Vijay Hazare Trophy: వన్డేల్లో టీ20 ప్రాక్టీస్.. 9 సిక్సర్లతో హోరెత్తించిన పాండ్య

Vijay Hazare Trophy: వన్డేల్లో టీ20 ప్రాక్టీస్.. 9 సిక్సర్లతో హోరెత్తించిన పాండ్య

టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య అస్సలు తగ్గేదే లేదంటున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో వరుసగా రెండో మ్యాచ్ లోనూ తన విధ్వంసాన్ని కొనసాగించాడు. గురువారం (జనవరి 8) చండీఘర్ తో జరిగిన మ్యాచ్ లో తన బ్యాటింగ్ తో ప్రత్యర్థికి చుక్కలు చూపించాడు. వన్డే ఫార్మాట్ లో టీ20 తరహా ఇన్నింగ్స్ ను రుచి చూపించాడు. చండీఘర్ తో జరిగిన చివరి ఎలైట్ గ్రూప్ బి మ్యాచ్‌లో హార్దిక్ 6వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి కేవలం 31 బంతుల్లో 75 పరుగులు చేసి స్టేడియాన్ని హోరెత్తించాడు. ఈ మ్యాచ్ లో 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న పాండ్య.. ఓవరాల్ గా 9 సిక్సులు, 2 ఫోర్లున్నాయి.
 
న్యూజిలాండ్ తో జరగబోయే వన్డే సిరీస్ కు పాండ్య సెలక్ట్ కాకపోయినా విజయ్ హజారే ట్రోఫీ ఆడుతున్నాడు. ఇదే టోర్నీలో పాండ్య అంతకముందు మ్యాచ్ లో సెంచరీతో దుమ్ములేపాడు. శనివారం (జనవరి 3) విదర్భతో జరిగిన మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ముఖ్యంగా పార్థ్ రేఖడే వేసిన ఇన్నింగ్స్ 39 ఓవర్లో విశ్వరూపమే చూపించాడు. ఈ ఓవర్లో ఏకంగా 34 పరుగులు రాబట్టాడు. ఓవరాల్ గా 92 బంతుల్లోనే 133 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. పాండ్య ఇన్నింగ్స్ లో 8 ఫోర్లతో పాటు 11 సిక్సర్లు ఉన్నాయి.ఈ ఇన్నింగ్స్ ముగిసిన ఐదు రోజులకే పంద్యా మరో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే చండీఘర్ పై బరోడా 139 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన బరోడా నిర్ణీత 49.1 ఓవర్లలో 391 పరుగులకు ఆలౌటైంది. పాండ్య (75) ధనాధన్ ఇన్నింగ్స్ తోడు ప్రియాంషు మోలియా (113) సెంచరీతో అదరగొట్టాడు. విష్ణు సోలంకి (54), జితేష్ శర్మ (73) హాఫ్ సెంచరీలతో రాణించారు. లక్ష్య ఛేదనలో చండీఘర్ 40 ఓవర్లలో 242 పరుగులకు ఆలౌటైంది. పాండ్య బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లోనూ రాణించి 3 వికెట్లు పడగొట్టాడు. 

న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ కు పాండ్య:

ఆసియా కప్ లో ఫైనల్ కు ముందు మోకాలి గాయంతో ఇబ్బంది పడిన పాండ్య పాకిస్థాన్ తో జరిగిన తుది సమరానికి దూరమయ్యాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో ఆ తర్వాత జరిగిన ఆసీస్ సిరీస్ కు అందుబాటులో లేడు. సర్జరీ నుంచి తప్పించుకున్న పాండ్య గత ఏడాది డిసెంబర్ లో సౌతాఫ్రికాతో జరిగిన 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడి అద్భుతంగా రాణించాడు. వరుస గాయాలు పాండ్యను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఆల్ రౌండర్ గా పాండ్య సేవలు టీమిండియా చాలా కీలకం. టీ20 వరల్డ్ కప్ ముగిసేవరకు బీసీసీఐ పాండ్యను కేవలం టీ20లకే పరిమితం చేయనున్నారు. దీంతో వన్డే సిరీస్ ఆడకపోయినా టీ 20 సిరీస్ లో కనిపించనున్నాడు.