జైలు గదుల్లో మొబైల్ ఛార్జింగ్ పాయింట్లా..? గోవా సెంట్రల్ జైలులో జామర్స్ పెట్టమన్న కోర్టు

జైలు గదుల్లో మొబైల్ ఛార్జింగ్ పాయింట్లా..? గోవా సెంట్రల్ జైలులో జామర్స్ పెట్టమన్న కోర్టు

గోవాలోని కోల్వాలే సెంట్రల్ జైలులో వెలుగుచూసిన విస్తుగొలిపే అంశాలపై బాంబే హైకోర్టు గోవా బెంచ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జైలు నిబంధనలను తుంగలో తొక్కుతూ.. ఖైదీల కోసం సెల్‌ల లోపలే మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయడంపై జస్టిస్ శ్రీరామ్ వి. షిర్సాత్ విస్మయం వ్యక్తం చేశారు. అధికారుల అనుమతి లేకుండా జైలు గదుల్లో విద్యుత్ పాయింట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఇది న్యాయస్థానం మనస్సాక్షిని దిగ్భ్రాంతికి గురిచేస్తోందంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. జైలు లోపల ఫోన్ ఛార్జింగ్ సౌకర్యాలు ఉన్నాయంటే.. అక్కడ మొబైల్ ఫోన్ల వినియోగం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని కోర్టు పేర్కొంది.

ఒక హత్య కేసులో నిందితుడైన చందు పాటిల్ అనే ఖైదీ జైలు నుంచే బాధితుడి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడటంపై దాఖలైన పిటిషన్‌ను విచారిస్తూ కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. జైలులోకి డ్రగ్స్, మొబైల్ ఫోన్లు వంటి నిషేధిత వస్తువులు ఇంత సులభంగా ఎలా చేరుతున్నాయని జడ్జి ప్రశ్నించారు. జైలు అధికారులు రోజూ తనిఖీలు చేస్తున్నామని చెబుతున్నప్పటికీ.. అవి కేవలం కంటితుడుపు చర్యలుగానే ఉన్నాయని కోర్టు అభిప్రాయపడింది. అధికారుల నిర్లక్ష్యం లేదా సహకారం లేకుండా ఇలాంటివి సాధ్యం కాదని అనుమానం వ్యక్తం చేస్తూ.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

జైలులో మొబైల్ సిగ్నళ్లను అడ్డుకోవడానికి వెంటనే జామర్ నెట్‌వర్క్ ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది. అయితే ఈ జామర్ల వల్ల జైలు పరిసరాల్లో ఉండే సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని స్పష్టం చేసింది. కేవలం మొబైల్ దొరికిన ఖైదీని శిక్షించడం వల్ల సమస్య పరిష్కారం కాదని, ఈ అక్రమాల వెనుక ఉన్న అసలు మూలాలను వెలికితీయాలని కోర్ట్ సూచించింది. ఇందుకోసం జైలు సిబ్బంది జవాబుదారీతనాన్ని పెంచేలా కొత్త నిబంధనలు రూపొందించాలని కూడా ఆదేశించారు. 

►ALSO READ | ఐఆర్‌సీటీసీ కుంభకోణం..లాలూ కుటుంబంపై ఢిల్లీ కోర్టు కీలక వ్యాఖ్యలు

ఖైదీలు వెళ్లే తనిఖీ కేంద్రాల వద్ద, ములాఖత్ గదుల్లో తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఖైదీలను వ్యక్తిగతంగా సోదా చేసేటప్పుడు కూడా సీసీటీవీ నిఘా ఉండాలని స్పష్టం చేసింది. ప్రతిరోజూ రికార్డు అయ్యే ఈ సీసీటీవీ ఫుటేజీని పెన్ డ్రైవ్‌లలో భద్రపరిచి, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆధీనంలో ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. ఖైదీలకు ఇచ్చే చిన్నపాటి శిక్షలు వారిని మరింతగా తెగించేలా చేస్తున్నాయని, ఇకపై కాల్ డేటా రికార్డులు, సెల్ టవర్ లొకేషన్ల ఆధారంగా లోతైన దర్యాప్తు జరగాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై జనవరి 20, 2026 లోపు వివరణ ఇవ్వాలని జైలు పరిపాలన విభాగాన్ని ఆదేశించింది.