అత్తతో వంట గొడవ : పెద్ద కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య

అత్తతో వంట గొడవ : పెద్ద కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య

బెంగళూరులో వరుసగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల ఆత్మహత్యలు చోటుచేసుకోవడం తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది. వారం రోజుల వ్యవధిలోనే ఇద్దరు టెకీలు ప్రాణాలు కోల్పోవడం ఐటీ వర్గాల్లో కలకలం రేపుతోంది. కుటుంబ కలహాలు, వరకట్న వేధింపులే ఈ ఘటనలకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం..35 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సుష్మా ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఐదేళ్ల క్రితం పునీత్ కుమార్‌ను వివాహం చేసుకున్న ఆమెకు నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసిన సుష్మాకు అత్తింటి వారితో తరచూ విభేదాలు ఉన్నట్లు సమాచారం.

మంగళవారం వంట విషయంలో అత్త కల్పనతో జరిగిన వాగ్వాదం తర్వాత ఆమె తీవ్ర మనస్తాపానికి గురై ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. అదనపు కట్నం కోసం వేధింపులు జరిగాయని సుష్మా బంధువులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఫిర్యాదు మేరకు భర్త పునీత్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేసి, అత్త పాత్రపై కూడా వివిధ కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.

వారం రోజుల్లో రెండో ఘటన

ఇదే నగరంలో ఫిబ్రవరి 28న 27 ఏళ్ల టెకీ విద్యాజ్యోతి ఆత్మహత్య చేసుకుంది. MEI లేఅవుట్ లో జరిగిన ఈ ఘటనలో కుటుంబ కలహాలే కారణమని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. రెండేళ్ల క్రితం వివాహం అయిన విద్యాజ్యోతి కూడా వ్యక్తిగత సమస్యలతోనే ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

ఐటీ రంగంలో పనిచేస్తున్న యువతలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి, కుటుంబ సమస్యలు, సామాజిక ఒత్తిళ్లు వంటి అంశాలు చర్చనీయాంశమవుతున్నాయి. వరుస ఘటనల నేపథ్యంలో టెకీల  మానసిక ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.