వేదాంత గ్రూప్ అధినేత అనిల్ అగర్వాల్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ మైనింగ్, సహజ వనరుల దిగ్గజం వేదాంత లిమిటెడ్ కార్యాలయాలపై ఈడీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. జూన్ 2న ముంబై, ఢిల్లీలోని వేదాంత ప్రధాన ఆఫీసుల్లో ఈ సోదాలు జరిగాయి. ఫెమా నిబంధనలను ఉల్లంఘించి, బ్రిటన్‌లోని తన మాతృ సంస్థకు రాయల్టీ చెల్లింపులు జరిపారనే ఆరోపణలపై ఈడీ రంగంలోకి దిగింది. కంపెనీ తన వ్యాపారాన్ని 5 విభిన్న రంగాలుగా విభజించే కీలక ప్రక్రియలో ఉన్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం కార్పొరేట్ వర్గాల్లో సంచలనంగా మారింది.
అసలు వివాదం ఏమిటంటే.. భారతదేశంలో లిస్ట్ అయిన వేదాంత లిమిటెడ్ మార్కెట్ విలువ దాదాపు రూ.లక్షా 30వేల కోట్లు. దీని మాతృ సంస్థ అయిన 'వేదాంత రిసోర్సెస్' యూకే కేంద్రంగా పనిచేస్తోంది. ప్రస్తుతం ఈ విదేశీ పేరెంట్ కంపెనీ దాదాపు రూ.74వేల కోట్ల భారీ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఈ అప్పుల భారాన్ని తగ్గించుకోవడానికి ఇండియాలోని వేదాంత లిమిటెడ్ నుండి మాతృ సంస్థకు భారీగా రాయల్టీల రూపంలో నిధులు తరలించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నిధుల బదిలీలో ఫెమా రూల్స్ ఉల్లంఘన జరిగిందనే అనుమానంతో ఈడీ లోతుగా దర్యాప్తు చేస్తోంది.
ఈ రైడ్స్ వార్త బయటకు రావడంతోనే స్టాక్ మార్కెట్‌లో వేదాంత షేర్లు ఒత్తిడికి లోనయ్యాయి. ఒక దశలో కంపెనీ షేరు 0.7 శాతం నష్టంతో రూ. 334.6 వద్ద ట్రేడ్ అయింది. ఈ పరిణామాలపై వేదాంత గ్రూప్ ప్రతినిధి స్పందిస్తూ.. తాము దర్యాప్తు సంస్థలకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నామని, వారు కోరిన సమాచారాన్ని అందిస్తున్నామని క్లారిటీ ఇచ్చారు. చట్టాలకు కట్టుబడి పనిచేయడానికి తమ కంపెనీ కట్టుబడి ఉందని ప్రకటించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం నియంత్రణ సంస్థల పరిశీలనలో ఉన్నందున దీనిపై ఎక్కువ మాట్లాడలేమని చెప్పారు.
ఇటీవలే మే నెలలో వేదాంత గ్రూప్ తన డీమెర్జర్ ప్రక్రియకు అవసరమైన ప్రభుత్వ అనుమతులను పొందింది. దీని ప్రకారం ప్రస్తుత వ్యాపారం నుంచి 4 కొత్త విడివిడి కంపెనీలు స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ కానున్నాయి. ప్రధాన సంస్థ అయిన వేదాంత లిమిటెడ్ యథావిధిగా కొనసాగుతూ.. హిందుస్థాన్ జింక్, జింక్ ఇంటర్నేషనల్, కాపర్, ఫెర్రో క్రోమ్, న్యూ టెక్నాలజీ విభాగాలను తన వద్దే ఉంచుకోనుంది. వ్యాపార పునర్వ్యవస్థీకరణ ద్వారా ఇన్వెస్టర్లను ఆకట్టుకోవాలని చూస్తున్న తరుణంలో ఈడీ రైడ్స్ రూపంలో వచ్చిన ఈ బ్రేక్ వేదాంత గ్రూప్‌ను ఎలాంటి ఇరకాటంలో పడేస్తుందో చూడాలంటున్నారు మార్కెట్ నిపుణులు.
