
- రాజ్యాంగం ప్రకారమే దేశం నడుస్తుంది: ఇండియా కూటమి నేతలు
- అయోధ్య రామమందిరంపై మోదీ చేసిన బుల్డోజర్ వ్యాఖ్యలను ఖండించిన ప్రతిపక్షం
ముంబై : తాము అధికారంలోకి వస్తే పౌరుల మత స్వేచ్ఛను కాపాడుతామని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఇండియా కూటమి నాయకులు పేర్కొన్నారు. భారత రాజ్యాంగం ప్రకారమే దేశం నడుస్తుందని చెప్పారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అయోధ్య రామమందిరాన్ని బుల్డోజర్లతో కూల్చివేస్తుందని ఉత్తరప్రదేశ్ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు. బుల్డోజర్లను ఉపయోగించే సంస్కృతి తమదికాదని చురకలంటించారు. ఖర్గేతోపాటు శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్‌పవార్ సంయుక్తంగా ముంబైలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ఎన్నటికీ చేయని అంశాలపై మోదీ ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వస్తే అయోధ్య రామ మందిరానికి సంబంధించి మిగిలిపోయిన నిర్మాణాలను ఇండియా కూటమి పూర్తిచేస్తుందని చెప్పారు. కేవలం ఆలయాలేకాకుండా.. అన్ని మతాల ప్రార్థనా స్థలాల రక్షణ తమ బాధ్యత అని పేర్కొన్నారు.
రిజర్వేషన్లు ఎక్కడికీ పోవు
ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు తగ్గిస్తారని మోదీ అసత్య ప్రచారం చేస్తున్నారని, ఎవరి రిజర్వేషన్లు ఎక్కడికీ పోవని ఇండియా కూటమి నాయకులు పేర్కొన్నారు. రాజ్యాంగంలో పేర్కొన్న రిజర్వేషన్లు కొనసాగుతాయని చెప్పారు. ఆర్టికల్ 370పై మీ పార్టీ స్టాండ్ ఏంటని మోదీ అడుగుతున్నారని ఖర్గేను విలేకరులు ప్రశ్నించగా.. తాను మోదీకి సమాధానం ఇవ్వబోనని, తాము మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని అమలు చేస్తామన్నారు. మోదీ ఎక్కడికెళ్లినా సమాజంలో విభజన తీసుకురావాలని ప్రయత్నిస్తారని, ఇందుకోసం ఎన్ని అబద్ధాలైనా ఆడుతారని ఖర్గే మండిపడ్డారు. 80 కోట్లమందికి 5కిలోల ఉచిత రేషన్ ఇస్తున్నానని మోదీ అంటున్నారని, కానీ తమ సర్కారే ఆహార భద్రతా చట్టం తీసుకొచ్చిందని, ఇప్పుడు ఒక్కొక్కరికి 10 కేజీల బియ్యం ఇస్తామని హామీ ఇచ్చినట్టు చెప్పారు. ఫ్రీ రేషన్ క్రెడిట్‌ను మోదీ కొట్టేస్తున్నారని పవార్ విమర్శించారు. శివసేన (యూబీటీ)ని నకిలీ శివసేన అని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఉద్ధవ్ ఠాక్రే స్పందించారు. ఆర్ఎస్ఎస్ను కూడా నకిలీ సంఘ్ అని బీజేపీ అంటుందని చురకలంటించారు. జూన్ 4న జుమ్లా శకం ముగుస్తుందని, ఇండియా కూటమి అధికారంలోకి రాగానే అచ్ఛే దిన్ వస్తుందని ఠాక్రే అన్నారు.