Sivakarthikeyan: 'పరాశక్తి'కి సెన్సార్ గ్రీన్ సిగ్నల్.. జనవరి 10న థియేటర్లలోకి రెడీ!

 Sivakarthikeyan: 'పరాశక్తి'కి సెన్సార్ గ్రీన్ సిగ్నల్..  జనవరి 10న థియేటర్లలోకి రెడీ!

తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్, సుధా కొంగరల భారీ పీరియాడిక్ డ్రామా 'పరాశక్తి' . అయితే ఈ సినిమా సెన్సార్ బోర్డు వద్ద పెండింగ్ లో ఉండటంతో విడుదలపై సందిగ్ధత నెలకొంది.  ఇది నిర్మాతలను, అభిమానులను ఆందోళనకు గురిచేసింది. అయితే ఇప్పుడు సెన్సార్ చిక్కులు, టైటిల్ వివాదాలు, షూటింగ్ అభ్యంతరాల వంటి ఎన్నో ఆటంకాలను దాటుకుని ఈ చిత్రం జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది.

 సెన్సార్ క్లియరెన్స్‌..

'పరాశక్తి' సినిమాకు సంబంధించి  తొలుత సెన్సార్ బోర్డు సూచించిన 23 కోతలపై దర్శకురాలు సుధా కొంగర రివైజింగ్ కమిటీని ఆశ్రయించారు. అక్కడ కూడా కొన్ని మార్పుల విషయంలో పేచీ రావడంతో సినిమా విడుదలవుతుందా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది. అయితే, శుక్రవారం ఉదయం సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి 'యూ/ఏ' (U/A) సర్టిఫికెట్ జారీ చేసింది. దీంతో డాన్ పిక్చర్స్ అధినేత ఆకాష్ భాస్కరన్ సోషల్ మీడియా వేదికగా "తమిళమే గెలుస్తుంది" అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ వార్త అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

కథా నేపథ్యం

1960వ దశకంలో తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమాల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. రాజకీయ పరిస్థితులు, ఇద్దరు స్నేహితుల మధ్య ఉండే భావోద్వేగాల కలయికగా ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాను సుధా కొంగర తీర్చిదిద్దారు. శివకార్తికేయన్‌కు సరసన శ్రీలీల, అథర్వ మురళి, రవిమోహన్ కీలక పాత్రల్లో నటించారు. సుమారు 150 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. 

►ALSO READ | Jigrees on OTT: ఓటీటీలో ‘జిగ్రీస్’ సునామీ.. సందీప్ రెడ్డి వంగా సపోర్ట్‌తో దూసుకుపోతున్న నవ్వుల జాతర!

సంక్రాంతి రేసులో..

 తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సీజన్ సందర్భంగా భారీ పోటీ ఉంది. ప్రభాస్ 'ది రాజా సాబ్' ఇప్పటికే సందడి చేస్తుంది.  జనవరి12న  మెగా స్టార్ చిరంజీవి నటించిన 'మన శంకరవరప్రసాద్ గారు' రిలీజ్ అవుతోంది. జనవరి 13న 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'. కోర్టు సమస్య తీరిపోతే  జనవరి10 నుంచే విజయ్ 'జననాయగన్' థియేటర్లలో సందడి చేయనుంది.  జనవరి 14న 'నారీ నారీ నడుమ మురారి', 'అనగనగా ఒక రాజు' వంటి సినిమాలు క్యూలో ఉన్నాయి.  థియేటర్ల లభ్యత , భారీ పోటీని దృష్టిలో ఉంచుకుని, డిమాండ్ మేరకు చిత్రబృందం నాలుగు రోజుల ముందే అంటే జనవరి 10నే సినిమాను విడుదల చేస్తోంది. తమిళం, తెలుగులో ఏకకాలంలో విడుదలవుతున్న 'పరాశక్తి' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి!