డిసెంబర్ 2025 నెలలో భారత మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలో ఆసక్తికరమైన మార్పులు చోటుచేసుకున్నాయి. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా గణాంకాల ప్రకారం.. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలోకి వచ్చే పెట్టుబడులు నవంబర్‌తో పోలిస్తే డిసెంబర్‌లో 6 శాతం తగ్గి రూ.28వేల 054 కోట్లకు చేరుకున్నాయి. డిసెంబర్ 2024తో పోలిస్తే ఈ తగ్గుదల ఏకంగా 32 శాతంగా ఉండటం ఆశ్చర్యకరం. మార్కెట్ ఒడిదుడుకులు, వాల్యుయేషన్ల పట్ల ఇన్వెస్టర్లలో నెలకొన్న అప్రమత్తతే ఇందుకు ప్రధాన కారణమని నిపుణులు భావిస్తున్నారు.
మరోవైపు.. ఎస్ఐపీ పెట్టుబడులపై భారతీయ ఇన్వెస్టర్ల నమ్మకం భారీగా పెరిగింది. డిసెంబర్‌లో SIP ఇన్ ఫ్లోలు రికార్డు స్థాయిలో రూ.31వేల 002 కోట్లకు చేరుకున్నాయి. 2025 లో మొత్తం SIP పెట్టుబడులు రూ.3 లక్షల కోట్ల మైలురాయిని దాటడం విశేషం. అయితే ఇక్కడే ఒక హెచ్చరిక గంట కూడా మోగింది. అదే సిప్ స్టాపేజ్ రేషియో 85 శాతానికి పెరగడం ఆందోళన కలిగించటం. అంటే ప్రతి 100 కొత్త SIPలు ప్రారంభమవుతుంటే.. దానికి సమానంగా సుమారు 85 పాత SIPలు నిలిచిపోతున్నాయి. ప్రాఫిట్ బుక్కింగ్ లేదా మార్కెట్ భయాల వల్ల రిటైల్ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను మధ్యలోనే ఆపివేస్తున్నట్లు ఇది సూచిస్తోంది.
వివిధ మ్యూచువల్ ఫండ్ కేటగిరీలను పరిశీలిస్తే.. డిసెంబర్ నెలలో ఫ్లెక్సీ-క్యాప్ ఫండ్స్ అత్యధికంగా రూ.10వేల 019 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. మిడ్-క్యాప్, లార్జ్ & మిడ్-క్యాప్ ఫండ్లలోకి కూడా భారీగానే పెట్టుబడులు వచ్చాయి. అయితే స్మాల్-క్యాప్, సెక్టోరల్ ఫండ్లలో పెట్టుబడులు గత నెలతో పోలిస్తే తగ్గాయి.
ముఖ్యంగా గోల్డ్ ఈటీఎఫ్ లలోకి పెట్టుబడులు ఏకంగా 211 శాతం పెరగడం చూస్తుంటే.. ఇన్వెస్టర్లు సురక్షితమైన ఆస్తుల వైపు మొగ్గు చూపుతున్నట్లు అర్థమవుతోంది. తెలుగు ఇన్వెస్టర్లు గమనించాల్సింది ఏంటంటే.. మార్కెట్ అస్థిరంగా ఉన్నప్పుడు SIPలను ఆపడం కంటే, దీర్ఘకాలిక లక్ష్యాల కోసం క్రమశిక్షణతో పెట్టుబడిని కొనసాగించడమే సరైన వ్యూహం. ఇందుకోసం పరిస్థితులకు అనుగుణంగా పెట్టుబడి స్కీమ్స్ మార్చుకోవటం కూడా మంచి రాబడులకు ముఖ్యం.
