గ్రేట్ జాబ్ బ్రదర్: అర్ధరాత్రి ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ చేసిన పనికి ఇంటర్నెట్ ఫిదా

గ్రేట్ జాబ్ బ్రదర్: అర్ధరాత్రి ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ చేసిన పనికి ఇంటర్నెట్ ఫిదా

తమిళనాడులో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా డెలివరీ యాప్స్‌లో మనం ఏది ఆర్డర్ చేసినా.. డెలివరీ పార్టనర్లు వచ్చి ఇచ్చేసి వెళ్లిపోతారు. అది వారి పని. కానీ... తమిళనాడుకు చెందిన ఒక బ్లింకిట్ డెలివరీ ఏజెంట్ మాత్రం తన విధి కంటే మానవత్వమే ముఖ్యమని నిరూపించాడు. అర్ధరాత్రి వేళ వచ్చిన ఒక ఆర్డర్ అతడిలో అనుమానాన్ని రేకెత్తించింది. ఆ అనుమానమే ఒక మహిళ ప్రాణాన్ని కాపాడేలా చేసింది.

అర్ధరాత్రి సమయంలో ఒక మహిళా కస్టమర్ నుండి మూడు ప్యాకెట్ల ఎలుకల మందు కోసం ఆర్డర్ వచ్చింది. సాధారణంగా క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో ఇవన్నీ సాధారణమే. కానీ సమయం కాని సమయంలో ఈ ఆర్డర్ రావడం ఆ డెలివరీ ఏజెంట్‌కు వింతగా అనిపించింది. తీరా అతను కస్టమర్ లోకేషన్‌కు చేరుకున్నాక.. అక్కడ పరిస్థితి చూసి షాక్ అయ్యాడు.

ఆ మహిళ తీవ్రంగా ఏడుస్తూ కనిపించడంతో డెలివరీ ఏజెంట్ మనసు చలించింది. ఆ ప్యాకెట్లను ఆమె చేతికి ఇవ్వడానికి అతని మనసు ఒప్పుకోలేదు. నిజం చెప్పండి.. మీరు ఆత్మహత్య చేసుకోవడానికే కదా ఇది ఆర్డర్ చేశారు? అని సూటిగా ఆమెను అడిగాడు. మొదట ఆమె నిరాకరించినా.. అతను వదలకుండా ఆమెతో మాట్లాడాడు. ఎలుకల సమస్య ఉంటే సాయంత్రమే ఆర్డర్ చేయొచ్చు, లేదా రేపు చూసుకోవచ్చు. అర్ధరాత్రి ఆర్డర్ చేయాల్సిన అవసరం లేదని ఆమెకు నచ్చజెప్పాడు. పైగా జీవితంలో ఏ సమస్య వచ్చినా ప్రాణాలు తీసుకోవడం పరిష్కారం కాదని, ధైర్యంగా ఉండాలని ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చాడు. చివరికి ఆమెను ఒప్పించి, ఆ ఆర్డర్‌ను అక్కడికక్కడే క్యాన్సిల్ చేశాడు.

మహిళకు నచ్చజెప్పి ఆమె ప్రాణాలను కాపాడటంపై వీడియో చేసిన సదరు డెలివరీ ఏజెంట్ "ఈ రోజు నేను ఏదో గొప్ప పని సాధించాననే తృప్తి నాలో ఉంది" అంటూ అతను సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ఇప్పుడు 74 లక్షలకు పైగా వ్యూస్‌తో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆ డెలివరీ ఏజెంట్‌ను బ్లింకిట్ సంస్థ అధికారికంగా గుర్తించి సన్మానించాలని సోషల్ మీడియాలో చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. 

దీనిపై ఒక యూజర్ కామెంట్ చేస్తూ ఒకవేళ రోబో వచ్చి ఉంటే డెలివరీ ఇచ్చి వెళ్లిపోయేది, కానీ ఒక మనిషి కాబట్టే ప్రాణం నిలబడిందన్నారు. సాంకేతికత కంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గొప్పదంటూ మరొకరు కొనియాడారు. ఇలాంటి సున్నితమైన వస్తువులను ఆర్డర్ చేసినప్పుడు పోలీసులకు లేదా రక్షణ వ్యవస్థలకు అలర్ట్ వెళ్లేలా యాప్స్‌లో మార్పులు చేయాలని మరికొందరు సూచిస్తున్నారు. మెుత్తానికి డెలివరీ బాయ్ సమయస్పూర్తి నిజంగా గ్రేట్ అంటూ సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది.