అల్మాస్​పూర్​ రేపిస్ట్​ను ఉరి తీయండి

అల్మాస్​పూర్​ రేపిస్ట్​ను ఉరి తీయండి
  • చిన్నారిని రేప్​ చేసిన టీఆర్ఎస్​ నేతపై వెల్లువెత్తిన ఆగ్రహం

రాజన్నసిరిసిల్ల, వెలుగు: రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్​పూర్​లో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన టీఆర్ఎస్​నేత, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు రాధారపు శంకర్(40)ను ఉరి తీయాలంటూ ఆల్​పార్టీ లీడర్స్​ డిమాండ్​ చేశారు. దళిత, గిరిజన సంఘాలతో పాటు బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ తదితర పార్టీల ఆధ్వర్యంలో శనివారం సిరిసిల్ల అంబేద్కర్​ చౌక్​వద్ద రాస్తారోకో నిర్వహించారు. గిరిజన గ్రామాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చారు. మంత్రి  కేటీఆర్​ఫ్లెక్సీలతో పాటు  నిందితుడు శంకర్​ ఫోటోలను దహనం చేశారు. కేటీఆర్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎక్కడ ఏం జరిగినా ట్విట్టర్​లో స్పందించే మంత్రి కేటీఆర్​సొంత నియోజకవర్గంలో తన పార్టీ నేత, ముఖ్య అనుచరుడు శంకర్ ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేస్తే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. పేద దళిత, గిరిజన పిల్లల విషయంలో సర్కారు ​స్పందిస్తున్న తీరు బాధాకరంగా ఉందన్నారు. శంకర్ ను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్​ చేసి బాధిత కుటుంబానికి రూ.కోటి ఆర్థిక సాయం అందించాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్​చేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సుమారు 8 గంటలపాటు రాస్తారోకో నిర్వహించారు. దీంతో కామారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట దారిలో రాకపోకలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పాపపై అఘాయిత్యానికి పాల్పడ్డ శంకర్​కు ఉరి శిక్ష వేయాలని చిన్నారి తల్లిదండ్రులు డిమాండ్​ చేశారు. అడిషనల్​కలెక్టర్​సత్యప్రసాద్​ఘటనా స్థలానికి చేరుకొని బాధిత కుటుంబంతో మాట్లాడారు. నిందితుడికి శిక్ష పడేలా ప్రభుత్వం నుంచి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో బీజేపీ గిరిజన మోర్చా స్టేట్ ప్రెసిడెంట్ హుస్సేన్​నాయక్, జిల్లా కార్యదర్శి రెడ్డబోయిన గోపి, అన్నల్​దాస్​వేణు, దళితసంఘం నేతలు తదితరులు పాల్గొన్నారు.

కేటీఆర్ ఎందుకు  స్పందించట్లే: పొన్నం 
కేటీఆర్ ఇలాకాలో చిన్నారిపై టీఆర్ఎస్  నాయకుడు అత్యాచారానికి పాల్పడితే మినిస్టర్ కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. ఈ ఘటనలో పోలీసులు, పార్టీ నాయకులు లాబీయింగ్ చేస్తే ఊరుకోబోమన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో  మహిళలకు రక్షణ లేకుండా పోయిందని కాంగ్రెస్ పార్టీ మహిళ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చేర్ల పద్మ అన్నారు.

టీఆర్ఎస్‌ లీడర్​ను శిక్షించాలె
హైదరాబాద్‌: సిరిసిల్ల నియోజకవర్గంలోని అల్మాస్ పూర్​కు చెందిన గిరిజన చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన టీఆర్‌ఎస్‌ లీడర్‌ను కఠినంగా శిక్షించాలని ప్రోగ్రెసివ్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఉమెన్‌ (పీవోడబ్ల్యూ) స్టేట్‌ ప్రెసిడెంట్‌ వి. సంధ్య శనివారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో పసికూనలపై అరాచకాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారుల భద్రత ప్రశ్నార్థకమైందని ఆందోళన వ్యక్తం చేశారు. సాక్షాత్తు మంత్రి కేటీఆర్ ఇలాఖాలోనే ఆయన పార్టీ లీడరే ఈ దారుణానికి ఒడిగట్టాడంటే, రాష్ట్రంలో పాలన ఎలా ఉందో తెలుస్తోందని మండిపడ్డారు.

టీఆర్ఎస్ ​నుంచి శంకర్ ​సస్పెన్షన్​
ఆరేళ్ల పాపపై అత్యాచార ఘటన దురదృష్టకరమని, క్షమించరాని నేరమని టీఆర్ఎస్​ఉమ్మడి కరీంనగర్​జిల్లా పరిశీలకులు, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య పేర్కొన్నారు. శనివారం సిరిసిల్ల కేటీఆర్​ క్యాంపు ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాధారపు శంకర్​ను రైతు సమన్వయ సమితి మండల అధ్యక్ష పదవి నుంచి తొలగించడమే కాకుండా పార్టీ నుంచి సస్పెండ్​ చేస్తున్నట్లు పేర్కొన్నారు. తప్పు చేసిన వ్యక్తులను కాపాడే అవసరం టీఆర్ఎస్​ పార్టీ, నాయకులకు లేదన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వపరంగా అన్ని సహాయ సహకారాలు అందిస్తామన్నారు.

కేటీఆర్​ క్యాంప్​ ఆఫీస్​ ముట్టడి
నిందితుడు శంకర్​ను ఉరి తీయాలంటూ సిరిసిల్ల ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్ క్యాంప్​ఆఫీస్​ను ఏబీవీపీ నేత రంజిత్​ ఆధ్వర్యంలో ముట్టడించారు. ఆఫీసులోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని అరెస్ట్​ చేశారు. సిరిసిల్ల టౌన్​సీఐ అనిల్​కుమార్, రూరల్​ సీఐ ఉపేందర్​ ఆధ్వర్యంలో కేటీఆర్​ క్యాంపు ఆఫీసు దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.