కేంద్రం సరికొత్త ఆలోచన: టెండర్ల తయారీ, రివ్యూ ప్రక్రియలో AI వాడకం

కేంద్రం సరికొత్త ఆలోచన: టెండర్ల తయారీ, రివ్యూ ప్రక్రియలో AI వాడకం

ఏఐ సాంకేతికత రోజురోజుకూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. నిన్నటివరకు ఐటీ ఉద్యోగులు, ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకే పరిమితమైన దీని వాడకం.. ఇప్పుడు సైలెంట్‌గా ప్రభుత్వ వ్యవస్థల్లోకి కూడా ప్రవేశిస్తోంది. కేవలం రోజువారీ అవసరాలకే కాకుండా.. అత్యంత సంక్లిష్టమైన ప్రభుత్వ పాలనా వ్యవహారాల్లో సైతం కీలక పాత్ర పోషించడానికి డిజిటల్ ఇండియా సిద్ధమవుతోంది.

ప్రభుత్వానికి టెండర్లు, ప్రొక్యూర్మెంట్ డాక్యుమెంట్ల తయారీ అనేది సాధారణంగా ఎంతో తలనొప్పితో కూడిన వ్యవహారం. దీనికోసం వివిధ ప్రభుత్వ విభాగాలు వారాల తరబడి కష్టపడాల్సి వస్తుంది. ఎన్నో నిబంధనలు, పాలసీలు, ఫైనాన్షియల్ రూల్స్ పరిశీలించిన తర్వాతే టెండర్ డాక్యుమెంట్ ఫైనల్ అవుతుంది. అయితే ఇప్పుడు ఈ భారీ భారాన్ని తన భుజాలపై వేసుకోవడానికి ఏఐ రెడీ అవుతోంది.

కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్(NeGD) ఏఐ వినియోగం దిశగా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ టెండర్లను డ్రాఫ్ట్ చేయడం, రివ్యూ చేయడం, వాటి చట్టబద్ధతను సరిచూడడం కోసం ఒక ప్రత్యేకమైన ‘ఏఐ-పవర్డ్ ప్లాట్‌ఫారమ్’ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. మే 26న ఇందుకు సంబంధించిన బిడ్‌లను కూడా ఆహ్వానించింది.

ఈ సరికొత్త ఏఐ సిస్టమ్ కేవలం సాధారణ డాక్యుమెంట్లను తయారు చేయడమే కాకుండా.. గతంలోని టెండర్ రికార్డులను పరిశీలించి సరికొత్త సూచనలు చేస్తుంది కూడా. అంతేకాదు.. నిబంధనలలో ఏవైనా లోపాలు ఉంటే ఇట్టే కనిపెట్టేస్తుంది. రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్, కొటేషన్లు వంటి కీలక పత్రాలను ఇది క్షణాల్లో సిద్ధం చేసేస్తుంది.

ఇటీవల సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆన్-స్క్రీన్ మార్కింగ్ సిస్టమ్‌లో తక్కువ ధరకే కాంట్రాక్ట్ దక్కించుకున్న ఒక వెండర్ మొబైల్ ఫోన్లతో ఆన్సర్ షీట్లు స్కాన్ చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఇలాంటి అవకతవకలకు చెక్ పెట్టేందుకు, టెండర్ల ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చేందుకు ఈ ఏఐ టూల్ ఎంతో ఉపయోగపడనుంది.

ఈ ఏఐ ప్లాట్‌ఫారమ్ అమలులోకి వస్తే టెండర్ల తయారీ సమయం ఏకంగా 70 నుండి 80 శాతం వరకు తగ్గుతుందని NeGD అంచనా వేస్తోంది. అలాగే టెండర్ దాఖలు చేసే ముందే వచ్చే సందేహాలు కూడా 40 శాతం వరకు తగ్గుతాయి. ఏఐ ఇచ్చే సమాచారంలో తప్పులు 5 శాతం కంటే తక్కువగా ఉండేలా, విశ్వసనీయత 95 శాతం ఉండేలా కఠిన నిబంధనలు పెట్టారు.

అయితే ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ ఏఐ వ్యవస్థ అధికారుల ఉద్యోగాలను భర్తీ చేయదు. కేవలం ఒక సహాయకుడిగా మాత్రమే పనిచేస్తుంది. దీనిని ‘హ్యూమన్-ఇన్-ది-లూప్’ సూత్రం ఆధారంగా డిజైన్ చేస్తున్నారు. అంటే ఏఐ సిస్టమ్ ఇచ్చే ఏ సూచననైనా ప్రభుత్వ అధికారులు రివ్యూ చేసి, ఓకే చెబితేనే అది డాక్యుమెంట్‌లో యాడ్ అవుతుందట. ఈ ప్రాజెక్ట్‌ను కేంద్ర మంత్రిత్వ శాఖలతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాడుకునేలా పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. వేర్వేరు రాష్ట్రాల చట్టాలు, కొనుగోలు విధానాలకు అనుగుణంగా ఈ ఏఐ పని చేస్తుంది రాబోయే రోజుల్లో.