గగనతలం క్లోజ్.. పెరిగిన జెట్ ఫ్యూయెల్: రోజూ కోట్లలో నష్టపోతున్న భారత విమాన సంస్థలు

గగనతలం క్లోజ్.. పెరిగిన జెట్ ఫ్యూయెల్: రోజూ కోట్లలో నష్టపోతున్న భారత విమాన సంస్థలు

పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు కేవలం సరిహద్దులకే పరిమితం కాకుండా.. భారత విమానయాన రంగాన్ని కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య సాగుతున్న భీకర పోరుతో గగనతలం మూతపడటం, విమాన సర్వీసులు రద్దు కావడంతో దేశీయ విమానయాన సంస్థలు రోజుకు కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోతున్నాయి. అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ HSBC లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం.. ఈ యుద్ధం వల్ల ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్‌జెట్ వంటి సంస్థల కెపాసిటీ భారీగా పడిపోయింది.

ఏ విమాన సంస్థపై ఎంత ప్రభావం?
యుద్ధం కారణంగా మిడిల్ ఈస్ట్, యూరప్ దేశాలకు వెళ్లే విమానాలు నిలిచిపోయాయి. ఈ ప్రభావం ఎయిర్ ఇండియాపై అత్యధికంగా ఉంది. ఆ సంస్థ సామర్థ్యంలో దాదాపు 40 శాతానికి పైగా కోత పడింది. ఇక స్పైస్‌జెట్ విషయానికి వస్తే 32 శాతం, ఇండిగో 20 శాతం మేర తమ సర్వీసులను రద్దు చేసుకున్నాయి. ముఖ్యంగా యూరప్, అమెరికా వెళ్లే విమానాలు ఇరాన్ లేదా పాకిస్థాన్ గగనతలం మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆ దారులు మూతపడటంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లడం వల్ల ప్రయాణ సమయం పెరగడమే కాకుండా.. ఇంధన ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయని కంపెనీలు చెబుతున్నాయి.

ALSO READ : శ్రీలంక తీరంలో ఇరాన్ నౌకపై సబ్ మెరైన్ ఎటాక్ 

కేవలం సర్వీసుల రద్దు వల్లే కాకుండా.. నిర్వహణ వ్యయం పెరగడం వల్ల విమాన సంస్థలు భారీగా నష్టపోతున్నాయి. HSBC లెక్కల ప్రకారం.. ఇండిగో సంస్థ రోజుకు రూ.4వేల 5-50 కోట్ల ఆదాయాన్ని, అలాగే రూ.4-5 కోట్ల లాభాన్ని కోల్పోతోందట. స్పైస్‌జెట్ రోజువారీ ఆదాయం రూ.5.5 కోట్ల మేర ఆవిరవుతోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇండిగో కంపెనీ నాలుగో త్రైమాసిక లాభాల్లో దాదాపు 6 శాతం మేర తగ్గుదల కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది.

పెరగనున్న టికెట్ ధరలు:
యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు భగ్గుమంటున్నాయి. జెట్ ఫ్యూయల్ ధర ఒక్క డాలర్ పెరిగినా.. అది ఇండిగో వార్షిక ఫ్యూయెల్ బిల్లుపై రూ.300 కోట్ల అదనపు భారాన్ని మోపుతుంది. ఈ భారాన్ని తగ్గించుకోవడానికి విమాన సంస్థలు విమాన టికెట్ల ధరలను పెంచే యోచనలో ఉన్నాయి. దీనివల్ల సామాన్య ప్రయాణికులపై భారీ భారం పడుతుంది.

ALSO READ : హార్ముజ్ మూసేయొద్దు..ఇరాన్ కు సూచించిన చైనా

స్పైస్‌జెట్ వంటి సంస్థలు ఇప్పటికే విమానాలను లీజుకు తీసుకున్నందున, విమానాలు నడపకపోయినా అద్దెలు చెల్లించాల్సి రావడం ఆ సంస్థకు మరిన్ని కష్టాలను తెచ్చిపెడుతోంది. అయితే దీర్ఘకాలంలో ఇండిగో వంటి ఆర్థికంగా బలమైన సంస్థలు ఈ సంక్షోభాన్ని అధిగమిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. పశ్చిమాసియాలో శాంతి నెలకొంటే తప్ప భారత విమానయాన రంగం మళ్లీ సాధారణ స్థితికి రావడం కష్టంగా కనిపిస్తోంది ప్రస్తుత పరిస్థితుల్లో.