తెలంగాణ వ్యాప్తంగా ప్రతి రెండు నియోజకవర్గాలకు ఒక సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేసి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్, లంచ్ అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటుకు రెండు ఎకరాల స్థలం కేటాయింపు లేదా 99 సంవత్సరాలకు లీజు తీసుకునే అంశంపై జిల్లా కలెక్టర్లతో మాట్లాడి త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
విద్యా శాఖపై సచివాలయంలో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనం, ఒకటవ తరగతి నుంచి 10 వ తరగతి వరకు ఆధునిక అవసరాలకు అనుగుణంగా సిలబస్ లో మార్పులపై సమీక్షించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం కొడంగల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో స్వచ్ఛంద సంస్థల ద్వారా అమలు చేస్తున్న బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజన పథకాన్ని తెలంగాణ వ్యాప్తంగా అమలు చేయడానికి గల అవకాశాలను పరిశీలించాలని సీఎం ఆదేశించారు.
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ (YIIRS) మొదటి విడతలో పూర్తయ్యే వాటిలో ఎక్కువగా బాలికలకు కేటాయించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. రానున్న మూడేళ్లలో ప్రతి నియోజకవర్గంలోనూ బాలురు, బాలికలకు ఒక్కొక్కటి చొప్పున వీటి నిర్మాణాలు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రస్తుతం బాలికలకు కేటాయించిన నియోజకవర్గంలో మరో విడతలో బాలురకు కేటాయించాలని సూచించారు. ఈ స్కూళ్లలో సోలార్ కిచెన్ల నిర్మాణాలను పీఎం కుసుమ్ లో చేపట్టే అవకాశాలను పరిశీలించాలని... వీటి నిర్మాణాలకు సంబంధించి బిల్లులను ఎప్పటికపుడు విడుదల చేయాలని ఆదేశించారు సీఎం.
Also Read : బల్దియాలపై జెండా ఎగరేద్దాం..రాబోయే ఎనిమిదేండ్లు మనదే అధికారం
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 23 నూతన పాఠశాల భవనాలు నిర్మాణాలు వచ్చే విద్యా సంవత్సరం నాటికి అందుబాటులోకి రావాలని చెప్పారు సీఎం. బాచుపల్లి పాఠశాలకు ప్రస్తుతం ఉన్న స్థలం సమీపంలో ఒకటిన్నర ఎకరాన్ని ఆ పాఠశాల నిర్మాణానికి కేటాయించాలని చెప్పారు. ప్రస్తుత, భవిష్యత్ అవసరాలకు తగినట్లు ఒకటి నుంచి పదో తరగతి వరకు సిలబస్ మార్పుపై కసరత్తును వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. పాలి టెక్నిక్ కళాశాలలు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చే ప్రతి విద్యార్థికి కచ్చితంగా ఉద్యోగం లభించేలా సిలబస్, బోధన అందించాలని అధికారులను ఆదేశించారు సీఎం.
