గ్రేటర్ నోయిడా: తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్.. సీనియర్ నేషనల్ బాక్సింగ్‌లో వరుస విజయాలతో హోరెత్తిస్తోంది. గురువారం జరిగిన విమెన్స్ 51 కేజీ క్వార్టర్ ఫైనల్లో నిఖత్ 5–0తో లాంచెన్‌బీ చాను టోంగ్‌బ్రామ్ (మణిపూర్)ను చిత్తు చేసి సెమీస్‌లోకి దూసుకెళ్లింది. బౌట్ ఆరంభం నుంచే హుక్స్, కట్స్‌తో పంచుల వర్షం కురిపించిన నిఖత్.. ప్రత్యర్థి బాక్సర్‌కు కోలుకునే చాన్స్ కూడా ఇవ్వలేదు.
దాంతో రిఫరీలు ఏకగ్రీవంగా విన్నర్‌గా ప్రకటించారు. 54 కేజీల్లో పూనమ్ పూనియా 4–1తో డిఫెండింగ్ చాంపియన్ సాక్షి చౌదరికి షాకిచ్చింది. 75 కేజీల బౌట్‌లో లవ్లీనా బోర్గోహైన్ ఆర్‌ఎస్‌సీ ద్వారా మౌనిక కళ్యాణం (ఏపీ)పై నెగ్గింది. వరల్డ్ చాంపియన్ మీనాక్షి హుడా (48 కేజీ), నీతూ గంగాస్ (51 కేజీ), ప్రీతి పవార్ (54 కేజీ) సునాయస విజయాలతో సెమీస్‌లోకి అడుగుపెట్టారు. మెన్స్ కేటగిరీలో ప్రవీణ్ హుడా (55 కేజీ) మోచేతి గాయంతో బౌట్ నుంచి తప్పుకున్నాడు. జాదుమణి సింగ్ (55 కేజీ) 5–0తో నిఖిల్‌పై నెగ్గి ముందంజ వేశాడు. పవన్ బర్తాల్ (55 కేజీ), సచిన్ సివాచ్ (60 కేజీ), అభినాశ్ జమ్వాల్ (65 కేజీ) కూడా తమ ప్రత్యర్థులపై విజయాలు సాధించారు.
