మూడు జిల్లాలుగా మెగా హైదరాబాద్.!

మూడు జిల్లాలుగా మెగా హైదరాబాద్.!

జిల్లాల సరిహద్దుల గజిబిజిని సరిదిద్దేలా భౌగోళిక స్వరూపంలో మార్పు చేర్పులు జరగనున్నాయి. పరిపాలన వికేంద్రీకరణ పేరుతో గత ప్రభుత్వం హడావుడిగా, అశాస్త్రీయంగా చేపట్టిన జిల్లాల విభజన వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి ఈ మేరకు ప్రకటన చేశారు. 

తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపై ఉన్నతాధికారులతో భేటీ అయి జిల్లాల సరిహద్దుల మార్పు, మెగా హైదరాబాద్​లో కొత్త జిల్లాల ఏర్పాటుపై చర్చించారు. ఈ లెక్కన అతి త్వరలోనే జిల్లాల పునర్విభజన, సరిహద్దులు సవరించడం తప్పదని తెలుస్తున్నది. ఈ మేరకు జిల్లా కేంద్రాల నుంచి మండలాలకు మధ్య ఉన్న భౌగోళిక దూరాలు, ప్రజల నుంచి వస్తున్న వినతులను పరిగణనలోకి తీసుకుని సమగ్ర నివేదిక రూపొందిస్తున్నారు. ఇటీవల మెగా హైదరాబాద్​గా ఏర్పడిన జీహెచ్ఎంసీని సైతం మూడు జిల్లాలుగా ఏర్పాటు చేయడంపైనా కసరత్తు ప్రారంభించారు. కాగా,  కేంద్రం చేపట్టబోయే జనగణనకు సంబంధించి జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దులను డిసెంబర్ 31నే అధికారులు ఫిక్స్ చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు జిల్లాల సరిహద్దులు మార్చడం, కొత్త జిల్లాల ఏర్పాటు లాంటివి చేస్తే తలెత్తే సమస్యలనూ అధికారులు ప్రభుత్వం దృష్టికి తెచ్చినట్లు తెలుస్తున్నది. 

మూడు జిల్లాలుగా ‘మెగా హైదరాబాద్’ 

హైదరాబాద్ మహానగరం నానాటికీ విస్తరిస్తుండడంతో ఇక్కడి జిల్లాల స్వరూపాన్ని పూర్తిగా మార్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్- జిల్లాల పరిధిలో భౌగోళిక అసమానతలు ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్ జిల్లా విస్తీర్ణం తక్కువగా ఉండగా, మిగిలిన రెండు జిల్లాలు పరిపాలనకు అందనంత విస్తారంగా ఉన్నాయి. అదే సమయంలో ఓఆర్​ఆర్ అనుకుని, లోపల ఉన్న అన్ని మున్సిపాలిటీలు జీహెచ్​ఎంసీలో విలీనం చేయడంతో మెగా హైదరాబాద్​గా జీహెచ్​ఎంసీ అవతరించింది. ఇప్పుడు దీన్ని దృష్టిలో ఉంచుకుని, ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న ప్రాంతాన్ని కలుపుకొని మూడు సమాన స్థాయి జిల్లాలుగా విభజించే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ విధానం వల్ల ట్రాఫిక్ నిర్వహణ, శాంతి భద్రతలు, మున్సిపల్ సేవలను మరింత సమర్థవంతంగా ప్రజలకు అందించవచ్చని అధికారులు భావిస్తున్నారు. దీనిపై సమగ్ర స్టడీ చేసి నివేదిక ఇవ్వాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తాజాగా ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు.