మన కోచ్‌ల పవర్‌ పెంచాలె

మన కోచ్‌ల పవర్‌ పెంచాలె
  • సెకండ్‌‌ బెస్ట్‌‌ ఫారిన్‌‌ కోచ్‌‌లతో  బెస్ట్​ ఇవ్వలేం
  • ఇండియన్‌‌ కోచ్‌‌లు మంచి రిజల్ట్స్‌‌ కోసం తపిస్తారు
  • ప్లేయర్లను కోచ్‌‌లుగా మార్చే  ప్రోగ్రామ్‌‌ అవసరం
  • నేషనల్​ బ్యాడ్మింటన్ చీఫ్‌‌ కోచ్‌‌ పుల్లెల గోపీచంద్​

న్యూఢిల్లీ: ఫారినర్స్​తోపాటు ఇండియన్​ కోచ్​లను సమర్థవంతంగా ఉపయోగించుకుంటేనే బలమైన స్పోర్టింగ్​ వ్యవస్థను తయారుచేసుకోగలమని, క్రీడాభివృద్ధి కూడా సాధ్యమని నేషనల్​ బ్యాడ్మింటన్​చీఫ్‌‌ కోచ్​ పుల్లెల గోపీచంద్​ అన్నాడు. సెకండ్​ బెస్ట్​ ఫారిన్​ కోచ్​ల నుంచి ది బెస్ట్ ఆశించడం అత్యాశేనని, వాళ్లతో సెకండ్​ బెస్ట్​​ ఫలితాలే వస్తాయని గోపీచంద్​ అభిప్రాయపడ్డాడు. కోచింగ్​ వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా స్పోర్ట్స్​ అథారిటీ ఆఫ్​ ఇండియా (సాయ్​) రూపొందించిన హైపెర్ఫామెన్స్​ కోచ్​ ఎడ్యుకేషన్​ ప్రోగ్రామ్​ను  గురువారం లాంచ్​ చేశారు. వర్చువల్​గా జరిగిన ఈ కార్యక్రమంలో సెంట్రల్​ స్పోర్ట్స్​ మినిస్టర్​ కిరణ్​ రిజిజు, ద్రోణాచార్య అవార్డీ  గోపీచంద్​ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోపీచంద్​ మాట్లాడుతూ దేశంలోని  కోచ్ వ్యవస్థపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ స్పోర్ట్స్​లో మన అభివృద్ధికి ఫారిన్​ కోచ్​ల అవసరముంది. అలాగని కేవలం వాళ్లపైనే ఆధారపడకూడదు. ఫారినర్స్​తోపాటు ఇండియన్​ కోచ్​లును సరైన రీతిలో వాడుకుంటేనే వ్యవస్థ మెరుగవుతుంది. ఓ స్పోర్ట్​కు సంబంధించి మన దగ్గర ఎక్స్​పర్ట్​ లేనప్పుడు ఫారినర్స్​ పై ఆధారపడటంలో తప్పులేదు. మన జట్లు, ప్లేయర్లు కొత్త విషయాలు నేర్చుకుంటారు. కానీ ఈ విధానాన్ని అలవాటుగా చేసుకుంటేనే నష్టం జరుగుతుంది. అంతేకాక మన వ్యవస్థకు అన్యాయం చేసిన వాళ్లమవుతాం’ అని గోపీ అభిప్రాయపడ్డాడు.

అథ్లెట్​ చెబితే కోచ్​ వినాలా? 
ఇండియాలో  కోచ్​లకు ప్రాధాన్యం పెరగాల్సిన అవసరం ఉందని గోపీ అభిప్రాయపడాడ్డు.  ‘నిజానికి, ఇండియన్​ స్పోర్ట్స్​ వ్యవస్థ అథ్లెట్​ కేంద్రంగా పని చేస్తోంది. అన్నింటికంటే ముందు ఈ పద్ధతి మారాలి. కోచ్​లకు ఉన్న ప్రాధాన్యం పెరగాలి. తగినంత గుర్తింపు లేని కోచ్​ల కోణం నుంచి చూస్తే.. ఇప్పటికీ చాలామంది కోచ్​లు అసోసియేషన్లు, అడ్మినిస్ట్రేటర్లు ఏం చెబితే అదే చేస్తున్నారు. ప్లేయర్​ ఎలా చెబితే కోచ్​ అలా నడుచుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కోచ్​ కంటే అథ్లెట్​ గొప్పవాడైపోవడం ఇలాంటి వాటికి కారణం. దాంతో ప్రతి ఒక్కరూ కోచ్​ కంటే ఆ అథ్లెట్​ మాటే వింటారు. ముందుగా మనం ఈ పద్ధతిని మార్చాలి. కోచ్​ ఆధ్వర్యంలో పని చేసే వ్యవస్థను రూపొందించుకోవాలి. ఇందుకోసం కోచ్​ల పవర్​  పెంచాలి. దాంతో జవాబుదారీతనం, బాధ్యత పెరిగి కోచ్​లు మంచి రిజల్ట్స్​ చూపెడతారు. ప్రతీ అథ్లెట్ అనామకుని గానే ఓ కోచ్​ వద్ద కెరీర్​ స్టార్ట్​ చేస్తాడు. అంచెలంచెలుగా ఒక్కో మెట్టు ఎక్కి  టాప్‌‌ లెవెల్​కు చేరుకుంటాడు. ఈ క్రమంలో అనేక మంది కోచ్​ల వద్ద శిక్షణ తీసుకుంటారు. ఓ అథ్లెట్​ జర్నీలోని ప్రతీ కోచ్​కు తగిన గుర్తింపు దొరుకుతూనే ఉంటుంది.. ఓ మంచి ప్లేయర్​ మహా అయితే ఎనిమిది నుంచి పదేళ్లు బాగా పెర్ఫామ్​ చేస్తాడు. అదే మనం ఓ మంచి కోచ్​ను తయారు చేసుకోగలిగితే.. ఆ వ్యక్తి​ 30 నుంచి 40 ఏళ్లు పని చేస్తాడు. ఈ క్రమంలో ఆ కోచ్​ ఎంతమంది గొప్ప ప్లేయర్లను తయారుచేస్తాడో ఊహించలేం’ అని గోపీచంద్​ చెప్పుకొచ్చాడు.

