బాబ్రీ కూల్చివేత గర్వంగా భావిస్తున్నా: సాధ్వీ ప్రజ్ఞా

బాబ్రీ కూల్చివేత గర్వంగా భావిస్తున్నా: సాధ్వీ ప్రజ్ఞా

భోపాల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్ మరో వివాదాస్పద కామెంట్

మరో నోటీసు పంపించిన ఎలక్షన్ కమిషన్

భోపాల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ తాజాగా చేసిన కామెంట్స్ మరోసారి కాంట్రవర్సీ రేపాయి. ముంబై ఉగ్రదాడిలో అమరుడైన  మహారాష్ట్ర  ఏటీఎఫ్ చీఫ్ హేమంత్ కర్కరేపై ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆమె…  తాజాగా బాబ్రీ మసీదు కూల్చివేతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేతలో తాను భాగస్వామినని, అందుకు తాను గర్విస్తున్నానని ఆమె అన్నారు. తాను అయెధ్యకు వెళ్లి రామాలయ నిర్మాణంలో పాలుపంచుకుంటానని, అలా చేయకుండా తనను ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు.

సాధ్వి వ్యాఖ్యలపై స్పందించిన ఎన్నికల సంఘం మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ నోటీసులు జారీ చేసింది. ఈ కామెంట్స్ పై 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని భోపాల్ జిల్లా ఎన్నికల అధికారి ఆదేశించారు.

ఈసీ తాజా నోటీసుపైనా సాధ్వి స్పందించారు. హేమంత్ కర్కరేపై చేసిన కామెంట్ ను వెనక్కితీసుకున్న ప్రజ్ఞాఠాకూర్..  బాబ్రీపై మాత్రం తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోనని స్పష్టం చేశారు. తాను అయోధ్య వెళ్లి ఆ కట్టడాన్ని ధ్వంసం చేయడంలో పాలుపంచుకున్నానని మరోసారి తేల్చిచెప్పారు. బాబ్రీపై శనివారం చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు.

మాలేగావ్ కేసులో నిందితురాలైన సాధ్వీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. భోపాల్ నుంచి కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్‌‍కు ప్రత్యర్థిగా లోక్‌సభ బరిలో దిగుతున్నారు.