V6 News

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై బెంజ్ బీభత్సం.. ఫోటోలు దిగుతుండగా ఢీ కొట్టిన కారు.. భార్య కళ్లెదుటే భర్త మృతి

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై బెంజ్ బీభత్సం.. ఫోటోలు దిగుతుండగా ఢీ కొట్టిన కారు.. భార్య కళ్లెదుటే భర్త  మృతి

హైదరాబాద్‌లోని మాదాపూర్ దుర్గం చెరువు  కేబుట్  బ్రిడ్జిపై  విషాదం చోటుచేసుకుంది. ఏప్రిల్ 19న తెల్లవారుజామున అతి వేగంతో దూసుకొచ్చి ఓ బీఎండబ్ల్యూ కారు  ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

అసలేం జరిగిందంటే.. శ్యామ్ రాజ్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి పల్సర్ బైక్‌పై జూబ్లీహిల్స్ నుంచి  ఐకియా వైపు వెళ్తున్నారు. కేబుల్ బ్రిడ్జి అందాలను చూసి ముచ్చటపడ్డ ఆ దంపతులు  ఫోటోలు దిగేందుకు అక్కడ ఆగారు. భర్త శ్యామ్ రాజ్ బ్రిడ్జిపై నిలబడి ఉండగా, భార్య తన మొబైల్‌లో ఫోటోలు తీస్తోంది. సరిగ్గా అదే సమయంలో మృత్యువు బెంజ్ కారు రూపంలో దూసుకొచ్చింది.అతివేగంగా వచ్చిన బీఎండబ్ల్యూ కారు (నెంబర్WB 06 B 7003).. ఫోటో దిగుతున్న శ్యామ్ రాజ్‌ను  ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే కారు నడుపుతున్న వ్యక్తి వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయాడు. స్థానికులు వెంటనే స్పందించి  రక్తపు మడుగులో ఉన్న శ్యామ్ రాజ్‌ను చికిత్స నిమిత్తం సమీపంలోని మెడికవర్ ఆసుపత్రికి తరలించారు.

►ALSO READ | హైదరాబాద్ రిచ్ కిడ్స్ టార్గెట్.. ఇన్‌స్టాగ్రామ్ లో మైనర్లకు వల.. ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేస్తూ లక్షల దోపిడీ!

ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న శ్యామ్ రాజ్ పరిస్థితి విషమించడంతో ఇవాళ సాయంత్రం తుదిశ్వాస విడిచారు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కంటిముందే భర్త ప్రాణాలు కోల్పోవడంతో భార్య కన్నీరుమున్నీరవుతోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన కారును స్వాధీనం చేసుకుని పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.