అథ్లెట్ల మైండ్​సెట్​ మారాలి: రిజిజు
ఫారిన్​ కోచ్​లకిచ్చే ప్రాధాన్యం విషయంలో మన అథ్లెట్ల మైండ్​సెట్​ మారాలని సెంట్రల్​ స్పోర్ట్స్​ మినిస్టర్​ కిరణ్​ రిజిజు అన్నారు.‘ నేనెప్పుడు అథ్లెట్లను కలిసినా.. మేము ఒలింపిక్​ మెడల్​ తేవాలంటే మాకో ఫారిన్​ కోచ్​ కావాలని అడుగుతుంటారు. అది తప్పేం కాదు, ఇండియన్​ కోచ్​లను అవమానించడం వాళ్ల ఉద్దేశం కాదని నాకూ తెలుసు. కానీ, ఫారిన్​ కోచ్​ ఉంటేనే మెడల్​ సాధించగలమనే ఓ అపోహ అందరి మైండ్స్‌‌లో నాటుకుపోయింది. దీనిని మార్చాలనే ఈ హైపెర్ఫామెన్స్​ కోచింగ్​ ప్రోగ్రామ్​ను ప్రారంభించాం. కోచింగ్​, ట్రెయినింగ్​ కోసం ఫారినర్లు కూడా ఇండియాకు వచ్చేలా ఈ ప్రోగ్రామ్​ రూపొందించాం’ అని రిజిజు పేర్కొన్నారు. కాగా,   హైపెర్ఫామెన్స్‌‌ కోచింగ్‌‌ ప్రోగ్రామ్‌‌ ఆరు నెలల పాటు ఏడు దశల్లో నడుస్తుంది. ఇందులో భాగంగా  స్పోర్ట్స్‌‌ అథారిటీ ఆఫ్‌‌ ఇండియాకు చెందిన 250 మంది కోచ్‌‌లు బ్యాచ్‌‌ల వారీగా వివిధ కార్యక్రమాలతో ఇండియాలోని స్పోర్ట్స్‌‌ పర్సన్లను కోచ్‌‌లు తీర్చుదిద్దుతారు.

సిస్టమ్​ మనోళ్ల చేతిలోనే ఉండాలి
దేశంలో కోచింగ్​ సిస్టమ్​ అంతా ఇండియన్​ కోచ్​ల చేతిలోనే ఉండాలి. ఫారిన్​ కోచ్​లను కన్సల్టెంట్స్‌‌గా ఉపయోగించుకోవాలి.  వాళ్లను చూసి మనం నాలెడ్జ్​ పెంచుకోవడం చాలా ముఖ్యం. అదే సమయంలో వారితో ఉన్న బంధాన్ని నెమ్మదిగా తగ్గించుకోవాలి. ఎందుకంటే ఫారిన్​ కోచ్​లు మనల్ని ఎప్పుడూ సెకండ్​ బెస్ట్​గానే ఉంచుతారు. పైగా, ది బెస్ట్​ ఫారిన్​ కోచ్​లు మనకు ఎప్పటికీ దొరకరు. అదే స్థానంలో ఇండియన్​ కోచ్ ​ఉంటే ఇండియా టాప్​లో ఉండాలనే ఎప్పుడూ తపిస్తుంటాడు. కాంట్రాక్ట్​ రెన్యువల్​ లక్ష్యంగా పని చేసే ఫారిన్​ కోచ్​కంటే  బెటర్​ రిజల్ట్స్​ చూపిస్తాడు. అందువల్ల మనం  నిలకడగా మంచి రిజల్ట్స్​ సాధిస్తున్న స్పోర్ట్స్​లోని టాప్​ ప్లేయర్లపై దృష్టి పెట్టాలి. వాళ్లను ప్లేయర్ల నుంచి కోచ్​లుగా మార్చే ఓ గొప్ప ప్రోగ్రామ్​ తయారుచేయాలి.