RBI కొత్త ప్లాస్టిక్ కరెన్సీ నోట్ల నిర్ణయం అదానీ కోసమేనా..? సోషల్ మీడియాలో ప్రచారం

RBI కొత్త ప్లాస్టిక్ కరెన్సీ నోట్ల నిర్ణయం అదానీ కోసమేనా..? సోషల్ మీడియాలో ప్రచారం

భారత బ్యాంకింగ్ రంగంలో సరికొత్త సంచలనం తెరపైకి వచ్చింది. ప్రజల జేబుల్లో ఉండే కాగితపు నోట్ల స్థానంలో ప్లాస్టిక్ అంటే పాలిమర్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్లాన్ చేస్తోంది. పాట్నా, ముంబైలలో జరిగిన ఆర్‌బీఐ బోర్డు సమావేశాల్లో దీనిపై తీవ్రమైన చర్చలు జరిగాయని.. త్వరలోనే రూ.10, రూ.20 నోట్లతో ఒక పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం కానుందనే వార్త నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. అయితే డిజిటల్ పేమెంట్స్ యుగంలో ఆర్‌బీఐ సడన్‌గా తీసుకున్న ఈ ప్లాస్టిక్ నోట్ల నిర్ణయం వెనుక అసలు కథ వేరే ఉందంటూ సోషల్ మీడియాలో ఒక రేంజ్ ప్రచారం ఊపందుకుంది. ఈ సరికొత్త సంస్కరణ దేశంలో ఒక బడా పారిశ్రామికవేత్తకు భారీగా లాభం చేకూర్చడానికేనంటూ నెటిజన్లు కనెక్టింగ్ డాట్స్ అంటూ పోస్టు పెడుతున్నారు. 

రిజర్వు బ్యాంక్ ప్లాస్టిక్ కరెన్సీ నోట్ల వెనుక అదానీకి లాభం చేకూర్చటమే ప్రధాన ఉద్దేశ్యం అంటున్నారు నెటిజన్లు. ఈ ప్లాస్టిక్ నోట్లను తయారు చేయడానికి సాధారణ ప్లాస్టిక్ కాకుండా ‘BOPP’ (Bi-axially Oriented Polypropylene) అనే ప్రత్యేకమైన పాలిమర్ ఫిల్మ్‌లను ఉపయోగిస్తారు. సరిగ్గా ఇక్కడే అదానీకి ఈ విషయానికి ఉన్న కనెక్షన్‌ను వెలికితీశారు. అదానీ ఎంటర్‌ప్రైజెస్ కంపెనీ 2021లో గుజరాత్‌లోని ముంద్రా వద్ద ‘ముంద్రా పెట్రోకెమ్ లిమిటెడ్’ పేరిట భారీ పీవీసీ, పాలిమర్ ప్లాంట్‌ను రిజిస్టర్ చేసింది. దాదాపు రూ.34వేల 900 కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్న ఈ భారీ పెట్రోకెమికల్ క్లస్టర్, కరెక్ట్‌గా ఈ బీఓపీపీ పాలిమర్‌ను భారీ స్థాయిలో ఉత్పత్తి చేయడానికే డిజైన్ చేయబడిందని ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం భారతదేశంలో పాలిమర్ దేశీయ ఉత్పత్తి సామర్థ్యం డిమాండ్ కంటే చాలా తక్కువగా ఉంది. ఈ భారీ గ్యాప్‌ను భర్తీ చేయడానికి అదానీ పెట్రో ప్లాంట్‌కు పర్యావరణ అనుమతులు కూడా చాలా వేగంగా లభించాయని, ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం నుంచి రూ.14వేల కోట్ల క్రెడిట్ లైన్ కూడా మంజూరైందని సోషల్ మీడియాలో లెక్కలు బయటకు వచ్చాయి. గతంలో విమానాశ్రయాలు, ఓడరేవులు, బొగ్గు, సోలార్ కాంట్రాక్టులు దక్కించుకున్న తరహాలోనే.. ఇప్పుడు ఆర్‌బీఐ ముందుకు తెచ్చిన తక్కువ ఖర్చుతో కూడిన కరెన్సీ నోట్ల ప్రతిపాదన ద్వారా పరోక్షంగా అదానీ పాలిమర్ వ్యాపారానికి భారీ ఆర్డర్లు దక్కేలా కేంద్రం ప్లాన్ చేస్తోందని విమర్శకులు అంటున్నారు.

ఈ ప్లాస్టిక్ నోట్ల నిర్ణయంపై ఎటువంటి ఓపెన్ టెండర్లు గానీ, పార్లమెంటులో చర్చలు గానీ లేకుండానే కేవలం రెండు ఆర్‌బీఐ బోర్డు సమావేశాల్లోనే లైన్ క్లియర్ చేయడంపై సోషల్ మీడియాలో తీవ్రమైన ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఆర్‌బీఐ మాత్రం పెరిగిపోతున్న కరెన్సీ ప్రింటింగ్ ఖర్చులను తగ్గించడానికి, నోట్ల మన్నికను పెంచడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నా.. సోషల్ మీడియా ప్రపంచం మాత్రం దేశంలో ఏ సంస్కరణ వచ్చినా.. దాని రూట్ మ్యాప్ చివరికి ఒకే అడ్రస్‌కు ఎందుకు చేరుకుందో ఆలోచించండి అంటూ అందరినీ ఆలోచింపజేస్తున్నారు. మెుత్తానికి మోడీ సర్కార్ అదానీ కోసం మరో కొత్త బిజినెస్ డీల్ రెడీ చేస్తోంది అనే ప్రచారం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.