుడి వేరు, లోపల సైంటిస్టుల గదిలో ఉన్న నిశ్శబ్దం వేరు.. ఆ నిశ్శబ్దమే చాలా ప్రమాదకరమైనదని అన్నారు. ఏఐ సాంకేతికత కంటే కూడా, దాన్ని నియంత్రించే పవర్‌ఫుల్ కంపెనీలు, ప్రభుత్వాలు దాన్ని ఎలా వాడుకుంటాయనేదే అసలైన ముప్పని స్పష్టం చేశారు.

వైట్ కాలర్ ఉద్యోగాలపై మొదటి దెబ్బ.. 
ఏఐ వల్ల మొదటి ముప్పు ఏసీ గదుల్లో కూర్చుని కంప్యూటర్లపై పనిచేసే వైట్ కాలర్ ఉద్యోగులకేనని గవ్‌దత్ హెచ్చరించారు. కాల్ సెంటర్ ఏజెంట్లు, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్లు, ట్రావెల్ ఏజెంట్లు వంటి రొటీన్ పనులు చేసే వారి ఉద్యోగాలు క్షణాల్లో మాయమవుతాయట. ఇక పారాలీగల్స్, ఫైనాన్షియల్ అనలిస్ట్‌లు, గ్రాఫిక్ డిజైనర్లు, మ్యూజిక్ కంపోజర్లు, మిడిల్ మేనేజర్లు, చివరికి డాక్టర్ల పనిభారం కూడా ఏఐ వల్ల భారీగా తగ్గిపోతుందట. గతంలో ఐదారుగురు చేసే పనిని ఇప్పుడు ఒక్కరే ఏఐ సహాయంతో పూర్తి చేసేస్తారు. అయితే కంపెనీలు ఉద్యోగులను నేరుగా తీసేయడం కంటే.. ఎంట్రీ లెవెల్ కొత్త ఉద్యోగాల నియామకాలను పూర్తిగా నిలిపివేయడం ద్వారా ఈ మార్పును మొదలుపెడతాయని, ఇది ఇప్పటికే మార్కెట్లో ప్రారంభమైందని గుర్తుచేశారు.

►ALSO READ | RBI కొత్త ప్లాస్టిక్ కరెన్సీ నోట్ల నిర్ణయం అదానీ కోసమేనా..? సోషల్ మీడియాలో ప్రచారం

ప్రభుత్వం ఏం చేయాలి?
కేవలం ఆఫీస్ ఉద్యోగాలే కాదు, రాబోయే రోజుల్లో రోబోటిక్స్ ద్వారా డ్రైవర్లు, లాజిస్టిక్స్, ఆర్మీ, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ రంగాల్లోని మనుషుల స్థానాలను కూడా ఏఐ మింగేస్తుంది. ఈ పరిస్థితి దేశాల్లో విపరీతమైన నిరుద్యోగానికి, ద్రవ్యోల్బణానికి దారితీసి సామాజిక అశాంతిని రేకెత్తిస్తుందని, దీనిని అడ్డుకోవడానికి ప్రభుత్వాలు కోవిడ్ పాండమిక్ సమయంలో స్పందించినంత వేగంగా ప్లాన్స్ సిద్ధం చేసుకోవాలని ముందుగానే హెచ్చరించారు. 

ఏఐ ప్రపంచంలో బతకాలంటే ఏం చేయాలి?
కథ అంతా భయానకంగా ఉన్నా.. లాంగ్ టర్మ్‌లో ఏఐ వల్ల మానవాళికి ప్రయోజనాలు కూడా ఉన్నాయని గవ్‌దత్ ఆశాభావం వ్యక్తం చేశారు. మరి ఈ ఏఐ యుగంలో యువత ఎలా బతకాలి? దానికి ఆయన ఇచ్చిన సింపుల్ సలహా.. ఏఐతో పోటీ పడకండి, దాన్ని ఎలా వాడాలో నేర్చుకోండి అంటున్నారు. మిషన్లు ఎప్పటికీ కాపీ కొట్టలేని మానవీయ విలువలను పెంచుకోవాలని పిలుపునిచ్చారు. సానుభూతి, కమ్యూనికేషన్ స్కిల్స్, క్రియేటివిటీ, నిజమైన మానవ సంబంధాలు.. ఇవి మాత్రమే రేపటి రోజున మిమ్మల్ని మార్కెట్లో గెలిపించే బ్రహ్మాస్త్రాలు అవుతాయని సూచించారు.